మహిళా క్రికెట్ ఆల్ రౌండ్ వండర్ దీప్తిశర్మ... ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ
2011లో భారత్ లోనే జరిగిన పురుషుల వన్డే ప్రపంచ కప్ లో డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఎలాంటి కీలక పాత్ర పోషించి కప్ అందించాడో ఇప్పుడు దీప్తి శర్మ కూడా అదే పాత్ర పోషించింది.;
దక్షిణాఫ్రికాతో మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్.. ఫామ్ లో ఉన్న ఓపెనర్ మంధాన 45 పరుగులకు ఔటైంది.. దుమ్మురేపుతున్న షెఫాలీ వర్మ 87 పరుగులు చేసి వెనుదిరింది..! సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ సెంచరీ చేసిన జెమీమా 24 రన్స్ మాత్రమే చేయగలిగింది.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (20) కూడా పెద్ద స్కోరు చేయలేదు.. 223 పరుగులకు నాలుగు కీలక వికెట్లు పడిపోయాయి.. అటుచూస్తే మిగతావారిలో వికెట్ కీపర్ రిచా ఘోష్ మాత్రమే కాస్త బ్యాట్ గట్టిగా ఝళిపించగలదు.. ఈ పరిస్థితుల్లో ఒక ప్లేయర్ చివరి వరకు నిలిచింది...! తాను ఔట్ అయి జట్టు తక్కువ స్కోరుకు పరిమితం కావడం కంటే తాను చివరి వరకు నిలిచి మెరుగైన స్కోరు అందిచాలని పట్టుదల చూపింది..! ఫలితంగా టీమ్ ఇండియా 298 పరుగులు చేసింది. అంతటితో ఆ అమ్మాయి బాధ్యత ముగిసిందని అనుకోలేదు..! బంతితోనూ చెలరేగింది ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టింది. టీమ్ ఇండియాను జగజ్జేతగా సగర్వంగా నిలిపింది..! ఫైనల్లో మాత్రమే కాదు టోర్నీ మొత్తం కూడా ఇదే తీరుగా ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచింది. అందుకే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కొట్టేసింది. ఆ అమ్మాయి ఆల్ రౌండ్ వండర్ దీప్తి శర్మ.
అచ్చం యువరాజ్ సింగ్ లా...
2011లో భారత్ లోనే జరిగిన పురుషుల వన్డే ప్రపంచ కప్ లో డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఎలాంటి కీలక పాత్ర పోషించి కప్ అందించాడో ఇప్పుడు దీప్తి శర్మ కూడా అదే పాత్ర పోషించింది. అచ్చం యువరాజ్ లాగానే బ్యాటింగ్ లో ఐదు లేదా ఆరోస్ధానంలో దిగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఉపయుక్తమైన పరుగులు చేసింది. ఫైనల్లో 58 బంతుల్లో 58 పరుగులు (3 ఫోర్లు, సిక్స్) చేసింది. హర్మన్ ఔట్ అయ్యాక రిచా ఘోష్ (24 బంతుల్లో 34, 3 ఫోర్లు, 2 సిక్సులు) సాయంతో ఒక్కో పరుగు జోడించింది. ఇన్నింగ్స్ చివరి బంతికి ఔట్ (రనౌట్) అయింది.
బంతితో అదరహో..
ఆఫ్ స్పిన్నర్ అయిన దీప్తి ప్రపంచ కప్ లో 22 వికెట్లు సాధించింది. ఫైనల్లో 39 పరుగులకే 5 వికెట్లు తీసింది. తుది సమరంలో జట్టులో అత్యధిక ఓవర్లు (9.3) వేసింది ఈమెనే కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఓపెనర్, కెప్టెన్ లారా ఓల్వార్ట్ (101)ను దీప్తి ఔట్ చేయడం మ్యాచ్ (కప్) ను మన చేతుల్లోకి తెచ్చింది. ఇది కాక లోయరార్డర్ లో పడిన ఆరు వికెట్లు (4 వికెట్లు ప్లస్ రనౌట్) దీప్తి బౌలింగ్ లోనే కావడం విశేషం.
-339 పరుగుల అతి భారీ టార్గెట్ తో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లోనూ దీప్తి విలువైన 24 పరుగులు చేసింది. ప్రపంచ కప్ లో 9 మ్యాచ్ లలో ఏడుసార్లు బ్యాటింగ్ కు దిగి రెండు హాఫ్ సెంచరీలు సహా 215 పరుగులు చేసిన దీప్తిశర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీకి సరైన ఎంపికగా నిలిచింది.