ఏపీకి ఇన్ని అవార్డులు వస్తున్నాయి.. అన్యాయం కాకపోతే ఎవరూ రాయరేం?

Update: 2022-12-16 04:55 GMT
అప్పుడప్పుడు సీఎం జగన్ మాటల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనిపిస్తుంది. కారణం.. ఆయన చేసిన తప్పులు.. చేసే తప్పుల్ని మాత్రం ప్రశ్నిస్తూ.. కడిగేసే వారికి.. ఆయనలోని మంచిని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీడియా మీద ఉందని చెప్పాలి. జగన్ అన్నంతనే నెగిటివ్ మాత్రమే తప్పించి పాజిటివ్ ఇసుమంత కూడా చూడకూడదన్న పట్టుదల మాకు ఎంతమాత్రం లేదు. అలా అని లేనిది ఉన్నట్లు రాయటం మా ఉద్దేశం కాదు. అలానే ఉన్నది అసలేం లేదన్నట్లుగా చెప్పటం చేతకాదు. కాకపోతే.. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నటి గీతను చూడని చాలామంది.. తిడితే తిట్టటమే.. పొగిడితే పొగడటం మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తంగా తిట్టే జట్టులో ఉంటావా? పొగిడే జట్టులో ఉంటావా? అన్నది తేల్చుకోమంటున్నారు.

నాకు అలా జట్లు కట్టటం ఇష్టం లేదు. సత్యం వైపు ఉంటానని చెబితే సొల్లు ఆపు అంటారే తప్పించి.. వారి కమిట్ మెంట్ ను.. సీరియస్ నెస్ ను మాత్రం గుర్తించరనే చెప్పాలి. ఇదంతా ఎందుకంటే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిద్ర లేచింది మొదలు తప్పులు మాత్రమే చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించేవారు పలువురు కనిపిస్తారు.

అసలు జగన్ ఉన్నదే నీతి కోసం.. న్యాయం కోసం మాత్రమే అన్నట్లుగా బిల్డప్ ఇచ్చే వారు ఉన్నారు. కానీ.. మా ఉద్దేశంఏమంటే ఉన్నది ఉన్నట్లుగా.. లేనిది లేనట్లుగా వ్యవహరించాలన్నదే పాలసీ.

ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారంటే.. నిజమన్న మాట చెప్పక తప్పదు. పాలనలో పడకేసినట్లుగా జగన్ ప్రభుత్వం గురించి తరచూ విమర్శలు రాసేయటం తెలిసిందే. అయితే.. మొత్తం ప్రభుత్వం అని చెప్పలేం కానీ.. కొన్ని విభాగాలకు చెందిన అధికారులు  పుణ్యమా అని.. వారి సమర్థత కారణంగా ఏపీ ప్రభుత్వానికి కొన్ని అవార్డులు వస్తున్నాయి. బ్యాడ్ లక్ ఏమంటే.. నెగిటివ్ వార్తల్ని తాటికాయ అక్షరాలతో రాసే మీడియా సంస్థలు.. మంచి జరిగినప్పుడు చీమ తలకాయంత ప్రాధాన్యత ఇస్తున్న వైనం తెలిసిందే.

తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏపీకి చెందిన వ్యవసాయ రంగానికి సంబంధించి పలు పురస్కరాలు లభించాయి. ఏపీలో జరుగుతున్న ప్రయత్నాలకు లభించిన గుర్తింపుగా చెబుతున్నారు. అగ్రికల్చర్ టుడే గ్రూపుఅందించే బెస్టు పాలసీ లీడర్ షిప్ అవార్డు 2022 దేశ రాజధాని ఢిల్లీలో ఇచ్చారు. దీనికి సంబందించి ఏపీకి చెందిన వైఎస్సార్ ఉద్యాన వర్సిటీకి బెస్ట్ అకడమిక్ లీడర్ షిప్ అవార్డు వచ్చింది. అంతేకాదు ఈ ఏడాది బెస్ట్ పాలసీ లీడర్ షిప్ కేటగిరిలో కూడా వ్యవసాయ శాఖకు అవార్డు లభించింది.

ఇదే కాదు.. ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన ప్రసూతి సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖకు సైతం జాతీయ స్థాయిలో అవార్డు లభించటం గమనార్హం. నేషనల్ మెటర్నరల్ హెల్త్ వర్కుషాపు ఇటీవల ఢిల్లీలో జరిగింది. ఇందులో అత్యధిక లక్ష్యా గుర్తింపు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రుల విభాగంలో ఏపీకి పురస్కారం వచ్చింది. ఇలా పాజిటివ్ అంశాలు సైతం జగన్ ప్రభుత్వంలో ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నిత్యం తిట్టేయటం.. తప్పులు ఎత్తి చూపే కార్యక్రమాన్ని చేపడుతూనే.. సాధించిన విజయాల్ని సైతం ప్రజలతో పంచుకోవటం ద్వారా.. ఏం చేయాలన్న కీలక నిర్ణయాన్ని ప్రజలకు వదిలేయాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే పరిధి దాటినట్లేనని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News