వినుకొండలో వైరల్ గా మారిన విజయ్ పోస్టర్లు.. రాష్ట్ర సరిహద్దులను చెరిపేసిన అభిమానం..
వెండితెరపై దశాబ్దాల పాటు వెలిగిన స్టార్.. ప్రజా క్షేత్రంలో ధ్రువతారగా మారినప్పుడు ఆ వేడుకలు సరిహద్దులను చెరిపేస్తాయి.;
వెండితెరపై దశాబ్దాల పాటు వెలిగిన స్టార్.. ప్రజా క్షేత్రంలో ధ్రువతారగా మారినప్పుడు ఆ వేడుకలు సరిహద్దులను చెరిపేస్తాయి. తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాస్తూ, ద్రవిడ కోటలో తన జెండా పాతిన ఒక నాయకుడి విజయం ఇప్పుడు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ మార్మోగుతోంది. కులమతాలకు అతీతంగా, భాషా భేదం లేకుండా అభిమానులు జరుపుకుంటున్న సంబురాలు ఇప్పుడు ఒక కొత్త చర్చకు దారితీశాయి. కేవలం ‘అభినందనల’తో ఆగకుండా, ఆ నాయకుడికి ఒక సామాజిక ముద్రను వేస్తూ వెలిసిన కొన్ని బ్యానర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
వినుకొండలో వెలిసిన వింత బ్యానర్లు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వెలిసిన కొన్ని బ్యానర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తమిళనాడులో ఘనవిజయం సాధించిన టీవీకే అధినేత విజయ్‌ను ఉద్దేశిస్తూ అభిమానులు ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్లపై ఉన్న అక్షరాలు అందరినీ తన వైపునకు తిప్పుకుంటున్నాయి. ‘తమిళనాడు తొలి ‘దళిత ముఖ్యమంత్రి’ విజయ్‌కు శుభాకాంక్షలు’ అంటూ రాశారు. విజయ్‌ను దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా అభివర్ణిస్తూ వారు చేసిన వ్యాఖ్యలు కొత్త సమీకరణాలకు తెరలేపాయి. తమిళనాడు వెలుపల, అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో విజయ్‌ను ఒక సామాజిక వర్గ ప్రతినిధిగా చూడడం విశేషం.
ఏపీలో టీవీకే శ్రేణుల సంబురాలు
విజయ్ విజయం సాధించిన తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి వంటి ప్రాంతాల్లో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుతూ అభిమాన నటుడు సీఎం కావడాన్ని వేడుకగా జరుపుకున్నారు. తమిళనాడుకు ఆనుకొని ఉన్న జిల్లాలు కావడంతో ఇక్కడ విజయ్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే, వినుకొండలో వెలిసిన బ్యానర్లపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఉండడం గమనార్హం. పవన్, విజయ్ ఇద్దరూ సినీ రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో సక్సెస్ కావడంతో, ఇద్దరి అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది.
నా కులం ‘తమిళం’
ఒకవైపు అభిమానులు ఆయనకు సామాజిక వర్గాలను ఆపాదిస్తుంటే, విజయ్ మాత్రం తన వైఖరిని గతంలోనే స్పష్టం చేశారు. తన పిల్లల స్కూల్ సర్టిఫికెట్లలో గానీ, ఇతర అధికారిక పత్రాల్లో గానీ కులం, మతం కాలమ్‌లలో ‘నో కాస్ట్’ అని పేర్కొన్నట్లు ఆయన గతంలో ప్రకటించారు. అంతేకాకుండా, తాను ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా కాకుండా, ఒక ‘తమిళియన్’ గా గుర్తింపు కోరుకుంటానని పలు సందర్భాల్లో చెప్పారు. తనది ‘తమిళం’ కులం అని పేర్కొనడం ద్వారా ద్రవిడ సిద్ధాంతాల పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు.
చర్చనీయాంశమైన సామాజిక ముద్ర
విజయ్ తనను తాను కులాలకు అతీతుడిగా చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో ప్రజలు ఆయనను తమవాడిగా చూసుకోవడంలో ఒక రకమైన సామాజిక సాధికారతను వెతుక్కుంటున్నారని తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటి వరకు దళిత సామాజిక వర్గం నుంచి సీఎం రాలేదనే చర్చ ఉన్న నేపథ్యంలో, విజయ్ రూపంలో ఆ లోటు తీరిందని కొందరు భావిస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని కులాల ప్రాతిపదికన కాకుండా, ‘తమిళ జాతీయవాదం’, ‘సామాజిక సమానత్వం’ ప్రాతిపదికన నడిపిస్తానని స్పష్టం చేశారు.
మొత్తానికి విజయ్ విజయం కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా, పొరుగు రాష్ట్రాల్లో కూడా సామాజిక మరియు రాజకీయ చర్చలకు వేదికగా మారుతోంది. అభిమానుల ఉత్సాహం ఒకవైపైతే, విజయ్ తన పాలనలో ఈ కుల సమీకరణాలను ఎలా సమతుల్యం చేస్తారో చూడాలి.