పాక్‌లో అఫ్ఘాన్ టూర్ రద్దు.. వారి క్రికెటర్లతో నో షేక్‌హ్యాండ్స్
పెహల్గాంలో అమాయక పర్యటకులపై దాడికి దిగేలా ఉగ్రవాదులను ఉసిగొల్పిన పాకిస్థాన్‌కు ఆపరేషన్ సిందూర్ తో యుద్ధం ద్వారా భారత్ గట్టిగా బదులిచ్చింది.;
పెహల్గాంలో అమాయక పర్యటకులపై దాడికి దిగేలా ఉగ్రవాదులను ఉసిగొల్పిన పాకిస్థాన్‌కు ఆపరేషన్ సిందూర్ తో యుద్ధం ద్వారా భారత్ గట్టిగా బదులిచ్చింది. అనంతరం ఇటీవల జరిగిన ఆసియా కప్ లో ఫైనల్ సహా మూడుకు మూడుసార్లు ఆ జట్టును ఓడించి మైదానంలోనూ మట్టికరిపించింది. దీనికంటే.. పాక్ ఆటగాళ్లతో టీమ్ ఇండియా క్రికెటర్లు వ్యవహరించిన తీరే ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే చేతులతో తాము చేయి కలపం అని టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తేల్చిచెప్పాడు. టాస్ సమయంలో అతడు, మ్యాచ్ ముగిశాక మన ఆటగాళ్లు ఎవరూ పాక్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇప్పుడు తమ దేశ యువ క్రికెటర్లను బలి తీసుకున్న పాకిస్థాన్ ను అఫ్ఘానిస్థాన్ కూడా శత్రువులా చూస్తోంది.
అఫ్ఘాన్, లంకతో వచ్చే నెలలో ట్రై సిరీస్..
పాకిస్థాన్‌లో వచ్చే నెలలో ముక్కోణపు సిరీస్ జరగనుంది. ఇందులో పాల్గొనేది ఎవరో కాదు.. అఫ్ఘానిస్థాన్, శ్రీలంక. 2009లో పాక్ లో టూర్ చేస్తుండగా ఉగ్రదాడి బాధిత జట్టు శ్రీలంక. తాజాగా అఫ్ఘాన్‌తో సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ దాడులకు దిగింది. అఫ్ఘాన్‌లోని ఈస్ట్రన్ పాక్టికా రాష్ట్రంలో పాక్ జరిపిన దాడిలో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు చనిపోయారు. దీంతో నవంబరులో పాక్‌లో జరిగే ముక్కోణపు సిరీస్ ఆడబోమని అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అయితే, దీని బదులు మరో విదేశీ జట్టును పిలిచే పనిలో పడింది పాక్. కానీ, అఫ్ఘాన్ జట్టు మాజీ క్రికెటర్ కరీం సాదిక్ మాత్రం తీవ్రంగా స్పందించాడు.
భారత క్రికెటర్ల దారిలోనే మేం కూడా..
తమ ముగ్గురు క్రికెటర్లను బలి తీసుకున్న పాక్‌పై కరీం సాదిక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు ప్రతీకారంగా పాకిస్థాన్ ఆటగాళ్లతో తాము ఇకపై కరచాలనం చేయబోమని తెలిపాడు. ఈ విషయంలో తాము భారత ఆటగాళ్లను అనుసరిస్తామని చెప్పాడు. పఠాన్ లు ఎప్పటికీ తలొంచరని పేర్కొన్నాడు. ఒక్క పూట మాత్రమే తినే స్థోమత ఉన్న అమాయకులనూ పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకుందని నిందించాడు. పాక్‌ది పిరికి చర్య అని.. ఇలాంటివి తమను ఆపలేవని పేర్కొన్నాడు.