ప్రపంచ ఫుట్ బాల్ లో ఒక శకం ముగిసింది..?
అయితే, రొనాల్డోను గోట్ అనకుండా మాత్రం ఉండలేం. మెస్సీకి అర్జెంటీనా వంటి గొప్ప జట్టు ఉంది. పేరు బయటకు రాలేదేమో కానీ.. మెస్సీ అంతటి ప్రతిభ ఉన్నవారు ఆ జట్టులో ఉండొచ్చు.;
అంతర్జాతీయ ఫుట్ బాల్ లో ఓ శకం ముగియనుందా..?? సమకాలీన ప్రపంచంలో అత్యద్భుత ఆటగాడిగా పేరున్న క్రీడాకారుడు ఇకపై తెరమరుగు కానున్నాడా..? దీనికి ఔను అనే సమాధానమే వస్తోంది..! తాను ఎంతగానో ప్రేమించే ఫుట్ బాల్ నుంచి త్వరలోనే తాను తప్పుకోనున్నట్లు అతడు ప్రకటించాడు. ఇదే నిజమైతే ప్రపంచ ఫుట్ బాల్ లో అతడి కీర్తి ఇక చరిత్రగా మిగలనుంది...! ఒక పీలే (బ్రెజిల్), ఒక మారడోనా (అర్జెంటీనా), రొనాల్డో (బ్రెజిల్) తర్వాత ఫుట్ బాల్ కు మారుపేరుగా మారిన ఆ ఆటగాడు తన భవిష్యత్ ఏమిటో తాజాగా తెలిపాడు. ఇంతకూ ఆ నిర్ణయం ఎప్పుడు ఉంటుందో..?
ది గోట్..
లయోనల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) ప్రస్తుత ఫుట్ బాల్ ప్రపంచంలో దిగ్గజ క్రీడాకారులు. వీరిలో ఎవరు గొప్ప అనేది ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది..! అభిమానుల వద్దకు వస్తే మాత్రం ఇద్దరూ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) అనే అంటారు. టాలెంట్, కెప్టెన్సీ, ఆకర్షణ అన్నిట్లోనూ సమమే అయినా ఒక్క విషయంలో మాత్రం రొనాల్డో కంటే మెస్సీనే ముందంజలో ఉన్నాడు. ఎందుకంటే.. మూడేళ్ల కిందట జరిగిన ప్రపంచ కప్ ను గెలిపించడమే కారణం.
జట్టే అతడు.. అతడే జట్టు..
అయితే, రొనాల్డోను గోట్ అనకుండా మాత్రం ఉండలేం. మెస్సీకి అర్జెంటీనా వంటి గొప్ప జట్టు ఉంది. పేరు బయటకు రాలేదేమో కానీ.. మెస్సీ అంతటి ప్రతిభ ఉన్నవారు ఆ జట్టులో ఉండొచ్చు. కానీ, రొనాల్డోకు పోర్చుగల్ జట్టులో అంతటి స్థాయిలో అండగా నిలిచే ఆటగాళ్లు లేరు. అందుకనే రొనాల్డోనే ఒక జట్టు.. అనిపిస్తుంది. అయితే, రొనాల్డో ప్రతిభ ఏమిటో ఫుట్ బాల్ లీగ్ లు చూస్తే తెలుస్తుంది. ప్రతిభావంతులైన వివిధ దేశాల ఆటగాళ్లు ఒకచోట (జట్టు) చేరడంతో రొనాల్డోకు లీగ్ లలో పని సులువు అయింది. అందుకనే అతడు లీగ్ ల మెగాస్టార్ అయ్యాడు.
చోటు కష్టమేనా?
ఫుట్ బాల్ ప్రపంచ కప్ వచ్చే ఏడాది జరగనుంది. 2022 ప్రపంచ కప్ లోనే రొనాల్డోను పోర్చుగల్ జట్టు నాకౌట్ మ్యాచ్ లకు పక్కనపెట్టారు. వచ్చే ఫిబ్రవరికి 41 ఏళ్లు కూడా నిండే అతడిని రాబోయే ప్రపంచ కప్ ఆడించడం చాలా కష్టమే. అందుకనే రిటైర్మెంట్ యోచనలో ఉన్నట్లు తెలిపాడు. కాగా, రొనాల్డో మొత్తం 1,294 మ్యాచ్ లు ఆడాడు. 952 గోల్స్ చేశాడు. ప్రతి మ్యాచ్ కు 0.74 గోల్స్ చొప్పున కొట్టాడు. రిటైర్మెంట్ వ్యాఖ్యలు నిజం అయితే గనుక ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో ఒక శకం ముగిసినట్లే.