టీమ్ఇండియా ప్రపంచకప్ విజయం వెనుక.. ఆంధ్రా అమోల్ మజుందార్
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటించిన చక్ దే సినిమాలో లాగా తన జట్టుతో తానేంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. అతడే అమోల్ మజుందార్!;
ఏడెనిమిదేళ్ల కిందటి సంగతి.. భారత మహిళల క్రికెట్ జట్టుకు ఓ కోచ్ ఉండేవాడు.. ఆట సంగతేమో కానీ, జట్టులో అనేక పుల్లలు పెట్టాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతడేమీ సాధారణ క్రికెటర్ కూడా కాదు.. టీమ్ ఇండియాకు దిగ్గజాలతో కలిసి ఆడినవాడు. దేశవాళీల్లోనూ బాగానే పేరున్నవాడు. తీరు మాత్రం బేకార్. అతడంటే జట్టులోని సీనియర్లకే గౌరవం లేకుండా పోయింది.
మరి ఇప్పుడు... ఇతడు దేశవాళీల్లో దుమ్మురేపినా టీమ్ ఇండియాకు ఆడలేదు.. అత్యంత ప్రతిభావంతుడు అయినప్పటికీ అవకాశాలు దొరకలేదు...! కానీ, అంతటితో నిరాశ చెందలేదు. ఎవరిపైనా కోపం పెంచుకోలేదు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటించిన చక్ దే సినిమాలో లాగా తన జట్టుతో తానేంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. అతడే అమోల్ మజుందార్!
టెండూల్కర్ సమకాలీనుడైన ముంబైకర్..
అమోల్ మజుందార్ గురించి చెప్పాలంటే.. ముందు సచిన్ గురించి చెప్పాలి. సచిన్, వినోద్ కాంబ్లీలు చదివిన శారదాశ్రమ్ స్కూల్ తరఫునే ఇతడూ ఆడాడు. అంతేకాదు.. వారు జోడించిన 664 పరుగుల రికార్డు భాగస్వామ్యం మ్యాచ్ లో రోజంతా బ్యాటింగ్ ప్యాడ్ లు కట్టుకుని కూర్చున్న పిల్లాడు మరొకడున్నాడు. అతడే అమోల్ మజుందార్. ఈ నిరీక్షణ అతడి జీవితాంతం కొనసాగింది. సచిన్, కాంబ్లీలు టీమ్ ఇండియాలోకి వచ్చేసినా అమోల్ కు మాత్రం పిలుపు దక్కలేదు. చివరకు రంజీ మెగాస్టార్ గా మిగిలిపోయాడు.
19 ఏళ్ల వయసుకే...
అత్యంత పోటీ ఉండే ముంబై రంజీ జట్టులో కేవలం 19 ఏళ్ల వయసుకే చోటు దక్కించుకున్నాడు మజుందార్. 1993-94 సీజన్ ద్వారా అరంగేట్రం చేసిన అమోల్ సరిగ్గా 20 ఏళ్లు దేశవాళీల్లో ఆడాడు. ముంబై, అసోం తర్వాత చివరకు కెరీర్ ను ముగించింది ఏ జట్టుతోనో తెలుసా? మన ఆంధ్రా జట్టుతోనే! అది కూడా కెప్టెన్ గా కావడం విశేషం. 2013-14 సీజన్ లో ఆంధ్రాకు ఆడుతూనే కెప్టెన్ హోదాలో రిటైర్మెంట్ ప్రకటించాడు మజుందార్. ఇతడికి భారత జట్టులో అవకాశాలు రాకపోవడాన్ని ఓ దశలో దిగ్గజ క్రికెటర్లు కూడా ప్రశ్నించారు. కానీ, మిడిలార్డర్ ఖాళీ లేనందున చేసేదేమీ లేకపోయింది.
కోచ్ గా వచ్చి.. కప్ అందించి..
టీమ్ ఇండియా మహిళల జట్టు 2005, 2017 వన్డే ప్రపంచ కప్ లలో ఫైనల్ కు చేరినా విజయాలు సాధించలేదు. అంతెందుకు..? ఈ ప్రపంచ కప్ లో లీగ్ దశలోనూ మూడు మ్యాచ్ లలో వరుసగా ఓడింది. ఇంగ్లండ్ తో గెలిచే మ్యాచ్ లో ఓడింది. ఇలాంటి సమయంలో అమోల్ లోని అసలైన కోచ్ బయటకు వచ్చాడు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ ను సైతం డ్రెస్సింగ్ రూమ్ లో తీవ్రంగా మందలించాడు. జట్టు ఆలోచనలో మార్పు తెచ్చాడు. చివరి వరకు పోరాడే స్ఫూర్తినింపాడు. ఫలితంగానే ఆస్ట్రేలియాపై సెమీస్ లో ఘన విజయం. ఫైనల్లోనూ టీమ్ ఇండియా అమ్మాయిలు ఎక్కడా డీలా పడలేదు అంటే.. కారణం మజుందార్ మద్దతే. 2013లో రిటైరయ్యాక నేషనల్ క్రికెట్ అకాడమీ (ప్రస్తుత క్రికెట్ ఎక్సలెన్స్)లో, తర్వాత ఏజ్ గ్రూప్ జట్లకు మజుందార్ కోచింగ్ ఇచ్చాడు. తాను పుట్టి పెరిగిన ముంబై కోచ్ గానూ పనిచేశాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ టీమ్ సభ్యుడు. 2022లో ముంబైకే చెందిన రమేశ్ పొవార్ ను తప్పించిన బీసీసీఐ 2023లో మజుందార్ కు టీమ్ ఇండియా మహిళల జట్టు బాధ్యతలు కట్టబెట్టింది.
కొసమెరుపుః పైన చెప్పుకొన్న వివాదాస్పద మొదటి కోచ్ రమేశ్ పొవారే. రెండో కోచ్ మజుందార్ అని చెప్పుకోవాల్సిన పనిలేదు