ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం వ‌ల్లే.. ఏపీలో క‌రెంటు కోత‌ల‌ట‌!

Update: 2022-05-17 00:30 GMT
బొంక‌రా.. బొంక‌రా.. బోడిగా అంటే.. ``టంగుటూరు మిరియాలు తాటికాయ‌లంత‌!`` అన్నాట్ట!! అలా వుంది.. వైసీపీ నేత‌ల వ్య‌వ‌హా రం అంటున్నారు ప్ర‌జ‌లు. మోకాలుకు బోడిగుండుకు చ‌క్క‌గా ముడేస్తున్న చందంగా.. ప్ర‌జ‌ల‌కు క‌ట్టుక‌థ‌లు చెప్ప‌డంలో ఆరితేరిపో తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాష్ట్ర స‌ర్కారు నిర్వాకం.. కార‌ణంగా ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌కు అంత‌ర్జాతీయ స‌మ‌స్య‌లు ముడిపెట్టేసి.. ప్ర‌జ‌ల ను మ‌భ్య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కులు అధినేత ఆదేశాల మేర‌కు క‌ష్ట‌మో.. నిష్టూర‌మో.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.

అయితే.. జ‌గ‌న‌న్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో రాష్ట్రం రంజిల్లుతోంద‌ని.. సో.. త‌మ‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌ని.. ఎక్క‌డిక‌క్క‌డ స్వాగ‌త స‌త్కారాల‌తో ఠారెత్తించి.. ఊరేగింపు చేస్తార‌ని.. అనుకున్న నాయ‌కులకు ఇప్పుడు అదే ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న తీవ్ర నిర‌స‌న‌తో.. క‌ళ్లు తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. దీంతో తాముఏం మాట్లాడుతున్నామో.. కూడా తెలియ‌ని ఒక సందిగ్ధావ స్థ‌ను ఎదుర్కొంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఈ గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం అనుకున్న విధంగా అయితే.. ఎక్క‌డా సాగ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు తాము ఎదుర్కొంటున్న స‌మస్య‌ల‌పై నిల‌దీస్తున్నారు.

ప్ర‌భుత్వ అల‌స‌త్వాన్ని.. ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను.. క‌రెంటు కోత‌ల‌ను.. విద్యుత్ చార్జీల భారాల‌ను కూడా ఏక‌రువు పెడుతున్నారు. అయితే.. మంత్రి రోజా వంటి గ‌డుసు నేత‌లు.. ఇలాంటి సంద‌ర్భాల్లో ఎదురు దాడి చేసి త‌ప్పించుకుంటున్నారు. ``చంద్ర‌బాబు లాగా.. మాట్లాడితే.. నాద‌గ్గ‌ర ప‌ప్పులుడ‌క‌వ్‌!`` అంటూ.. ఆమె ఇటీవ‌ల న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఓ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌కుండా.. ఇలా ఎదురు దాడి చేసి త‌ప్పించుకున్నారు. ఇక‌, మ‌రికొంద‌రు.. ``అయ్యో.. ఇన్ని స‌మ‌స్య‌లు ఉన్న విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు నాకు ఎందుకు చెప్ప‌లేదు!`` అని అమాయ‌క‌త్వం న‌టిస్తున్న ఎమ్మెల్యేలు కూడా తూర్పులో మ‌న‌కు క‌నిపిస్తున్నాయి.

ఇక‌, ప‌శ్చిమ విష‌యానికి వ‌స్తే.. తాజాగా భీమ‌వ‌రం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇలాంటి నేత‌ల‌కు భిన్నంగా పైన చెప్పుకొన్న గ‌డుసు పిండంగా.. వ్య‌వ‌హ‌రించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా నిర్వ‌హించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో..  ``అయ్యా క‌రెంటు కోత‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నాం`` అంటూ ఓ బామ్మ ప్ర‌శ్మించింది. దీంతో గ్రంధి కొంచెం పెద్ద మ‌న‌సు చేసుకుని.. బామ్మ‌ భుజాన చేయేసి మ‌రీ.. ఒక లాజిక్కు చెప్పుకొచ్చారు.
4

``అయ్యో బామ్మా.. నీకు విష‌యం తెలియ‌దా..!  ఉక్రెయ‌న్‌పై ర‌ష్యా యుద్ధం చేస్తోంది. అందుకే మ‌న‌కు క‌రెంటు కోత‌లు వ‌చ్చాయి!`` అని పిట్ట క‌థ చెప్పుకొచ్చారు.దీంతో బోసిబుగ్గ‌ల బామ్మ‌.. బుగ్గ‌లు నొక్కుకుని.. ``అదెలా సెప్పు!`` అని ఆరాతీస్తే.. ``యుద్దం కార‌ణంగా.. బొగ్గు నిలిచిపోయిందా!  బొగ్గు నిలిచిపోవ‌డంతో ఉత్ప‌త్తి ఆగిపోయిందా.. ఉత్ప‌త్తి ఆగిపోవ‌డంతో.. క‌రెంటు లేకుండా పోయిందా!`` అంటూ.. చీమా చీమా ఎందుకు కుట్టావే.. అనే క‌థ‌ను ఈ రూపంలో చెప్పుకొచ్చి.. బామ్మ‌ను త‌ప్పించుకుని వ‌డివ‌డిగా వెళ్లిపోయారు. అయితే.. గ్రంధి క‌థ‌నం విన్న పొరుగింటోళ్లు.. ``ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి`` అంటూ.. పెద‌వులు విరుచుకున్నార‌ట‌!! ఇదీ సంగ‌తి!!!
Tags:    

Similar News