స‌చిన్ కొడుకైనా ముంబైకి లోకువే.. వారిద్ద‌రిపై రూ.4.6 కోట్ల ఖ‌ర్చు

అర్జున్ స్థానంలో ల‌క్నో నుంచి పేస్ ఆల్ రౌండ‌ర్ శార్దూల్ ఠాకూర్ ను ముంబై తీసుకోనుంది.;

Update: 2025-11-14 03:49 GMT

ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ)... ఐపీఎల్ లో ఐదుసార్లు టైటిల్ కొట్టిన గ‌ట్టి జ‌ట్టు. సూప‌ర్ స్టార్ ఆట‌గాళ్లు.. సూప‌ర్ ఫ్యాన్ ఫాలోయింగ్.. లీగ్ లో మొద‌ట వెనుక‌బ‌డినా త‌న‌దైన శైలిలో దూసుకెళ్లే జ‌ట్టు. క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ బ్యాకింగ్ ఎంఐకి మ‌రో పెద్ద ఆస్తి. కానీ, అదే స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు మాత్రం ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులో రెగ్యుల‌ర్ స‌భ్యుడు కాలేక‌పోతున్నాడు. టీమ్ ఇండియా స్థాయికి ఎద‌గ‌డం అటుంచి ముంబై రంజీ జ‌ట్టులోనూ మెరిపించ‌లేక‌పోయాడు అర్జున్. స‌చిన్ ఎంతో ముందుచూపుతో పేస్ బౌలింగ్ ఆల్ రౌండ‌ర్ గా అది కూడా ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్ క‌మ్ బ్యాట‌ర్ గా కుమారుడిని ప్రోత్స‌హించాడు. కానీ, అర్జున్ ప్ర‌తిభ మాత్రం రంజీల స్థాయి కూడా దాట‌డం లేదు. ఇప్ప‌టికే 26 ఏళ్ల వ‌య‌సుకు వ‌చ్చిన‌ అర్జున్ మున్ముందు అత్యంత ప్ర‌తిభ చూపితే త‌ప్ప జాతీయ జ‌ట్టు స్థాయికి ఎద‌గ‌లేడు. అయితే, ఇప్పుడు కొత్త విష‌యం ఏమంటే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో అర్జున్ టెండూల్క‌ర్... ఎంఐను వీడి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)కు మార‌నున్నాడు. బ‌హుశా ఎంఐనే అత‌డిని వ‌ద్ద‌ని అనుకుందో, లేక అర్జున్ వెళ్లిపోవాల‌నుకున్నాడో కానీ, వ‌చ్చే సీజ‌న్ కు ల‌క్నో త‌ర‌ఫున ఆడ‌నున్నాడు. రూ.30 ల‌క్ష‌ల అత‌డి బేస్ ప్రైజ్ కే ఎల్ఎస్జీ తీసుకుంటోంది.

ముంబైకి ముంబైక‌ర్...

అర్జున్ స్థానంలో ల‌క్నో నుంచి పేస్ ఆల్ రౌండ‌ర్ శార్దూల్ ఠాకూర్ ను ముంబై తీసుకోనుంది. లోయ‌రార్డ‌ర్ లో బ్యాట్ తో రాణించ‌గ‌ల స‌త్తా ఉన్న శార్దూల్ ముంబై న‌గ‌రానికి చెందిన‌వాడే. గ‌త ఏడాది రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. టీమ్ ఇండియా త‌ర‌ఫున కూడా కొన్ని మంచి ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశాడు. ఇటీవ‌లి ఇంగ్లండ్ టూర్ లోనూ ఉన్నాడు. కానీ, నిల‌క‌డ లేక‌పోవ‌డంతో చోటు కోల్పోయాడు. వాస్త‌వానికి నిరుడు రంజీల్లో శార్దూల్ అద‌ర‌గొట్టినా ఐపీఎల్ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. ల‌క్నో పేస‌ర్ మొహిసిన్ ఖాన్ గాయ‌ప‌డ‌డంతో అనూహ్యంగా శార్దూల్ ను అత‌డి బేస్ ప్రైస్ రూ.2 కోట్ల‌కు రిప్లేస్ చేసింది. 10 మ్యాచ్ ల‌లో 13 వికెట్లు తీసిన శార్దూల్ జ‌ట్టుకు ఉప‌యోగ‌ప‌డ్డాడు. ఇప్పుడు ముంబై అత‌డిని రూ.2 కోట్ల బేస్ ప్రైస్ కే ల‌క్నో నుంచి తీసుకుంటోంది.

వెస్టిండీస్ విధ్వంస‌క వీరుడినీ...

2020 త‌ర్వాత టైటిల్ గెల‌వ‌ని ముంబై ఇండియ‌న్స్ వ‌చ్చే సీజ‌న్ కు బ‌లంగా ప్రిపేర‌వుతోంది. ఇందులోభాగంగా వెస్టిండీస్ విధ్వంసక బ్యాట‌ర్ రూథ‌ర్ ఫ‌ర్డ్ ను రూ.2.60 కోట్ల‌కు గుజ‌రాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంటోంది. 200 టి20 మ్యాచ్ లు ఆడిన రూథ‌ర్ ఫ‌ర్డ్ భారీ షాట్ల‌తో స్కోరును ప‌రుగులెత్తిస్తాడు. ఓపెనింగ్ లో రోహిత్ శ‌ర్మకు తోడుగా ఇత‌డిని దింపే చాన్సుంది.

ముంబై నుంచి గోవా.. ముంబై నుంచి ల‌క్నో

స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్ రంజీల్లో మొద‌ట‌ ముంబైకి ఆడాడు. అయితే, విప‌రీత‌మైన పోటీ ఉండే ముంబై జ‌ట్టులో అయితే తాను వెలుగులోకి రాలేన‌ని భావించి గోవా వంటి చిన్న జ‌ట్టుకు మారాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ ముంబై ఇండియ‌న్స్ నుంచి ల‌క్నోకు మారుతున్నాడు. 2023లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున లీగ్ లో అడుగుపెట్టిన అత‌డు 5 మ్యాచ్ ల‌లో 3 వికెట్లు తీశాడు.

Tags:    

Similar News