మడమ తిప్పక తప్పదు జగన్.... ?

Update: 2021-10-12 17:40 GMT
జగన్ అనేక హామీలు ఇచ్చారు. అలాగే అనేక రకాలైన కీలక  నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇక పాలనాపరమైన నిర్ణయాల విషయానికి వస్తే వాటిలో కూడా అమలు జరగనివి ఎన్నో ఉన్నాయి. వాటి విషయం పక్కన పెడితే గత రెండున్నరేళ్ల జగన్ పాలనను విశ్లేషించుకుంటే ఒక్కటి మాత్రం సుస్పష్టంగా తెలుస్తుంది. అది జగన్ తాను చెప్పిన మేరకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. వాటి కోసమే ఆయన తన మొత్తం ఆలోచనలు, అనుభవాన్ని కూడా రంగరించి మరీ అనుకున్నది సాధిస్తున్నారు అంటున్నారు.

జగన్ ఒక తపస్సు లాగానే భావించి హామీలను నిలబెట్టుకుంటున్నారు. అందుకోసం ఆయన పడుతున్న కష్టాలను సైతం పంటి కింద బిగపెడుతున్నారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నా అసలు జంకడం లేదు. చాలా మంది జగన్ పధకాలను పంచుతూ ఓట్లకు గేలం వేస్తున్నారని కూడా అంటున్నారు. అందులో ఎంతో కొంత వాస్తవం ఉన్నా జగన్ చేస్తున్నది దాని కంటే కూడా తన మాట నిలబెట్టుకోవడానికే అని సన్నిహితులు చెబుతారు. వైఎస్సార్ ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. మాట ఇస్తే తప్పరు, మడప తిప్పరు అని. జగన్ కూడా దాన్ని విపక్ష నేతగా ఉన్నపుడు పదే పదే చెప్పేవారు. తాను కనుక అధికారంలోకి వస్తే చెప్పిన ప్రతీ మాటా నిలబెట్టుకుంటాను అని కూడా ఆయన గట్టిగా అనేవారు.

ఏపీ జనాలు దాన్ని కూడా నమ్మే జగన్ని సీఎం ని చేశారు. అందువల్లనే ఏపీ నాశనం అయిపోతోంది. అప్పుల కుప్పగా మారుతోంది అని అంతా గోడు పెడుతున్నా కూడా జగన్ ఎక్కడా తగ్గడంలేదు. ఆఖరుకు నూటాభై కోట్లకు కూడా ఆస్తులను కుదువ పెట్టి మరీ అప్పులు తెచ్చి హామీలను తీరుస్తున్నారు నిలబెట్టుకుంటున్నారు. వైఎస్సార్ కి ఆప్త మిత్రుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు కూడా ఈ విషయంలో జగన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాడు కొంత మేరకే అప్పులు చేస్తే నేడు జగన్ ఏకంగా రాష్ట్రానే అమ్మేస్తున్నారు అంటూ ఉండవల్లి హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

సరే ఎవరెన్ని అనుకున్నా జగన్ తన మాట ఎక్కడా పోకూడదనే ఈ అసిధారా వ్రతాన్ని చేపట్టారు. తాను మాట తప్పను అని నిరూపించుకునేందుకు ఏపీ ప్రగతిని కూడా పక్కన పెట్టి మరీ అంతా చేస్తున్నారు. అయితే గట్టిగా చూస్తే ఏపీలో ఇప్పటికి సగం పాలన మాత్రమే అయింది. ఇంకా మిగిలింది చాలా ఉంది. మరి జగన్ 2024 ఎన్నికల దాకా ఇలా హామీలను నిలబెట్టుకుని సంక్షేమానికి ఏటా లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయాలంటే అయ్యే పనేనా అన్న ప్రశ్నలు అయితే అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఇప్పటికే తేవాల్సిన అప్పులు అన్నీ కూడా తెచ్చేశారు, ఇవ్వాల్సిన వారు ఇచ్చేశారు, ఇపుడు అప్పులు ఎటూ పుట్టవు, కుదువ పెట్టేందుకు కూడా ఆస్తులు ఉండవు, మరో ఆరు నెలల తరువాత ఏపీ పరిస్థితి కడు దుర్భరమే అని ఆర్ధిక వేత్తలు చెబుతున్న మాటలు వింటూంటే జగన్ మడమ తిప్పాల్సిందేనా అన్న చర్చ అయితే ఉంది. మరి జగన్ అయితే ఇంతటి కరోనా వేళ కూడా బాగానే కాచుకున్నారు. రానున్న కాలంలో ఎలా సంక్షేమ రధాన్ని ముందుకు తీసుకెళ్తారు అన్నది  ఇప్పటికి అయితే మిలియన్ డాలర్ల ప్రశ్నగానే చూడాలి.
Tags:    

Similar News