గాడిత‌ప్పిన కోహ్లిని ధోనీ కాపాడాడు.. ఎమ్మెస్కే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఒక ద‌శ‌లో టీమ్ఇండియా నుంచి బ‌య‌ట‌కు పంపేసే ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. కానీ, ధోనీ అడ్డుగోడ‌లా నిల‌బ‌డ్డాడు. కోహ్లిని కాపాడాడు. ఇంత‌కూ కోహ్లి ఎదుర్కొన్న సంక్షోభ‌ స‌మ‌యం ఏమిటి?;

Update: 2026-03-20 14:10 GMT

నాయ‌కుడు అంటే ముందుచూపు ఉండాల్సిన వాడు.. గుంపు కంటే ముందు, వెనుక కాకుండా.. గుంపులో క‌లిసి న‌డ‌వాల్సిన వాడు. అప్పుడే ఎవ‌రు ఏమిటో తెలుస్తుంది...! ఇప్పుడు ఇదంతా ఏమిటి? అంటే, టీమ్ఇండియా సూప‌ర్ స్టార్ విరాట్ కోహ్లి ఒక ద‌శ‌లో ఎదుర్కొన్న ప‌రిస్థితిని చెప్పేందుకు. ఆ స‌మ‌యంలో మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఏవిధంగా అండ‌గా నిలిచాడో వివ‌రించేందుకు..! మ‌నంద‌రికీ విరాట్ కోహ్లి అంటే.. అండ‌ర్-19 కెప్టెన్ గా యువ టీమ్ఇండియాను ప్ర‌పంచ క‌ప్ గెలిపించిన కుర్రాడిగానో లేదా త‌న అత్యుత్త‌మ ప్ర‌తిభ‌తో శిఖ‌రాల‌కు ఎదిగిన మేటి ఆట‌గాడిగానో క‌నిపించ‌వ‌చ్చు. కానీ, అత‌డు ఈ రెండింటి మ‌ధ్య‌లో తీవ్రమైన శ్ర‌మ‌తో నిల‌దొక్కుకున్నాడు. అంత‌కంటే తీవ్ర‌మైన వైఫ‌ల్యాల‌ను ఎదుర్కొని రాటుదేలాడు. ఒక ద‌శ‌లో టీమ్ఇండియా నుంచి బ‌య‌ట‌కు పంపేసే ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. కానీ, ధోనీ అడ్డుగోడ‌లా నిల‌బ‌డ్డాడు. కోహ్లిని కాపాడాడు. ఇంత‌కూ కోహ్లి ఎదుర్కొన్న సంక్షోభ‌ స‌మ‌యం ఏమిటి?

అది 2014 స‌మ‌య‌మేనా?

కోహ్లి టీమ్ఇండియాలోకి వ‌చ్చింది 2008లో. ఆ ఏడాది జూన్ లో ప్రారంభ‌మైన శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో వ‌న్డేల్లో తొలిసారి కోహ్లికి చాన్స్ ద‌క్కింది. అప్ప‌టికే జ‌ట్టులో చాలామంది సీనియ‌ర్లు ఉండ‌డంతో టెస్టుల్లో చోటు క‌ష్ట‌మే అయింది. అలా 2010లో కోహ్లి టెస్టుల్లోకి వ‌చ్చాడు. 2011 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ నాటికి రెండు ఫార్మాట్ల‌లోనూ రెగ్యుల‌ర్ స‌భ్యుడు అయ్యాడు. కానీ, 2014లో కోహ్లి ఆట‌తీరు గాడిత‌ప్పింది. ఆ ఏడాది ఇంగ్లండ్ టూర్ లో దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. మ‌రీ ముఖ్యంగా ఇంగ్లండ్ పేస‌ర్ అండ‌ర్స‌న్ ధాటికి త‌ట్టుకోలేక‌పోయాడు. ఆఫ్ స్టంప్ బ‌య‌ట బంతులు వేసి మ‌రీ ఔట్ చేశాడు. కోహ్లి మొత్తం 10 టెస్టు ఇన్నింగ్స్ లో 134 ప‌రుగులే చేశాడు. ఆ స‌మ‌యంలోనే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌తిభావంతుడైన‌ప్ప‌టికీ ఫిట్ నెస్ స‌రిగా లేద‌ని, ఆట ప‌ట్ల ఆస‌క్తి త‌గ్గింద‌ని, మ‌రీ ముఖ్యంగా పార్టీలంటూ ఎంజాయ్ చేయ‌డానికే ప్రాధాన్యం ఇస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. దీంతో టీమ్ఇండియా నుంచి సాగ‌నంపే ప‌రిస్థితి వ‌చ్చింది.

ధోనీ అడ్డుగోడ‌లా..

నాటి కోహ్లి ప‌రిస్థితిని టీమ్ఇండియా మాజీ చీఫ్ సెల‌క్ట‌ర్, ఆంధ్రాకు చెందిన మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మ‌న్ ఎమ్మెస్కే ప్ర‌సాద్ వివ‌రించాడు. ఓ చాన‌ల్ నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి జ‌డ్జిగా హాజ‌రైన ఎమ్మెస్కే.. అప్ప‌ట్లో ఏం జ‌రిగిందో చ‌క్క‌గా చెప్పాడు. ఆ రోజుల్లో కోహ్లి పూర్తి పార్టీ బాయ్ గా ఉండేవాడ‌ని, ఫిట్ నెస్ కూడా త‌ప్పింద‌ని, వైఫ‌ల్యాల‌తో విమ‌ర్శ‌లు వ‌చ్చాయని.. అత‌డిపై వేటేయాల‌నే డిమాండ్లు పెరిగాయ‌ని తెలిపాడు. ప‌రిస్థితులు అంత ప్ర‌తికూలంగా ఉన్న‌ప్పుడు కోహ్లికి నాటి కెప్టెన్ ధోనీ పూర్తి మ‌ద్ద‌తుగా నిలిచాడ‌ని గుర్తుచేశాడు. అంతేకాదు.. అత‌డే భ‌విష్య‌త్ స్టార్ అని కూడా కీర్తించాడ‌ని తెలిపాడు. ఫ‌లితంగానే నేడు మ‌నం చూస్తున్న కోహ్లి అని స్ప‌ష్టం చేశాడు.

త‌న‌ను తాను అద్దంలో చూసుకుని..

గ‌తంలోనూ ఓ ఇంట‌ర్వ్యూలో కోహ్లి గురించి ఎమ్మెస్కే కీల‌క విష‌యాలు తెలిపాడు. లైఫ్ స్ట‌యిల్, ఫిట్ నెస్ లోపించిన వేళ ఇదేంటి విరాట్..? అని తాను అడిగాన‌ని, దీంతో రియ‌లైజ్ అయి అద్దం ముందు చూసుకున్నాడ‌ని, తాను ఉండాల్సింది ఇలా కాద‌ని నిర్ణ‌యించుకుని ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడ‌ని వివ‌రించాడు. ఫిట్ నెస్ పై శ్ర‌ద్ధ పెట్టి సిక్స్ ప్యాక్ తో అత్యంత ఫిట్ క్రికెట‌ర్ గా మారాడ‌ని ఎమ్మెస్కే పేర్కొ న్నాడు. అందుక‌నే అత‌డు 2014 త‌ర్వాత నిల‌క‌డ‌గా ప‌రుగులు సాధించాడ‌ని, ప్ర‌పంచంలోనే గొప్ప బ్యాట‌ర్ అయ్యాడ‌ని విశ్లేషించాడు.



Tags:    

Similar News