మెట్టుదిగిన నఖ్వి.. సన్నాయి నొక్కులు.. మరో దేశం బోర్డుకు ఆసియా కప్
నఖ్వి తీరును అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది బీసీసీఐ. నవంబరులో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలోనూ ఈ విషయం లేవనెత్తుతామని స్పష్టం చేసింది.;
ఆసియా కప్ ఫైనల్ ముగిసి దాదాపు మూడు రోజులు.. కానీ, ట్రోఫీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ కూడా అయిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) చైర్మన్ మొహిసిన్ నఖ్వీ నుంచి స్వీకరించేందుకు టీమ్‌ఇండియా నిరాకరించింది. దీంతో అవమానానికి గురైన నఖ్వి.. ట్రోఫీని, విజేత మెడల్స్‌ను తనవెంట తీసుకుని హోటల్‌కు వెళ్లిపోయాడు. అప్పటినుంచి తనవెంటే ఉంచుకున్నాడా..? వాటిని ఎక్కడ దాచాడు..? వంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏసీఏ సమావేశంలో దబాయించి...
ట్రోఫీ, మెడల్స్ గురించి నఖ్వీని మంగళవారం జరిగిన ఏసీఏ సర్వసభ్య సమావేశంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిలదీసింది. అయితే, వాటిని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనవద్దకు వచ్చి తీసుకోవాలని నఖ్వి మెలిక పెట్టాడని కథనాలు వచ్చాయి. ఆసియా కప్ ఏమీ నీ సొత్తు కాదని.. అది విజేత జట్టు దగ్గర ఉండాలని బీసీసీఐ వాదించింది. కానీ, నఖ్వీ మాత్రం ఈ సమావేశంలో కాకుండా వేరే వేదిక మాట్లాడదాం అంటూ దాటవేశాడు.
ఐసీసీ దృష్టికి తీసుకెళ్లడంతో...
నఖ్వి తీరును అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది బీసీసీఐ. నవంబరులో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలోనూ ఈ విషయం లేవనెత్తుతామని స్పష్టం చేసింది. నఖ్వి ట్రోఫీ ఎత్తుకెళ్లడం, నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్లు కనిపిస్తోంది. అసలే ఐసీసీ చీఫ్ భారతీయుడైన జై షా. దీంతో నఖ్వి భయపడినట్లు తెలుస్తోంది. ఏసీఏ పదవి నుంచి అతడిని తొలగించాలని బీసీసీఐ... ఐసీసీని కోరినట్లు సమాచారం. దీంతో తన పదవి పోతుందనే ఉద్దేశంతో ఆసియా కప్‌ను తిరిగిచ్చేందుకు సిద్ధపడినట్లు కథనాలు వస్తున్నాయి.
కప్ ఎక్కడ?
నఖ్వి పాక్‌లో ఉన్నారా? దుబాయ్‌లో ఉన్నారా? అనేది తెలియరాలేదు. కానీ, అతడు ఆసియా కప్‌ను యూఏఈ బోర్డుకు ఇచ్చాడని చెబుతున్నారు. అక్కడినుంచి టీమ్ ఇండియాకు చేరాల్సి ఉంది. అది ఎలాగన్నది తెలియాల్సి ఉంది. ఆసియా కప్‌ను యూఏఈ బోర్డే నిర్వహించింది.