కేఎల్ రాహుల్ ‘మహా’ విధ్వంసం: 152 పరుగులతో రికార్డుల వేట.. పంజాబ్ ముందు 265 పరుగుల భారీ లక్ష్యం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు.;
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక జట్టు స్కోరు కావడం విశేషం.
రాహుల్ విధ్వంసం.. రికార్డుల వేట
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పాథుమ్ నిశాంక (11) త్వరగానే పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణాతో కలిసి కేఎల్ రాహుల్ పంజాబ్ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. రాహుల్ కేవలం 67 బంతుల్లోనే 152 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 9 కళ్ళు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో రిషభ్ పంత్ పేరిట ఉన్న ఢిల్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు (128) రికార్డును రాహుల్ బద్దలు కొట్టాడు.
హిస్టారికల్ పార్ట్‌నర్‌షిప్
కేఎల్ రాహుల్ ఒకవైపు సిక్సర్లతో విరుచుకుపడుతుంటే మరోవైపు నితీశ్ రాణా కూడా ఏమాత్రం తగ్గలేదు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 220 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాణా కేవలం 44 బంతుల్లోనే 91 పరుగులు (11 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా అందరినీ ఈ జోడీ ఊచకోత కోసింది.
రాహుల్ ఖాతాలో అరుదైన రికార్డులు
ఈ మ్యాచ్ ద్వారా కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో పలు అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ (175*), బ్రెండన్ మెక్‌కల్లమ్ (158*) తర్వాత 152 పరుగులతో* రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన 5వ బ్యాటర్‌గా నిలిచాడు (5,579 పరుగులు). విరాట్ కోహ్లీ (8,989) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున టీ20ల్లో 150+ స్కోరు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు తిలక్ వర్మ (151) రంజీ ట్రోఫీలో ఈ ఘనత సాధించాడు.
తేలిపోయిన పంజాబ్ బౌలింగ్
ఢిల్లీ బ్యాటర్ల ధాటికి పంజాబ్ బౌలింగ్ విభాగం కకావికలమైంది. స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, బార్ట్‌లెట్ చెరో వికెట్ తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక మార్కో యాన్సన్, విజయ్ కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫీల్డింగ్‌లో కూడా పంజాబ్ జట్టు ఒత్తిడికి లోనై పరుగులు ఇచ్చేసింది.
మొత్తానికి 265 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఇది కచ్చితంగా హిమాలయ పర్వతమంత సవాలే. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ల ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ 2026 ఐపీఎల్ సీజన్‌లో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోనుంది.