చెక్ విసిరేసి.. ఉగ్రవాదులకు ప్రైజ్ మనీ ఇచ్చి.. సల్మాన్ అఘా ఆగడం
అసలు జట్టులో ఉండేందుకు కూడా అర్హత లేని ఆటగాడు సల్మాన్ అఘా. ఈ మాట అన్నది మనం కాదు. పాక్ మాజీ క్రికెటర్లు. అలాంటివాడిని కెప్టెన్ చేసింది పాకిస్థాన్ బోర్డు.;
పాకిస్థాన్ అనేది ఒక రోగ్ కంట్రీ...! ఎంతగా అంటే ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది... కానీ, సైన్యానికి ఒక దేశం ఉంది.. అదే పాకిస్థాన్ అనేంతగా...! పైకి మాత్రం ప్రజాస్వామ్య దేశం.. పెత్తనం అంతా సైన్యానిదే. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని గంటల్లో కూల్చివేస్తుంది సైన్యం. సైన్యాధ్యక్షుడే దేశానికి నియంతగా మారి ప్రజాప్రతినిధులను చంపేస్తుంటాడు. ఇక పాకిస్థాన్ సైన్యానికి వారు ప్రోత్సహించే ఉగ్రవాద మూకలకు విచక్షణ ఏమీ ఉండదు. ఇదంతా ఒక నెక్సస్ (వలయం) అన్నమాట. అలాంటి పాకిస్థాన్ క్రికెటర్ల తీరూ అదే విధంగా ఉంటుందని వేరే చెప్పాల్సిన పని లేదనుకుంటా..? దీనిని ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా నిరూపించాడు.
కనీసం స్పోర్టివ్ నెస్ లేదు..
అసలు జట్టులో ఉండేందుకు కూడా అర్హత లేని ఆటగాడు సల్మాన్ అఘా. ఈ మాట అన్నది మనం కాదు. పాక్ మాజీ క్రికెటర్లు. అలాంటివాడిని కెప్టెన్ చేసింది పాకిస్థాన్ బోర్డు. ఇక అఘా ఆసియా కప్ లో పొడిచింది కూడా ఏమీ లేదు. ఫైనల్లో అయితే, మంచి ప్రారంభాన్ని కూడా వేస్ట్ చేశాడు. అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. దీంతో పాక్ ఇన్నింగ్స్ కుప్పకూలిపోయింది. భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతోనే వికెట్ కీపర్ బ్యాటర్ రిజ్వాన్ వంటి వాడిని పక్కనపెట్టి సల్మాన్ అఘాను కెప్టెన్ చేస్తారా? అంటూ అభిమానులు నవ్వుకున్నారు.
పెద్ద కాపీ క్యాట్
ఆసియా కప్ ఫైనల్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) చైర్మన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కూడా చైర్మన్ అయిన మొహిసిన్ నఖ్వీ నుంచి కప్ అందుకునేందుకు టీమ్ ఇండియా నిరాకరించింది. ఉగ్రవాదులకు సహకారం అందించే దేశానికి మంత్రిగా కూడా ఉన్న నఖ్వీ నుంచి కప్ తీసుకోవడం ఏమిటని భావించింది. ఈ చర్యకు అఘా మాత్రం నోరు పారేసుకున్నాడు. క్రికెట్ ను టీమ్ ఇండియా అగౌరవపరిచిందని ఆరోపించాడు. కానీ, రన్నరప్ జట్టు కెప్టెన్ హోదాలో అతడు చేసిన పని చూసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.
-విజేత, రన్నరప్ జట్లకు డమ్మీ చెక్ (పెద్దగా ఉంటుంది) ఇస్తారు. అంటే.. ఎంత ప్రైజ్ మనీ అనేది దాని మీద రాసి ఉంటుంది. ఇలాంటి చెక్ లను గౌరవంగా తీసుకెళ్తారు కెప్టెన్లు. ఓ పక్కన పెట్టడమో, సహచర ఆటగాళ్లకు ఇవ్వడమో చేస్తారు. కానీ, రన్నరప్ జట్టు కెప్టెన్ గా ప్రైజ్ మనీ చెక్ ను తీసుకున్న సల్మాన్ అఘా దానిని విసిరికొట్టాడు. దీన్ని చూసి అభిమానులు ఓడిపోయిన బాధలో మండుతున్నట్లుంది అంటూ కామెంట్లు చేశారు.
మసూద్ అజహర్ బంధువులకు మ్యాచ్ ఫీజు
-ఇక టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ లో తనకు వచ్చిన మ్యాచ్ ఫీజులను భారత సైన్యానికి ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. దీనిని కాపీ కొట్టిన అఘా సల్మాన్... తన మ్యాచ్ ఫీజును ఆపరేషన్ సిందూర్ లో చనిపోయినవారి కుటుంబాలకు ఇస్తానన్నాడు. ఈ ఆపరేషన్ లో చనిపోయింది ఉగ్రవాదులే. కరుడు గట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు కూడా వీరిలో ఉన్నారు. మరి వారికి సల్మాన్ అఘా తన ప్రైజ్ మనీ ఇస్తున్నట్లేగా?