రోహిత్ శర్మ ఆ ముచ్చట ఈ ఫస్ట్ వన్డేలో తీర్చేస్తాడా..?
టీమిండియా స్టార్ బ్యాటర్, ఫ్యాన్స్ ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకునే రోహిత్ శర్మ మరో అద్భుతానికి అతి సమీపంలో ఉన్నాడు.;
టీమిండియా స్టార్ బ్యాటర్, ఫ్యాన్స్ ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకునే రోహిత్ శర్మ మరో అద్భుతానికి అతి సమీపంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో... ఈ రోజు రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి వన్డేలోనే ఆ సరికొత్త రికార్డ్ సృష్టించాలని అభిమానులు కోరుతున్నారు. వాస్తవానికి అది రోహిత్ కి పెద్ద విషయం కాదు.. ఎందుకంటే అది మూడు సిక్స్ ల పనే!
అవును... టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మరో అద్భుతానికి చేరువలో ఉన్నాడు. ఈ రోజు సౌతాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ తలపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో... తన వరల్డ్ రికార్డుకు అవసరమైన మూడు సిక్స్ లను ఈ మ్యాచ్ లోనే రోహిత్ శర్మ సాధించాలని అభిమానులు కోరుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... చాలామంది బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టే బంతుల్లో బౌన్సర్లు ఒకటి. అయితే రోహిత్ శర్మకు మాత్రం ఆ బౌన్సర్లు పెద్ద విషయం కాదు. ఎందుకంటే.. ఆ బౌన్సర్లను అలవోకగా సిక్స్ లుగా మార్చే సామర్థ్యం హిట్ మ్యాన్ కు పుష్కలంగా ఉంది. అలా ఆడే ఇప్పటివరకూ వన్డేల్లో 349 సిక్స్ లు బాదేశాడు.
వాస్తవానికి వన్డేల్లో అత్యధిక సిక్స్ ల రికార్డ్ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పేరున ఉంది. అతడు 351 సిక్స్ లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో 349 సిక్స్ లతో హిట్ మ్యాన్ ఉన్నాడు. ఈ క్రమంలో రోహిత్ రెండు సిక్స్ లు కొడితే అఫ్రీదితో సమం అవుతాడు.. ఆ రెండింటికి ఇంకోటి జత చేస్తే అతన్ని అదిగమించి ఫస్ట్ ప్లేస్ ను కైవసం చేసుకుంటాడు.
కాగా ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2027లో సౌతాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇటీవల ముగిసిన ఆసిస్ టూర్ లోనూ రాణించాడు.
ఇక, ఇప్పటివరకూ 276 వన్డే మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ 11,370 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ లలో సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీ తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో 33 సెంచరీలు, 59 అర్ధ సెంచరీలు, 1066 ఫోర్లు, 346 సిక్స్ లు ఉన్నాయి. వన్డేల్లో రోహిత్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 264.
మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన హిట్ మ్యాన్... అంబాసిడర్ గా ఉండటం చాలా గౌరవంగా ఉందని.. గత ఏడాది లాగానే మనం ఈ సారి మ్యాజిక్ సృష్టిస్తామని ఆశిస్తున్నానని అన్నారు. అయితే.. ఈ ప్రపంచ కప్ గెలవడం చాలా పెద్ద పని అని తెలిపారు.
వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్స్ లు బాదిన టాప్ 5 బ్యాటర్స్ వీళ్లే...
1. షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్) - 351
2. రోహిత్ శర్మ (భారత్) - 349*
3. క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 331
4. సనత్ జయసూర్య (శ్రీలంక) - 270
5. ఎంఎస్ ధోని (భారత్) - 229