అరెరే.. కాపాడలేకపోయిన నోరా ఫతేహి
ఫుట్ బాల్ ప్రపంచకప్- 2026 ఆతిథ్య దేశాలలో ఒకటైన కెనడాకు టొరంటో స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుక ఒక చారిత్రాత్మకమైన సందర్భం.
ఫుట్ బాల్ ప్రపంచకప్- 2026 ఆతిథ్య దేశాలలో ఒకటైన కెనడాకు టొరంటో స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుక ఒక చారిత్రాత్మకమైన సందర్భం. తమ దేశ సంస్కృతి, చరిత్ర, సంగీతాన్ని ప్రపంచ ఫుట్‌బాల్ అత్యున్నత వేదికపై పరిచయం చేసుకునేందుకు కెనడాకు దక్కిన అద్భుతమైన అవకాశం ఇది. అయితే దురదృష్టవశాత్తూ ఈ ఈవెంట్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని విమర్శలొస్తున్నాయి. ఒకరోజు ముందు మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన ఓపెనింగ్ సెర్మనీలో కనిపించిన జోష్, భారీ శబ్దాలు ఇక్కడ టొరంటోలో ఎక్కడా కనిపించలేదు. శుక్రవారం వర్కింగ్ డే కావడం వల్లో ఏమో కానీ.. స్టేడియంలో చాలా సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. `బాహుబలి` చిత్రంలోని `మనోహరి` పాటతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నోరా ఫతేహి ఈ వేడుకలో తన ప్రదర్శనతో సందడి చేసినా ఈ భారీ ఈవెంట్‌కు ఆశించిన క్రేజ్ తీసుకురావడంలో ఆమె కూడా విఫలమైందనే చెప్పాలి.
నిజానికి మెక్సికో వేడుకలతో పోలిస్తే కెనడియన్ వేడుకల్లో ఒక మంచి కథాంశం (మొజాయిక్ కాన్సెప్ట్) కనిపించింది. జెండాల నుండి యూనిఫారాల వరకు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా ప్రణాళిక చేశారు. కార్యక్రమం ప్రారంభంలో కెనడాకు చెందిన ఆదివాసీ (ఇండిజినస్) సంస్కృతికి అద్భుతమైన గౌరవం లభించింది. మానిటోబాకు చెందిన సింగర్-సాంగ్‌రైటర్ విలియం ప్రిన్స్ వేదికపై నిలిచి ...``తీరాల నుండి తీరాల వరకు...ఈ భూమి మొదటి ప్రజల నుండి మనం ఇక్కడ సమావేశమయ్యాము.. ఇది ఒక క్షణం మాత్రమే కాదు.. నిజమైన అనుబంధం`` అంటూ ప్రపంచానికి స్వాగతం పలికారు. కెనడా ఆదివాసీ సంస్కృతి అనేది పాటలు, కళలు, నృత్యాల సమాహారమని ఆయన అద్భుతంగా వివరించారు.
కానీ ఆ తర్వాత ఈ వేడుక పూర్తిగా ఒక కమర్షియల్ ఫిఫా (FIFA) ప్రొడక్ట్‌లా మారిపోయింది. కెనడా దేశం నీల్ యంగ్, ది వీకెండ్ వంటి గొప్ప సంగీత దిగ్గజాలను ప్రపంచానికి అందించింది. ఆ స్థాయి సంగీత వైభవాన్ని చూపించే అవకాశం ఉన్నా నిర్వాహకులు దాన్ని వదిలేశారు. గాయని అలెస్సియా కారా స్టేజ్ మధ్యలో ఉన్న ఒక గోల్డెన్ బాల్ నుండి ఎరుపు రంగు ట్రాక్‌సూట్‌లో వచ్చి తన పాటలతో ప్రదర్శన ఇచ్చింది. ఆమె పాడుతున్నప్పుడు చుట్టూ కెనడియన్ ప్రకృతి, డాల్ఫిన్లు, మూస్ వంటి జంతువుల విజువల్స్ ప్రదర్శించారు. ఆ తర్వాతే మనోహరి బ్యూటీ నోరా ఫతేహి `సీర్ సీర్` పాటతో స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చింది. ముందే రికార్డ్ చేసిన సాంగ్‌కు పెర్ఫార్మ్ చేసినట్లు అనిపించినా... నోరా తన గ్లామర్ స్క్రీన్ ప్రెజెన్స్ - డ్యాన్స్ మూమెంట్స్‌తో స్టేజ్ పై కాస్త ఎనర్జీని తీసుకురావడానికి ప్రయత్నించింది. కానీ ఈ నర్తకి ఒంటరి పోరాటం ఈవెంట్‌ను పూర్తిగా కాపాడలేకపోయింది.
ఈ 15 నిమిషాల వేడుకలో అత్యుత్తమ ప్రదర్శన పాలస్తీనియన్-చిలీకి చెందిన గాయని ఎలియానా- కెనడియన్ సింగర్ జెస్సీ రేయెజ్ ల వల్ల సాధ్యమైంది. వారిద్దరూ కలిసి పాడిన `ఇల్యూమినేట్` సాంగ్ ఈ ఓపెనింగ్ సెర్మనీకే హైలైట్‌గా నిలిచింది. మెక్సికోలో షకీరా పాడిన పాట కంటే ఈ టోర్నమెంట్ సాంగ్ చాలా బలంగా అనిపించింది.
చివరి ప్రదర్శనలు బాగున్నా అప్పటికే ఈ ప్రారంభ వేడుక ఒక అద్భుతమైన ఆరంభంలా కాకుండా.. ఏదో మమ అనిపించిన కార్యక్రమంలా మిగిలిపోయింది. మెక్సికో, కెనడా రెండు దేశాలూ ఊరించినంత స్థాయిలో ఓపెనింగ్ వేడుకలు అలరించలేకపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న చివరి ప్రారంభ వేడుకపై పడింది. ఈ ప్రదర్శనకు పాప్ స్టార్ కేటీ పెర్రీ నాయకత్వం వహించనుండగా విక్టరీ సాధ్యమేననే టాక్ వినిపిస్తోంది. మెక్సికో, కెనడాలు మిగిల్చిన వెలితిని పూడ్చి ఈ ప్రపంచకప్ వేడుకల వైభవాన్ని అమెరికా అయినా కాపాడుతుందో లేదో చూడాలి.