వైఎస్ క్యాంటీన్ల‌ను జ‌గ‌న్ ఏం చేయ‌నున్నారు?

Update: 2019-07-28 04:39 GMT
ఐదు రూపాయిలకే క‌డుపు నిండా భోజ‌నాన్ని పెట్టే అన్న క్యాంటీన్లకు సంబంధించి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనున్నారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. చంద్ర‌బాబు హ‌యాంలో అన్న క్యాంటీన్ల పేరుతో భారీ ఎత్తున క్యాంటీన్లు ఏర్పాటుచేశారు. ఇందుకోసం పెద్ద ఎత్తున భ‌వ‌నాల్ని నిర్మించారు కూడా.

ఈ క్యాంటీన్లతో ప్ర‌యోజ‌నం ఎంత‌న్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతుంటాయి. అయితే.. పేదోళ్ల క‌డుపు నింపేందుకు ఈ క్యాంటీన్లు ఉప‌యోప‌డుతున్న‌ట్లుగా ప‌లువురు చెబుతుంటారు.

ఏపీలో ఎన్నిక‌లు ముగిసి.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఏర్పాటైన వెంట‌నే.. ఈ క్యాంటీన్ల‌కు పేరు.. రంగు మారుస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అప్ప‌టివ‌ర‌కూ ఉన్న అన్న క్యాంటీన్లు కాస్తా.. వైఎస్ క్యాంటీన్లుగా మారాయి. అప్ప‌టివ‌ర‌కూ ప‌సుపు రంగుతో ఉన్న భ‌వ‌నాల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగుల్లోకి భ‌వ‌నాల్ని మార్చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఫోటో స్థానే దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఫోటోల్ని భారీగా పెట్టేశారు. ఇదంతా ఓకే అయినా.. ఈ క్యాంటీన్ల‌ను కొన‌సాగిస్తారా?  నిలిపివేస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలోని ప‌లు క్యాంటీన్లు ఆహారాన్ని స‌ప్లై చేయ‌కుండా మూత ప‌డి ఉండ‌టంతో.. వీటి భ‌విష్య‌త్తు ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

వాస్త‌వానికి ఐదు రూపాయిల‌కు భోజ‌నం అందించే ఈ క్యాంటీన్ల ద్వారా ప్ర‌జ‌ల్లో బ‌ద్ధ‌కాన్ని పెంచ‌టంతో పాటు.. అల్పాదాయ వ‌ర్గాల వారు.. త‌క్కువ‌ధ‌ర‌కే భోజనాన్ని అందించే ఈ క్యాంటీన్ల‌లో భోజ‌నం చేసేసి.. ఆ మిగిలిన డ‌బ్బుతో మ‌ద్యానికి అల‌వాటు ప‌డుతున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీనికి తోడు ఈ క్యాంటీన్ల నిర్వాహ‌ణ‌కు భారీ ఎత్తున నిధుల్ని ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో ఈ ప‌థ‌కం అమ‌లు చేయాలా?  వ‌ద్దా? అన్న విష‌యంపై జ‌గ‌న్ స‌ర్కారు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. వాస్త‌వ ప‌రిస్థితుల్ని మ‌దింపు చేస్తే..ఈ క్యాంటీన్ల ద్వారా పేద ప్ర‌జ‌ల‌కు క‌లుగుతున్న ప్ర‌యోజ‌నం త‌క్కువేన‌న్న మాట వినిపిస్తోంది. అందుకే..కాస్త వేచి చూసే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించి.. ఈ క్యాంటీన్ల మూసివేత కార‌ణంగా ప్ర‌జ‌ల్లో ఎలాంటి వ్య‌తికేక‌త‌.. అసంతృప్తి లేద‌న్న విష‌యాన్ని ఖ‌రారు చేసుకున్న త‌ర్వాతే తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెబుతున్నారు. ఒక‌వేళ‌.. ఈ క్యాంటీన్ల‌ను తెర‌వాల‌న్న ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటే.. అందుకు అనుగుణంగా నిర్ణ‌యం తీసుకునే వీలుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News