ఓటముల హ్యాట్రిక్..మహిళల ప్రపంచకప్.. టీమ్ఇండియాకు కష్టమే!
చివరి వరకు గెలిచేలా కనిపించడం.. ఆఖర్లో చేతులెత్తేయడం.. ఒకటీ రెండు మ్యాచ్ లు కాదు.. వరుసగా మూడుసార్లు ఇదే తీరు..! ఫలితం హ్యాట్రిక్ ఓటములు..! ఇదీ మహిళల ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా పరిస్థితి..!;
చివరి వరకు గెలిచేలా కనిపించడం.. ఆఖర్లో చేతులెత్తేయడం.. ఒకటీ రెండు మ్యాచ్ లు కాదు.. వరుసగా మూడుసార్లు ఇదే తీరు..! ఫలితం హ్యాట్రిక్ ఓటములు..! ఇదీ మహిళల ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా పరిస్థితి..! తొలి రెండు మ్యాచ్ లలో శ్రీలంక, పాకిస్థాన్ లపై అలవోకగా గెలిచి సెమీఫైనల్ రేసులో ముందున్న మన అమ్మాయిలు.. తర్వాత మూడు మ్యాచ్ లలో అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మరో రెండు మ్యాచ్ లే మిగిలి ఉండగా టాప్-4లో చోటు కోసం పోరాటం చేయాల్సి వస్తోంది.
ఫినిషింగ్ టచ్ మిస్..
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. మహిళల క్రికెట్లో పెద్ద జట్లయిన వీటిపై వరుసగా ఓడిపోయింది భారత మహిళల జట్లు. దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్లు పడగొట్టినా చివరి 3 వికెట్లు (7 బంతులు) తీయలేకపోయారు. ఆస్ట్రేలియాపైనా 7 వికెట్లు (6 బంతులు) తీసినా కంగారూ తోక తెంచలేకపోయారు. ఇంగ్లండ్ పై దాదాపు గెలిచారు అనుకుంటున్న సమయంలో 4 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ మ్యాచ్ ల ఫలితాన్ని చూస్తే టీమ్ ఇండియా అమ్మాయిలు ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయారని తెలుస్తోంది.
సొంతగడ్డపై సెమీస్ చేరుతారా?
మహిళల వన్డే ప్రపంచ కప్ నకు శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇస్తోంది భారత్. ఇప్పటివరకు మన జట్టు ప్రపంచ కప్ నెగ్గలేదు. ఈసారి అవకాశం ఉందీ అనిపిస్తుండగా... మ్యాచ్ మ్యాచ్ కు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇక మిగిలింది రెండు మ్యాచ్ లు. వీటిలో ఒకటి భారత్ కు కొరకరాని కొయ్య అయిన న్యూజిలాండ్ తో, రెండోది బంగ్లాదేశ్ తో. వీటిలో కచ్చితంగా గెలిస్తే నేరుగా సెమీస్ కు వెళ్తుంది. లేదంటే ఇంటికే..! ఇంతటితో కథ సమాప్తం అనుకోవాల్సిందే.
మనల్ని ఓడించిన మూడు సెమీస్ కు
ఆసక్తికర అంశం ఏమంటే.. భారత్ ను ఓడించిన మూడు జట్లు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ కు చేరాయి. ఇక మిగిలిన ఒక్క బెర్తుకు టీమ్ ఇండియా, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. ఐదు మ్యాచ్ లు ఆడిన ఈ రెండు జట్లు 4 పాయింట్లతో ఉన్నాయి. న్యూజిలాండ్ తో వచ్చే గురువారం మ్యాచ్ లో గెలిస్తే ఆదివారం బంగ్లాదేశ్ పై విజయం పెద్ద విషయమేం కాదు..
కొసమెరుపుః న్యూజిలాండ్ పురుషుల జట్టు లాగే మహిళల జట్టు కూడా భారత్ పాలిట పెద్ద సైంధవుడు. ఇప్పటివరకు మహిళల జట్లు 57 వన్డేలు ఆడగా న్యూజిలాండ్ 34, టీమ్ ఇండియా 22 గెలిచాయి.