ఐపీఎల్-19కు మరో స్టార్ గుడ్ బై... మాజీ చాంప్ కు అన్నీ కష్టాలే
లీగ్ లో కోల్ కతా మూడుసార్లు టైటిల్ గెలిచిందంటే వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ప్రధాన కారణం. బ్యాట్ తో లోయరార్డర్ లో అతడు విధ్వంసం రేపేవాడు.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 18 సీజన్లు గడిచాక చూస్తే.. చాంపియన్లుగా నిలిచిన జట్లు ఐదే.. ! రాజస్థాన్ రాయల్స్ (1), చెన్నై సూపర్ కింగ్స్ (5), ముంబై ఇండియన్స్ (5), కోల్ కతా నైట్ రైడర్స్ (3), సన్ రైజర్స్ హైదరాబాద్ (దక్కన్ చార్జర్స్ తో కలిపి 3సార్లు), చివరగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (1). ఇందులో రాజస్థాన్, బెంగళూరు కంటే మెరుగైన జట్టు కోల్ కతా. రెండుసార్లు గౌతమ్ గంభీర్ సారథ్యంలో, మరోసారి అతడి మార్గ నిర్దేశంలో చాంపియన్ గా నిలిచింది ఈ జట్టు.
గత సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టినప్పటికీ, సాధారణ ప్రదర్శనతో సరిపెట్టుకుంది. 2024లో విజేతగా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను కొన్ని కారణాలతో వదులుకుంది. ఆల్ రౌండర్ అనే ట్యాగ్ ఉన్న వెంకటేష్ అయ్యర్ కు రూ.23.75 కోట్లు పెట్టింది. అతడు తన ధరకు కనీస న్యాయం కూడా చేయలేదు. శ్రేయస్ స్థానంలో టీమ్ ఇండియా మాజీ బ్యాటర్ అజింక్య రహానేను తీసుకుని కెప్టెన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. వచ్చే సీజన్ కు ఇప్పుడు కెప్టెన్ ఎవరన్నది కూడా అనుమానమే. ఇలాంటి సమయంలో స్టార్ ప్లేయర్ గుడ్ బై చెప్పాడు. దీంతో మాజీ చాంపియన్ కు అన్నీ కష్టాలే అన్నట్లుంది పరిస్థితి.
అటు బ్యాట్.. ఇటు బంతితో..
లీగ్ లో కోల్ కతా మూడుసార్లు టైటిల్ గెలిచిందంటే వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ప్రధాన కారణం. బ్యాట్ తో లోయరార్డర్ లో అతడు విధ్వంసం రేపేవాడు. బంతితోనూ వికెట్లు తీసేవాడు. మంచి ఫీల్డర్ కావడం మరో ప్లస్ పాయింట్. అలాంటి రస్సెల్.. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ ఆడడం లేదని ప్రకటించాడు. ఆదివారమే మరో స్టార్ ప్లేయర్, దక్షిణాఫ్రికాకు చెందిన బ్యాటర్ డుప్లెసిస్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. దీంతో ఒకేరోజు ఇద్దరు విధ్వంసక ఆటగాళ్లు రిటైర్ అయినట్లయింది. డుప్లిసె కంటే రసెల్ లీగ్ లో మెరుపులు మెరిపించాడు. 37 ఏళ్ల రసెల్ 2014 నుంచి కోల్ కతాకు ఆడుతున్నాడు. అంతకుముందు రెండు సీజన్లు అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 12 సీజన్లలో 140 మ్యాచ్ లు ఆడి 2,651 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్ 174.18. అతడు 123 వికెట్లు కూడా తీశాడు.
వరల్డ్ లీగ్ ప్లేయర్...
తన పవర్ హిట్టింగ్ తో... ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ అన్నట్లుగా రసెల్ ప్రపంచ వ్యాప్తంగా చాలా లీగ్ లలో కనిపిస్తుంటాడు. అందుకని అతడు వరల్డ్ లీగ్ ప్లేయర్ గా నిలిచాడు. కాగా, ఐపీఎల్ కు వీడ్కోలు పలికినా.. కోల్ కతా అతడిని పవర్ కోచ్ గా నియమించుకుంది. ఎలాగూ పవర్ హిట్టింగ్ కాబట్టి అదే హోదాతో కోల్ కతా రసెల్ ను కోచ్ గా తీసుకుందని భావించవచ్చు. ఈ నెల 16న అబుదాబిలో ఐపీఎల్ వేలం ఉంది. ఐపీఎల్ కు బైబై చెప్పినా రసెల్ ఇతర లీగ్ లలో కొనసాగే ఉద్దేశంలో ఉన్నాడు.