లేడీ ‘లారా’.. ఈ దక్షిణాఫ్రికా కెప్టెన్.. పరుగుల మెషీన్
119 మ్యాచ్ లు, 5222 పరుగులు, 50.69 సగటు.. అత్యధిక స్కోరు 184 నాటౌట్..! ఇవి కూడా పురుషుల క్రికెట్ లో ఏ గొప్ప బ్యాటర్ గణాంకాలు కావు..!;
60, 90, 31, 169 నాటౌట్, 101.. ఈ వరుస స్కోర్లు పురుషుల క్రికెట్ లో మేటి బ్యాట్స్ మన్ వి కావు..!
119 మ్యాచ్ లు, 5222 పరుగులు, 50.69 సగటు.. అత్యధిక స్కోరు 184 నాటౌట్..! ఇవి కూడా పురుషుల క్రికెట్ లో ఏ గొప్ప బ్యాటర్ గణాంకాలు కావు..! ఓ మహిళా క్రికెటర్ ఘనతలు..! ఆమెనే లారా ఓల్వార్ట్. దక్షిణాఫ్రికా మహిళల జట్టు కెప్టెన్. పురుషుల క్రికెట్ లో ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్ మన్ గా పేర్కొనే వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా పేరును పెట్టుకున్న ఈమె.. అతడిలాగానే భారీ సెంచరీలను అలవోకగా కొట్టేస్తుంది. తాజాగా ముగిసిన వన్డే ప్రపంచ కప్ లో ఓల్వార్ట్ ప్రతిభ ఏమిటో మరింతగా తెలిసింది. అత్యంత ఒత్తిడి ఉండే సెమీఫైనల్స్, ఫైనల్స్ లో సెంచరీలు కొట్టిన ధీర లారా. ఇందులో మరీ ముఖ్యంగా సెమీఫైనల్లో ఇంగ్లండ్ వంటి గట్టి ప్రత్యర్థిపై చేసిన సెంచరీ (143 బంతుల్లో 169 నాటౌట్; 20 ఫోర్లు, 4 సిక్సులు) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో ఆడుకుంటూ పోయిన లారా భారీ సెంచరీ కొట్టి జట్టుకు భారీ స్కోరు (319/7) అందించింది. ఇందులో ఆమెవే కావడం గమనార్హం. 192 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినా ఏమాత్రం వెరవకుండా చివరి వరకు క్రీజులో నిలిచింది ఈ ఓపెనర్. దీంతో ఊహించని స్కోరు వచ్చింది. ఇది చివరకు ఇంగ్లండ్ పై ఒత్తిడికి దారితీసింది.
బ్యాట్ తో ఆమె.. బంతితో బౌలర్లు
మహిళల ప్రపంచ కప్ లో లారా బ్యాట్ తో శివాలెత్తగా.. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో దక్షిణాఫ్రికా బౌలర్లు బంతితో చెలరేగి ప్రత్యర్థుల పని పట్టారు. ఇంగ్లండ్ ను సెమీఫైనల్లో ఇలానే 194 పరుగులకే ఆలౌట్ చేసి 125 పరుగుల తేడాతో గెలిచారు. ఇలా జట్టును ముందుండి నడింపించిన లారా ఫైనల్లో ఓటమి అనంతరం అంతే హుందాగా స్పందించి తన ప్రత్యేకతను చాటింది.
వరుస నాకౌట్ సెంచరీలు..
బహుశా పరుషుల క్రికెట్ లోనూ సాధ్యం కాని రీతిలో ఈ ప్రపంచ కప్ సెమీఫైనల్స్, ఫైనల్స్ లో లారా ఓల్వార్ట్ సెంచరీలు చేసింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ తో జరిగిన తొలి రెండు లీగ్ మ్యాచ్ లలో మాత్రమే లారా త్వరగా (5, 17) ఔట్ అయింది. తర్వాత ఏడు మ్యాచ్ లలో 30పైనే పరుగులు చేసింది. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉండడం గమనార్హం. టోర్నీలో 571 పరుగులు చేసిన లారా... గత (2022) ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ అలిసా హీలీ (509) సాధించిన అత్యధిక పరుగుల రికార్డును బద్దలుకొట్టింది. నాడు హీలీ సైతం సెమీఫైనల్, ఫైనల్లో సెంచరీలు కొట్టగా.. దానిని లారా సమం చేసింది. ప్రపంచ కప్ లలో అత్యధికంగా 14 సార్లు 50 పైగా పరుగులు చేసిన రికార్డు కూడా లారా అందుకుంది. అందుకే ఈమెను లేడీ లారా అని గొప్పగా పిలిచేది.