స్మృతి కోసం జెమీమా... మైదానం సరిహద్దులు దాటిన అద్భుతమైన బంధం!

టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్, వరల్డ్ కప్ స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్.. తన సహచరురాలు, అంతకుమించి స్నేహితురాలు అయిన స్మృతి మంధాన కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు.;

Update: 2025-11-27 12:24 GMT

ఈ లోకంలో ఉన్నంత కాలం సరైన, నిజమైన, నిజాయితీ పరుడైన ఒక్క స్నేహితుడైనా ఉండాలని అంతా కోరుకుంటారు. అలాంటి అరుదైన బంధాలు అత్యంత అరుదుగా ఉంటాయని చెబుతారు. ఈ క్రమంలో తాజాగా టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్, వరల్డ్ కప్ స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్.. తన సహచరురాలు, అంతకుమించి స్నేహితురాలు అయిన స్మృతి మంధాన కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అవును... ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక మహిళల బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) తాజా సీజన్ లో పాల్గొన్న ఏకైన భారతీయ క్రీడాకారిణిగా నిలిచిన జెమిమా రోడ్రిగ్స్... తన వ్యక్తిగత జీవితంలో క్లిష్ట దశను ఎదుర్కొంటున్న తన స్నేహితురాలు స్మృతి మంధాన కు తోడుగా ఉండటం కోసం భారత్ లోనే ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో.. ఆమె మిగిలిన సీజన్ కు దూరమవుతుంది.

వివరాళ్లోకి వెళ్తే... డబ్ల్యూబీబీఎల్ ఫ్రాంచైజీతో కొంతకాలం గడిపిన తర్వాత భారత నుంచి ప్రపంచ కప్ విజేత జెమిమా రోడ్రిగ్స్ 10 రోజుల సెలవు మీద స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సెలవులకు ప్రధాన కారణం.. తన సహచరురాలు, టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహ వేడుకల్లో పాల్గొనడం. ఈ క్రమంలో.. వివాహానికి ముందు సంభరాల్లో ఆమె పాల్గొంది!

ఈ క్రమంలో నవంబర్ 23న స్మృతి వివాహం జరగనున్న సమయంలో.. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధానకు సడన్ గా అనారోగ్యం రావడం, వెంటనే ఆస్పత్రిలో చేర్చడం జరిగిపోయాయి. దీంతో పెళ్లి వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో వివాహం చేసుకోకూడదని స్మృతి నిర్ణయించుకుందని.. అందువల్ల వివాహం నిరవధికంగా వాయిదా వేయబడిందని ఆమె మేనేజర్ వెల్లడించారు.

ఈ సమయంలో స్మృతి, ఆమె కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. మరోవైపు ఆమెకు కాబోయే వరుడి గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తిరిగి అస్ట్రేలియా వెళ్లి క్రికెట్ ఆడటం కంటే.. తన స్నేహితురాలి పక్కన ఉండి, మోరల్ గా సపోర్ట్ గా నిలవడం ముఖ్యమని.. అది తన బాధ్యత అని జెమీమా నమ్మింది. తన మనసు చెప్పిందే చేసింది.

వెంటనే తన ఫ్రాంచైజీకి ఈ మేరకు రిక్వస్ట్ పెట్టుకుంది. దీనిపై బ్రిస్బేన్ హీట్ సీఈఓ టెర్రీ స్వెన్సన్ స్పందించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో జెమీమా అభ్యర్థనను అంగీకరించడంలో తమకు మరో ఆలోచన లేదని.. ఇది జెమీకి స్పష్టంగా సవాలుతో కూడిన సమయమని.. ఇకపై డబ్ల్యూబీబీఎల్ లో ఆమె పాల్గొనకపోవడం దురదృష్టకరం అయినప్పటికీ.. ఆమె భారత్ లోనే ఉండటానికి తాము అంగీకరిస్తున్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలో జెమీమా నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు. వీరి స్నేహంపైనా, జెమీమా నిర్ణయం పైనా సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. స్నేహం కోసం అంత బిగ్ నిర్ణయం తీసుకోవడంతో జెమీమా ఇప్పుడు ఆఫ్ ది గ్రౌండ్ కూడా బిగ్ స్టార్, రియల్ లైఫ్ స్టార్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీరిది.. క్రికెట్ మైదానం సరిహద్దులు దాటిన బలమైన బంధం అని అంటున్నారు.

Tags:    

Similar News