ధోనీ కారులో కోహ్లి షికారు.. రాంచీ వీధుల్లో హ‌ల్ చ‌ల్

2008లో టీమ్ ఇండియాలోకి ధోనీ కెప్టెన్సీలోనే వ‌చ్చాడు విరాట్ కోహ్లి. కెరీర్ తొలినాళ్ల‌లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న స‌మ‌యంలో అత‌డికి అండ‌గా నిలిచాడు.;

Update: 2025-11-28 14:43 GMT

దిగ్గ‌జ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ కార్లు, బైక్ ల‌ క‌లెక్ష‌న్ గురించి ఎంత‌చెప్పినా త‌క్కువే..! ఓ ఇంటర్యూలో చూసిన‌దాని ప్ర‌కారం ఓ వంద వెహికిల్స్ వ‌ర‌కు ధోనీ గ్యారేజీలో ఉంటాయేమో..? అనిపిస్తుంది. మొద‌ట బైక్ లంటే చెవి కోసుకునే ధోనీ.. క్రికెట‌ర్ గా స్థిర‌ప‌డి అంత‌ర్జాతీయ స్థాయికి ఎదిగిన త‌ర్వాత వివిధ ర‌కాల కార్ల‌ను కొనుగోలు చేయ‌డం మొద‌లుపెట్టాడు. అటు భార‌త విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా, ఇటు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారీగా సంపాద‌న ఉండ‌డంతో పాటు రూ.వంద‌ల కోట్ల విలువైన అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్లతో ధోనీ ఆర్థికంగా బాగా స్థిర‌ప‌డ్డాడు. సొంత రాష్ట్రం జార్ఖండ్ రాజ‌ధాని రాంచీకి చెందిన అత‌డు.. ఆ న‌గ‌ర శివారులో విశాల‌మైన ఫామ్ హౌస్ నిర్మించుకుని అందులో త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన శున‌కాల‌ను పెంచుకుంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇప్పుడు ధోనీ ఐపీఎల్ లో మాత్ర‌మే ఆడుతున్న నేప‌థ్యంలో మిగ‌తా 9 నెల‌లు రాంచీలోనే ఉంటున్న‌ట్లు లెక్క‌. ఇంకా ఏమైనా ఎండార్సుమెంట్ల షూటింగ్ లు ఉంటేనో, మ‌రే ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కో త‌ప్ప అత‌డు బ‌య‌ట‌కు రాడు. అస‌లు ధోనీని ఫోన్ లో కాంటాక్ట్ చేయ‌డ‌మే క‌ష్టం అని చెబుతుంటారు. అంత‌గా ప్రైవ‌సీ కోరుకుంటాడు ఈ టీమ్ ఇండియా మాజీ దిగ్గ‌జం. ఇప్పుడు రాంచీలోనే ఉన్న అత‌డు.. త‌న ఇంటికి టీమ్ ఇండియా క్రికెట‌ర్ల‌ను ఆహ్వానించాడు. ఈ నెల 30న భార‌త జ‌ట్టు రాంచీలో ద‌క్షిణాఫ్రికాతో తొలి వ‌న్డే ఆడ‌నుంది. దీనికోసం జ‌ట్టు మొత్తం చేరుకుని హోట‌ల్ లో బ‌స చేసింది. వీరిలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌భ్ పంత్, బ్యాట్స్ మ‌న్ రుతురాజ్ గైక్వాడ్‌ల‌ను త‌న ఇంటికి ఆహ్వానించాడు ధోనీ.

అపూర్వ సోద‌ర ద్వ‌యం..

2008లో టీమ్ ఇండియాలోకి ధోనీ కెప్టెన్సీలోనే వ‌చ్చాడు విరాట్ కోహ్లి. కెరీర్ తొలినాళ్ల‌లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న స‌మ‌యంలో అత‌డికి అండ‌గా నిలిచాడు. దాదాపు మూడునాలుగేళ్లు కోహ్లి స‌వాళ్లు ఎదుర్కొన్నా ధోనీ వెన్నుద‌న్నుగా నిలిచాడు. ఈ మేర‌కు త‌న మాజీ కెప్టెన్ పై కోహ్లికి ఎప్ప‌టికీ గౌర‌వం ఉంది. అంతేగాక ధోనీ త‌ర్వాత కోహ్లినే జ‌ట్టు ప‌గ్గాలు అందుకున్నాడు. త‌న కెప్టెన్సీలోనూ ధోనీని స‌ల‌హాలు అడుగుతూ ఉండేవాడు. త‌న అభిమానాన్ని మైదానంలోనే కాదు బ‌య‌ట కూడా అత‌డు చాటుతుంటాడు. బ‌హుశా టీమ్ ఇండియాలో సురేశ్ రైనా త‌ర్వాత ధోనీకి ఎంతో స‌న్నిహిత‌మైన ఆట‌గాడు కోహ్లినే అనుకోవాలి . ఇప్పుడు ఆ బంధం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.

సొంత డ్రైవింగ్‌తో..

ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్ కోసం రాంచీ వ‌చ్చిన కోహ్లి, పంత్, రుతురాజ్ ల‌ను ధోనీ త‌న ఇంటికి ఆహ్వానించాడు. విందు అనంత‌రం ప‌లు విష‌యాలు మాట్లాడుకున్నాక ధోనీ త‌న కారును బ‌య‌ట‌కు తీశాడు. అందులో కోహ్లిని ఎక్కించుకుని రాంచీ వీధుల్లో ర‌య్ ర‌య్ మంటూ దూసుకెళ్లాడు. అలా..కోహ్లిని జ‌ట్ట బ‌స చేసిన హోట‌ల్ వ‌ద్ద దించాడు. వీరిద్ద‌రూ కారు దిగుతున్న‌వీడియోలు, ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. ఈ ఇద్ద‌రి అనుబంధాన్ని చూసి అభిమానులు ముచ్చ‌ట‌ప‌డుతున్నారు. త‌మ‌కు తోచిన కామెంట్లు పెడుతున్నారు. మ‌రి ఆదివారం రాంచీలో జ‌రిగే వ‌న్డేకు ధోనీ కుటుంబంతో హాజ‌ర‌వుతాడా? అనేది చూడాలి.



Tags:    

Similar News