క్రికెట్లో పాలిటిక్స్.. జింబాబ్వే గ‌తి ప‌ట్ట‌నున్న మ‌రో దేశం!

క్రీడ‌ల్లో రాజ‌కీయాల‌కు చోటు ఉండ‌కూడ‌దు..! ఇది ప్రాథ‌మికంగా స్పోర్ట్స్ నిర్దేశించుకున్న రాజ్యాంగం.;

Update: 2026-01-17 02:30 GMT

క్రీడ‌ల్లో రాజ‌కీయాల‌కు చోటు ఉండ‌కూడ‌దు..! ఇది ప్రాథ‌మికంగా స్పోర్ట్స్ నిర్దేశించుకున్న రాజ్యాంగం. అందుకే క్రీడ‌ల్లో ఎలాంటి రాజ‌కీయ జోక్యం జ‌రిగిన‌ట్లు క‌నిపించినా ఒలింపిక్స్ వంటి క్రీడ‌లలో పాల్గొనేందుకు అవ‌కాశం లేకుండా చేస్తారు. ఒలింపిక్ క‌మిటీలే కాదు.. ఇత‌ర చాలా క్రీడా సంఘాలు కూడా ఇదే ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తాయి. ఇలానే, క్రికెట్ లోనూ చేయాల‌ని చూసినా సాధ్యం కాలేదు. కానీ, క్రికెట్ లో రాజ‌కీయాల కార‌ణంగా న‌ష్ట‌పోయిన దేశాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్ గా ఉన్న ద‌క్షిణాఫ్రికా.. న‌ల్ల జాతి వారిపై వ‌ర్ణ వివ‌క్ష కార‌ణంగా 21 ఏళ్ల సుదీర్ఘ కాలం అంత‌ర్జాతీయ క్రికెట్ లో నిషేధం ఎదుర్కొంది. ఫ‌లితంగా 1970-91 మ‌ధ్య కాలంలో ఆ దేశం నుంచి మేటి క్రికెట‌ర్లు ప్ర‌పంచ స్థాయిలో ఆడ‌లేక‌పోయారు. మ‌రో దేశం జింబాబ్వే.. అక్క‌డి పాల‌కులు తెల్ల జాతి వారిపై క‌క్ష క‌ట్ట‌డంతో ప్ర‌తిభావంతులైన క్రికెట‌ర్లు దేశం విడిచి వెళ్లారు. గత 20 ఏళ్ల‌లో ఆర్థికంగానూ దేశంలో తీవ్ర ద్ర‌వ్యోల్బ‌ణం త‌లెత్త‌డంతో జింబాబ్వే క్రికెట్ ప‌త‌న‌మైంది. 2000 సంవ‌త్స‌రంలో ప్ర‌ధాన జ‌ట్ల‌ను ఓడించిన జింబాబ్వే ఇప్పుడు చిన్న జ‌ట్ల స్థాయికి ప‌డిపోయింది.

బంగ్లా నెత్తిన చెయ్యి పెట్టుకుంటోందా?

ఇప్పుడు మ‌రో దేశం కూడా జింబాబ్వే బాట‌లోనే ప్ర‌యాణం సాగిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అందులోనూ భార‌త్ తో పెట్టుకుని త‌మ నెత్తిన తామే చెయ్యి పెట్టుకుంటోంద‌నే అభిప్రాయం వ్య‌క్త అవుతోంది. తాజాగా దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను అదుపు చేయ‌లేక.. బంగారు కొండ వంటి భార‌త్ పై విషం చిమ్ముతూ త‌న గొయ్యి తానే త‌వ్వుకుంటోందని విశ్లేష‌కులు అంటున్నారు. ఇదంతా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) గురించి అని ప్ర‌త్యేకంగా చెప్ప‌కుండానే తెలిసిపోయి ఉంటుంది.

భార‌త్ లో మ్యాచ్ లు వ‌ద్దంటారా?

ప్ర‌పంచంలోని ఏ దేశ క్రికెట్ బోర్డు అయినా.. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఒక సిరీస్ ఆడ‌దాం అని ప్ర‌తిపాద‌న చేస్తే ఎగిరి గంతేస్తాయి. కానీ, బంగ్లాదేశ్ మాత్రం భార‌త్ లో జ‌ర‌గ‌నున్న టి20 ప్ర‌పంచ క‌ప్ లో ఆడ‌బోం అని సంకేతాలు పంపుతోంది. వ‌చ్చే నెల 7 నుంచి మొద‌లుకానున్న టి20 ప్ర‌పంచ క‌ప్ లో బంగ్లాదేశ్... త‌మ పొరుగునే ఉండే ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్ క‌తాలో మూడు, ముంబైలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ జ‌ట్టుకు భ‌ద్ర‌తాప‌రంగా వ‌చ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదు. కానీ, త‌మ పేస్ బౌల‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) నుంచి త‌ప్పించ‌డాన్ని త‌ట్టుకోలేక‌.. టి20 ప్ర‌పంచ క‌ప్ పై ఏడుస్తోంది.

వంద‌ల కోట్లు లాస్..

బంగ్లా తాత్కాలిక ప్ర‌భుత్వం.. త‌మ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ ల ప్ర‌సారాల‌ను చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. ఇదే జ‌రిగితే న‌ష్ట‌పోయేది బంగ్లా క్రికెట్ బోర్డే. అది కూడా రూ.వంద‌ల కోట్ల‌లో ఉంటుంద‌ని అంచ‌నా. భార‌త్ తో క్రీడా సంబంధాల‌ను ఏమాత్రం తెంచుకున్నా అది బంగ్లా బోర్డుకు చాలా న‌ష్టం అని ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మై ఉంటుంది. త్వ‌ర‌లో అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌తినిధులు బంగ్లాదేశ్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. అప్ప‌టికీ భార‌త్ లో టి20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌కూడ‌ద‌ని బంగ్లా నిర్ణ‌యిస్తే.. భారీ జ‌రిమానా ఎదుర్కొనాల్సి రావొచ్చు. ఆపై స‌స్పెన్ష‌న్ కూడా ఎదుర్కొనాల్సి ఉంటుందేమో? ఏది ఏమైనా.. బంగ్లా పాల‌కులు త‌క్ష‌ణ‌మే భార‌త్ తో స్నేహపూర్వ‌క సంబంధాల‌ను పున‌రుద్ధ‌రించుకోవాల్సి ఉంది.

Tags:    

Similar News