క్రికెట్ కంటే ఫుట్‌బాల్ ఎందుకు పెద్దది అనేది మరోసారి స్పష్టమవుతోంది.

మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2026-06-09 23:30 GMT

మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్రికెట్ ఒక మతం, సచిన్ లేదా ధోని లాంటి వాళ్లు దేవుళ్లు. కానీ గ్లోబల్ స్టేజ్ అంతర్జాతీయ స్థాయి విషయానికి వస్తే మాత్రం ఫుట్‌బాల్ ముందు క్రికెట్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కేవలం వీక్షకుల సంఖ్యలోనే కాదు, ఆటగాళ్లకు లభించే 'ప్రైజ్ మనీ' విషయంలో కూడా ఫుట్‌బాల్ సామ్రాజ్యం ముందు క్రికెట్ చాలా 'జుజూబీ' అని మరోసారి రుజువైంది. త్వరలో ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ వివరాలు చూస్తే అసలు క్రికెట్‌కు ఫుట్‌బాల్‌కు ఎంతటి వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఫిఫా వరల్డ్‌కప్.. కళ్లు చెదిరే ప్రైజ్ మనీ వివరాలు

ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ సరికొత్త రికార్డులతో ముందుకు వస్తోంది. మొత్తం 48 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ కోసం ఫిఫా ఏకంగా 871 మిలియన్ డాలర్లు సుమారు రూ. 8 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రైజ్‌మనీగా ప్రకటించింది. క్రీడా చరిత్రలోనే ఒకే టోర్నమెంట్‌కు ఇంత భారీ మొత్తాన్ని కేటాయించడం ఒక సంచలనం. విజేతలకు దక్కే బహుమతుల వివరాలు ఇలా ఉన్నాయి. టోర్నీ గెలిచిన జట్టుకు ఏకంగా 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 430 కోట్లకు పైగా) అందుతాయి. రన్నరప్ గా రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 33 మిలియన్ డాలర్లు లభిస్తాయి. మూడో స్థానంలో నిలిచే జట్టుకు 29 మిలియన్ డాలర్లు దక్కుతాయి.

అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశలోనే నిష్క్రమించిన జట్లకు కూడా తలో 9 మిలియన్ డాలర్లు చెల్లించనున్నారు. అంటే కేవలం టోర్నీకి అర్హత సాధించి ఆడితే చాలు కోట్ల రూపాయల ఆదాయం ఆయా జట్ల ఖాతాలో చేరిపోతుంది.

ఫుట్‌బాల్ ముందు 'పిల్లాడిలా' మారిన క్రికెట్

ఇప్పుడు మనం ఎంతో గొప్పగా చెప్పుకునే క్రికెట్ ప్రపంచకప్ బహుమతి మొత్తాన్ని ఒకసారి గమనిద్దాం. 2023లో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ పూల్ కేవలం 10 మిలియన్ డాలర్లు మాత్రమే. అవును మీరు విన్నది నిజమే.. క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీ మొత్తం బహుమతి విలువ 10 మిలియన్ డాలర్లు కాగా ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ గెలవకుండా వెనుతిరిగే ఒకే ఒక్క జట్టుకు వచ్చే బహుమతి 9 మిలియన్ డాలర్లు కంటే కేవలం కొద్దిగా మాత్రమే ఎక్కువ. ఇక మొత్తం ఫిఫా ప్రైజ్ పూల్‌తో పోలిస్తే క్రికెట్ ప్రైజ్ మనీ దాదాపు 87 రెట్లు తక్కువ కావడం విశేషం. క్రికెట్ టోర్నీ విజేతకు దక్కే బహుమతి కూడా ఫుట్‌బాల్ విజేతతో పోలిస్తే చాలా తక్కువ.

ఇంత భారీ తేడాకు కారణం ఏమిటి?

ఫుట్‌బాల్‌కు ఉన్న ఈ స్థాయి వాణిజ్య శక్తికి, ఆర్థిక ఆధిపత్యానికి ప్రధాన కారణాలున్నాయి. క్రికెట్ ప్రధానంగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ వంటి కొద్ది దేశాలకే పరిమితమై ఉంది. కానీ ఫుట్‌బాల్ అలా కాదు. యూరప్, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా అనే తేడా లేకుండా ప్రపంచంలోని మూలమూలలా ఈ ఆటకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. గ్లోబల్ రీచ్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రసార హక్కులు , స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ విక్రయాలు, మార్కెటింగ్ ఆదాయం ద్వారా ఫిఫాకు ఊహించని స్థాయిలో వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది.

క్రికెట్ అభిమానులు తమ క్రీడను ఎంతగానో ఇష్టపడినప్పటికీ, ఆర్థిక పరంగా గ్లోబల్ క్రేజ్ పరంగా క్రికెట్ ఇంకా ఫుట్‌బాల్ స్థాయిని అందుకోవడానికి చాలా దూరంలోనే ఉందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ క్రీడా రంగంలో ఫుట్‌బాల్‌దే ఎప్పటికీ తిరుగులేని 'రాజరికం' అని ఫిఫా వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ మరోసారి స్పష్టంగా చాటిచెప్పింది.

Tags:    

Similar News