గురువులుకు ఆ అదృష్టం లేదా? మరోసారి నిరాశ తప్పలేదుగా?

Update: 2023-03-24 10:00 GMT
రాజకీయాల్లో కొన్ని అంశాలు చాలా సిత్రంగా కనిపిస్తాయి. అన్ని ఉంటాయి కానీ అదృష్టం ఉండదు కొందరికి. అలాంటి కోవలోకే వస్తారు మత్స్యకార అభివ్రద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా వ్యవహరించిన కోలా గురవులుకు చట్టసభలో ప్రవేశించే అదృష్టం లేదా? అన్న మాట మరోసారి చర్చకు వచ్చింది. అన్ని హంగులు ఉన్న ఆయన..ఎన్నికలు వచ్చేసరికి ఆయనకు ఏదోలా ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి. తాజాగా అలంటి పరిస్థితే మరోసారి వచ్చింది.

నిజానికి నిన్న ఓట్ల లెక్కింపు వేళలో.. కోలా గురువులు గెలిచారని.. ఈ మధ్యనే వైసీపీ తీర్థం తీసుకున్న జయ మంగళ వెంకటరమణ ఓడినట్లుగా వార్తలు వచ్చాయి. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ కింద వచ్చింది. దీంతో..పలువురు నోటి నుంచి గురువులు చట్టసభలోకి ఎంట్రీ ఇస్తున్నారన్నమాటను ప్రత్యేకంగా చర్చించుకున్నారు. ఎందుకంటే.. ఎన్నో ఏళ్లుగా ఆయన చట్టసభలోకి అడుగు పెట్టేందుకు తహతహలాడుతున్నారు. అలాంటి ఆయనకు.. ఒక్క ఓటు తేడాతో ఆయన చిరకాల వాంఛ తీరని పరిస్థితి.

విశాఖలో మరపడవలు.. హేచరీ వ్యాపారం చేసే గురువులుకు లేనిదంటూ ఏమీ లేదని.. అన్ని ఉన్న ఆయనకు రాజకీయాల్లో కీలక సమయాల్లో అదృష్టం ముఖం చాటేస్తుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఆయన పొలిటికల్ గ్రాఫ్ ను చూస్తే తెలుస్తుంది. 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ లో చేరి నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

ఆ వేళలోకాంగ్రెస్ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాసరావు చేతిలో స్వల్ప ఓట్ల తేదాతో ఓటమిపాలయ్యారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైన నేపథ్యంలో ఆయన అందరి బాటలోనే నడిచారు. కానీ.. జగన్ ఎప్పుడైతే వైసీపీ పెట్టారో.. ఆయన అందులో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయి.. టీడీపీ తరఫున పని చేశారు.

అయితే.. 2019 ఎన్నికలకు కాస్త ముందు మరోసారి వైసీపీలో చేరారు. అయితే.. అధినేత జగన్ ఆయనకు కాకుండా ద్రోణంరాజు శ్రీనివాసరావుకు పార్టీ టికెట్ కేటాయించటంతో గురువులుకు పోటీ చేసే ఛాన్స్ లభించలేదు. దీంతో.. టికెట్ కూడా రాని పరిస్థితి. దీంతో.. ఆయనకు కార్పొరేషన్ ఛైర్మన్ ఇచ్చారు. కానీ.. తానుచట్టసభలో అడుగు పెట్టాలన్న ఆయన కోరికకు ముగింపుపలుకుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా కావటంతో ఆయన తన గెలుపు ఖాయమని.. ఈసారి చట్టసభలో అడుగుపెట్టటం పక్కా అన్న ధీమాతో ఉన్నారు.

అయితే.. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనకు వేయాల్సిన ఓటును టీడీపీ అభ్యర్థికి వేయటం.. రెండోప్రాధాన్యతగా జయమంగళ వెంకటరమణకు వేయటంతో.. ఆయన గెలవటం.. గురువులు ఓడిపోవటం జరిగింది. దీంతో.. ఆయన చిరకాల కల ఒక్క ఓటు తేడాతో తప్పింది. ఇదంతా చూసినోళ్లు గురువులుకు అర్జెంట్ గా కావాల్సింది అధినేత ఆశీస్సుల కంటే కూడా అదృష్టం అన్న మాట వినిపించటం గమనార్హం. మరి..కాలం ఏం చేస్తుందో చూడాలి. 

Similar News