భారత్ దెబ్బకు కక్కాలో మింగాలో తెలియక.. ఆసియా కప్ లో పాక్ సతమతం
ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ ఆడుతుందా లేదా టోర్నమెంట్ నుంచి వైదొలుగుతుందా అనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.;
ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ ఆడుతుందా లేదా టోర్నమెంట్ నుంచి వైదొలుగుతుందా అనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. గత మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయిన వివాదం తర్వాత.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ICC (అంతర్జాతీయ క్రికెట్ మండలి)కి తమ డిమాండ్లను స్పష్టం చేసింది. అయితే, ICC వాటిని తిరస్కరించడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది.
నేడు మ్యాచ్ ఉత్కంఠ
ఈరోజు పాకిస్తాన్, UAE మధ్య జరగాల్సిన మ్యాచ్ ముందు పాకిస్తాన్ జట్టు పత్రికా సమావేశాన్ని హఠాత్తుగా రద్దు చేసింది. దీంతో టోర్నీ నుంచి తప్పుకుంటుందేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు లేదా టీమ్ మేనేజ్‌మెంట్ మీడియా ముందుకు వచ్చి తమ నిర్ణయాన్ని తెలియజేస్తారు. కానీ, ప్రెస్ మీట్ రద్దు చేయడం వెనుక ఏమైనా కీలక నిర్ణయాలు ఉన్నాయా అనే అనుమానాలు బలపడ్డాయి.
అయితే, నిన్న రాత్రి పాకిస్తాన్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొనడం వల్ల ఆ అనుమానాలు కొంతవరకు తగ్గాయి. ఇది జట్టు ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు సూచిస్తున్నప్పటికీ, చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉండొచ్చా అనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది.
ఇండియా-పాకిస్తాన్ మధ్య వివాదమిదీ
తమ టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ , పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మధ్య సంప్రదాయ షేక్ హ్యాండ్ లేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు ప్లేయర్లు.. సల్మాన్ అలీ అఘా, ఇతర పాకిస్థాన్ సభ్యులతో హ్యాండ్ షేక్ చేయకపోవడంతో వివాదం రాజుకుంది. పాకిస్తాన్ పోస్ట్ మ్యాచ్ ప్రజేంటేషన్ ను బహిష్కరించి నిరసన తెలిపింది. భారత జట్టు మ్యాచ్ విజయం అనంతరం డ్రేస్సింగ్ రూంలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. కనీసం మ్యాచ్ ఎంపైర్లు, అధికారులతో కూడా షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. దీంతో దీనిపై పాకిస్తాన్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఐసీసీ నో చెప్పడంతో ఆడాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడిపోయింది.
పాకిస్తాన్ జట్టు భవిష్యత్తు
ఒకవేళ పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడితే, అది టోర్నమెంట్‌లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఒక మంచి అవకాశం అవుతుంది. అంతేకాక, ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించి, ఆటపై దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుంది.
ICC నిర్ణయానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే, అది పెద్ద వివాదానికి దారితీసే అవకాశం ఉంది. ఇది కేవలం పాకిస్తాన్ క్రికెట్‌కే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌పై కూడా ప్రభావం చూపవచ్చు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా పాకిస్తాన్ జట్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ కొట్టిన దెబ్బకు కక్కాలో మింగాలో తెలియక పాకిస్తాన్ సతమతమవుతోంది. మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది.