టాలెంట్ చూడరా? భారతి ఫుల్మాలిపై నెటిజన్ల ట్రోలింగ్!
టాలెంట్ కంటే రూపమే ముఖ్యమా అనేలా సాగుతున్న ఈ వివాదం తాలూకు వివరాలు ఇప్పుడు చూద్దాం.
దేశం కోసం ఆడే ఒక క్రీడాకారిణికి ఉండాల్సింది అద్భుతమైన ప్రతిభా? లేక సమాజం కోరుకునే అందచందాలా? తాజాగా భారత మహిళా క్రికెటర్ భారతి ఫుల్మాలి విషయంలో జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ చూస్తుంటే ఈ ప్రశ్న రాక మానదు. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఐసీసీ షేర్ చేసిన ఒక ఫోటో ఆధారంగా ఆమె రూపాన్ని విమర్శిస్తూ కొంతమంది నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. టాలెంట్ కంటే రూపమే ముఖ్యమా అనేలా సాగుతున్న ఈ వివాదం తాలూకు వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఐసీసీ ఫోటోతో మొదలైన రచ్చ:
మహిళల టీ20 వరల్డ్ కప్ వాతావరణం ఊపందుకోవడంతో ఐసీసీ మన భారత మహిళా క్రికెటర్ల ఫోటోలను సోషల్ మీడియాలో అధికారికంగా పంచుకుంది. అయితే, ఈ ఫోటోలలో ఉన్న క్రికెటర్ భారతి ఫుల్మాలిని టార్గెట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కేవలం ఆమె శారీరక రూపాన్ని, హావభావాలను బట్టి విమర్శలు గుప్పించడం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
మగాడిలా ఉందంటూ బ్యాడ్ కామెంట్స్:
"ఆమె చూడటానికి మగాడిలా ఉందేంటి? ఉమెన్స్ క్రికెట్‌లో పురుషులను తీసుకున్నారా?" అని కొందరు, "ఆమె ఒక ట్రాన్స్‌జెండర్ ఏమో" అంటూ మరికొందరు అవగాహన లేకుండా సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్స్‌లో అసభ్యకరమైన కామెంట్లు పెట్టారు. ఇక ఒక అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక క్రీడాకారిణిని ఆమె ఆటను బట్టి కాకుండా, బాడీ షేమింగ్ చేస్తూ ఇలా హేళన చేయడం నిజంగా దురదృష్టకరం.
13 ఏళ్ల కష్టం.. పవర్ హిట్టర్‌గా గుర్తింపు:
మహారాష్ట్రకు చెందిన 31 ఏళ్ల భారతి ఫుల్మాలి క్రికెట్ ప్రయాణం అంత సాదాసీదాగా సాగలేదు. కేవలం 13 సంవత్సరాల వయస్సులోనే బ్యాట్ పట్టిన ఆమె, ఎన్నో కష్టాలను ఎదుర్కొని 17 ఏళ్లకే సీనియర్ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. విదర్భ మహిళల జట్టులో కీలకంగా ఎదిగి, 'ఇండియా బ్లూ' టీమ్‌లో కూడా స్థానం సంపాదించుకుంది. ఇక మైదానంలో పవర్ హిట్టర్‌గా బంతిని బాదే ఈమె ప్రతిభను పక్కనపెట్టి, కేవలం రూపం మీదే పడి ఏడవడం నెటిజన్ల సంకుచిత మనస్తత్వాన్ని చూపిస్తోంది.
ఇక క్రీడల్లో గెలవాల్సింది ఆట తీరు, టాలెంట్ మాత్రమే కానీ ముఖానికి వేసుకునే మేకప్ కాదు. రూపం ఎలా ఉన్నా దేశం కోసం మైదానంలో చెమట చిందించే ప్రతి ఆటగాడు మనకు గౌరవప్రదమే. ఇలాంటి బాడీ షేమింగ్ ట్రోల్స్ క్రీడాకారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఇక ఇప్పటికైనా నెటిజన్లు ఇలాంటి నీచమైన కామెంట్లు ఆపి, భారతి ఫుల్మాలి లాంటి పవర్‌ఫుల్ ప్లేయర్లకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు అభిమానులు.