గుడివాడ అమర్ రాజకీయం ఏ మలుపులో ?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మీడియా ముందు గట్టిగా మాట్లాడుతారు. సెటైర్లు పంచులు వేస్తారు.

Update: 2026-06-22 05:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మీడియా ముందు గట్టిగా మాట్లాడుతారు. సెటైర్లు పంచులు వేస్తారు. ఆయన అన్న దానికి ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు వస్తాయి. ఇలా అటూ ఇటూ విమర్శలు ప్రతి విమర్శలతోనే గుడివాడ పాలిటిక్స్ సాగుతోంది అని అంటున్నారు. దీని వల్ల మీడియాలో హైప్ తప్ప నిజానికి ఆయన రాజకీయానికి జరిగే మేలు ఏమైనా ఉందా అన్న చర్చ అయితే జరుగుతోంది. నిజానికి గుడివాడ యువకుడు. ఎంతో ఫ్యూచర్ ఉన్న నేత అని అంతా అంటారు. ఆయన కార్పోరేటర్ గా టీడీపీలో తన పొలిటికల్ కెరీర్ కి ఎంట్రీ ఇచ్చారు. వైసీపీలో ఏకంగా ఎంపీగానే 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటమి వరించినా ఆయననే వైసీపీ జిల్లా ఇంచార్జిగా జగన్ నియమించారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా టికెట్ సాధించి గెలిచారు. 2024లో గాజువాక వెళ్ళి ఓటమి చూశారు. ఇలా మూడు ఎన్నికలు మూడు అనుభవాలు ఆయనకు మిగిల్చాయి.

కీలక శాఖలు అప్పగించినా :

జగన్ సీఎం గా ఉండగా ఆరు కీలక శాఖలను గుడివాడకు అప్పగించారు. అందులో ఐటీ పరిశ్రమలు వంటి శాఖలు ఉన్నాయి. గుడివాడ మంత్రిగా రెండేళ్ల కాలం ఉన్నారు. ఆయన ఒక సందర్భంలో చేసిన కోడి గుడ్డు కామెంట్స్ తో గుడ్డి మంత్రిగా టీడీపీ వారు ట్రోల్ చేసే పరిస్థితి తెచ్చుకున్నారు అని అంటున్నారు. రాజకీయ విమర్శల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అన్న విమర్శలు కూడా ఆయన మీద ఉన్నాయి. ఒక ఓటమి పాలు అయినా జగన్ ఆయనను గోదావరి జిల్లాలకు రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించారు. చోడవరం వైసీపీ ఇంచార్జిని చేశారు.

పట్టు సాధించేది ఉందా :

ఇదిలా ఉంటే తనకు ఇచ్చిన సీటులో గుడివాడ ఏ మేరకు పట్టు సాధించారు అన్నదే పార్టీలో చర్చ సాగుతోంది. ఆయన ఎక్కువగా ఉండేది విశాఖ అని అంటున్నారు. నిజానికి చోడవరంలో వైసీపీ బలంగానే ఉంది. అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే రాజు పట్ల వ్యతిరేకత ఉంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన విషయంలో ఎందుకో ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దాంతో వైసీపీని అక్కడ గట్టిగా నిలబెట్టి పరుగులు తీయిస్తే గుడివాడకు 2029 లో గెలిచేందుకు మంచి స్కోప్ ఉంటుందని కూడా అంటున్నారు. అయితే ఆయన మాత్రం విశాఖలోనే ఉంటూ విశాఖ వైసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెడుతూ ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నారు అని అంటున్నారు. ఎన్నికల ముందు వెళ్ళి ప్రచారం చేస్తే ఓట్లే సీన్ ఇపుడు లేదని తెలిసి కూడా గుడివాడ తనకు అప్పగించిన సీటు విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదని అంటున్నారు. అదే సమయంలో ఆవేశంతో ఆయన చేసే వ్యాఖ్యల వల్ల కూడా ఇబ్బందులో పడుతున్నారని అంటున్నారు. నాలుగు పదుల వయసులో ఉన్న ఈ యువ నేతకు ఎంతో భవిష్యత్తు ఉందని అయితే ఆయన దూకుడు రాజకీయం తగ్గించుకుంటేనే అని కూడా సూచిస్తున్న వారు ఉన్నారు.

Tags:    

Similar News