టీమ్ ఇండియాకు కొత్త వన్డే కెప్టెన్..!
దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ లలో మొదటిది రాంచీలో ఈ నెల 30న జరుగుతుంది. రెండోది డిసెంబరు 3న రాయ్ పూర్‌లో, మూడోది విశాఖపట్నంలో డిసెంబరు 6న మూడో వన్డే జరుగుతుంది.;
కెప్టెన్ గాయపడ్డాడు.. రాబోయే సిరీస్ కు దూరమయ్యాడు.. దీనికిముందే వైస్ కెప్టెన్ కూడా గాయపడ్డాడు..! ఈ ఇద్దరూ ఇప్పుడు అందుబాటులో లేరు. తొలిసారిగా ఒక సిరీస్ కు కెప్టెన్ చేసిన ఆటగాడు మరో వన్డే సిరీస్ వచ్చేసరికి దూరమయ్యాడు. అదే సిరీస్ లో తొలిసారి వైస్ కెప్టెన్ అయిన ప్లేయర్ కూడా తీవ్రంగా గాయపడి చివరకు ఐసీయూలో చేరి నెల రోజులుగా మైదానంలోనే దిగలేదు. ఈ నేపథ్యంలో మరొక వారం రోజుల్లో వన్డే సిరీస్ మొదలు కానుంది. మరి కెప్టెన్ ఎవరు? ఎవరా కొత్త ఆటగాడు... అందులోనూ దిగ్గజాలైన మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను కెప్టెన్సీ చేసే కొత్త ఆటగాడు ఎవరు..? అనేది చర్చనీయంగా మారింది. దీనికి నేడో రేపో తెరపడనుంది. దక్షిణాఫ్రికాతో ఈ నెల 30న తొలి వన్డే జరగనుంది.
మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ అందుబాటులో లేడు. మొన్నటి కోల్‌కతా టెస్టులో అతడు గాయపడడంతో మళ్లీ ఎప్పుడు ఫిట్ అవుతాడో తెలియని పరిస్థితి. ఇక వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గత నెలలో ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ లో క్యాచ్ పడుతూ తీవ్రంగా గాయపడ్డాడు. కీలక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసియా కప్ ఫైనల్ నుంచి గాయంతో ఔట్ అయ్యాడు. దీంతోనే దక్షిణాఫ్రికా రెండో టెస్టుకు కెప్టెన్ గా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కు చాన్స్ ఇచ్చారు.
వన్డేలకూ అతడేనా? మన విశాఖలో మ్యాచ్
దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ లలో మొదటిది రాంచీలో ఈ నెల 30న జరుగుతుంది. రెండోది డిసెంబరు 3న రాయ్ పూర్‌లో, మూడోది విశాఖపట్నంలో డిసెంబరు 6న మూడో వన్డే జరుగుతుంది. ఇప్పటికైతే పంత్ నే ఈ సిరీస్ కు కెప్టెన్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుశా ఆదివారమే వన్డే జట్టు ఎంపిక ఉంటుందని అంటున్నారు. లేదంటే సోమవారం జరగవచ్చు. మరోవైపు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా ప్రకటిస్తారనే విశ్లేషణలు వస్తున్నాయి. పంత్ కంటే రాహుల్ చాలా మెరుగైన బ్యాటర్ కావడంతో పాటు వన్డేల్లో వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. జట్టు కోసం ఎప్పుడైనా సరే త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. మరోవైపు పంత్ వన్డేల్లో రెగ్యులర్ గా ఆడడం లేదు. టెస్టుల్లో స్థిరమైన స్థానం దక్కినా ఇంకా వన్డేల్లో అతడి ప్లేస్ డోలాయమానమే. పైగా రాహుల్ కీపింగ్ చేస్తుండడంతో పంత్ ను తుది జట్టులోకీ తీసుకోని పరిస్థితి. ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో ఇదే జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది.
గిల్ పరిస్థితి ఏమిటో
టెస్టు, వన్డే కెప్టెన్సీలు దక్కించుకుని టి20ల్లో వైస్ కెప్టెన్ అయిన శుబ్ మన్ గిల్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి ఔట్ అయినా, టి20 సిరీస్ కు అందుబాటులోకి వస్తాడో లేదో చూడాలి. వచ్చే నెల 9 నుంచి దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్ ఉంది. అప్పటికి గిల్ ఫిట్ నెస్ సాధిస్తాడని భావిస్తున్నారు. ఇక శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతానికి వన్డేల్లోనే రెగ్యులర్ గా ఉన్నాడు. అతడి గాయం తీవ్రమైనది కావడంతో మార్చి వరకు మైదానంలో దిగడం కష్టమే. ఒకవేళ గిల్ ఫిట్ నెస్ సాధించినా.. మున్ముందు టి20 ప్రపంచ కప్ సహా కీలక సిరీస్ లు ఉన్నందున అతడిని దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లకు దూరంగా ఉంచినా ఆశ్చర్యం లేదు.