జగన్ ఢిల్లీ టూర్ లో అది మిస్ ...?

Update: 2022-01-04 13:32 GMT
జగన్ కొత్త సంవత్సరం వస్తూనే ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన బిజీ బిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు  కీలక మంత్రులను కూడా కలిసారు. ఏపీలోని  అనేక సమస్యల మీద వినతిపత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి ఆఫీస్ తెలియచేసిన ప్రకారం చూస్తే జగన్ ఈసారి చాలా మంది కేంద్ర మంత్రులతో భేటీలు వేశారు. అయితే ఈసారి జగన్ టూర్ లో మిస్ అయినది ఒకటి ఉంది అంటున్నారు.

అదేంటి అంటే కేంద్ర హోం మంత్రి అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి కూడా పెద్ద తలకాయగా వ్యవహరిస్తున్న అమిత్ షా తో జగన్ భేటీ లేకపోవడమే అంటున్నారు. జగన్ ఎపుడు ఢిల్లీ వెళ్లినా తప్పనిసరిగా అమిత్ షాను కలసి వస్తున్నారు. ఆయనతో గంటకు పైగా సమావేశం అవుతారు కూడా. ప్రధానికి కలవకపోయినా అమిత్ షా టూర్ తోనే జగన్ ఢిల్లీ పర్యటన ఎపుడూ ముగుస్తూ వస్తోంది.

ఈసారి జగన్ ఢిల్లీ టూర్ లో కూడా అమిత్ షా తో భేటీ ఉంటుంది అని ప్రచారం అయితే సాగింది. షెడ్యూల్ లో మరి ఉందో లేదో తెలియదు కానీ మోదీ తరువాత అమిత్ షాను జగన్ కలుస్తారు అని మీడియాలో అయితే తెగ న్యూస్ ప్రచారం జరిగింది. కానీ జగన్ మోడీని కలసిన తరువాత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఆ తరువాత్ నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి వారితో ఆయన సమావేశాలు జరిపారు.

ఇంతమందిని కలసినా అమిత్ షాతో మాత్రం భేటీ లేకపోవడం మీదనే ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అమిత్ షా ఆ మధ్య తిరుపతి వచ్చి ఏపీలోని బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి రాజధానికి మద్దతు ఇవ్వాలని కూడా సూచించారు. ఏపీలో వైసీపీని టార్గెట్ చేయాలని కూడా కోరినట్లుగా వార్తలు వచ్చాయి. నాటి నుంచే ఏపీ బీజేపీ దూకుడు పెంచింది.

ఒక విధంగా ఏపీలో వైసీపీ బీజేపీల మధ్య రాజకీయ వేడి బాగానే రాజుకుంటోంది. ఈ కీలక సమయంలో జగన్ ఢిల్లీ టూర్ ద్వారా అమిత్ షాను కలసి వస్తారని అంతా అనుకున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా ఏపీ బీజేపీ దూకుడుకు కళ్ళెం వేస్తారని కూడా చర్చ సాగింది. కానీ ఏ కారణం చేతనో జగన్ అమిత్ షాను కలవకుండానే వెనుతిరిగారు. దీంతో జగన్ ఢిల్లీ టూర్ పూర్తిగా అధికారికంగానే సాగింది అని అంటున్నారు.

రాజకీయంగా వ్యూహాలకు తావు లేకుండా సాఫీగానే సాగిపోయింది అని కూడా చెబుతున్నారు. ఇక కేంద్రనికి ముఖ్యమంత్రి హోదాలో విన్నపాలు చేయడం మామూలు విషయమే. దాని మీద కేంద్ర స్పందన ఎలా ఉంటుంది అంటే జవాబు చెప్పడం సులువే. ఇప్పటికి రెండున్నరేళ్ళుగా జగన్ కనీసం ఆరేడు సార్లు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. వెళ్ళిన ప్రతీసారి ఏపీ కి సాయం చేయాలని కోరుతూ వచ్చారు. కానీ కేంద్రం మాత్రం తాను అనుకున్నదే చేస్తోంది.

ఈసారి జగన్ ఢిల్లీ టూర్ వల్ల కూడా పెద్దగా ఏపీకి ప్రయోజనం ఒనగూడుతుందా అంటే ఎవరూ చెప్పలేని స్థితి. ప్రత్యేక హోదా అన్నది కేంద్రానికి ముగిసిన అధ్యాయం. ఇక పోలవరం విషయంలో ఇరిగేషన్ కాంపోనెంట్ ఖర్చునే భరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దానికి మించి పైసా ఇవ్వమని చెబుతోంది. విభజన తరువాత రెవిన్యూ లోటుని పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పినా కూడా ఏడేళ్ల కాలంలో ఇచ్చినది నాలుగు వేల కోట్లే. ఇంకా పద్దెనిమిది వేల కోట్ల బకాయి ఉంది. అది ఇప్పటికిపుడు ఇచ్చేస్తారు అన్నది ఎవరూ అనుకోలేరు కూడా. ఒకవేళ ఇచ్చినా వేయి రెండు వేల కోట్ల వంతున మరో పదేళ్లకు కానీ అది పూర్తిగా ఇవ్వగలరేమో.

తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన ఆరు వేల కోట్ల విద్యుత్ బకాయిల విషయంలో కూడా కేంద్రం జోక్యం చేసుకోదు, ఎందుకంటే బీజేపీకి తెలంగాణాలో రాజకీయ ఆశలు ఉన్నాయి. మీరూ మీరూ ఆ వివాదాన్ని పరిష్కరించుకోండి అంటోంది కేంద్రం. సో అది కూడా అయ్యేట్లు లేదు. మరి అప్పులు తెచ్చుకోవడానికి పరిమితిని పెంచమని జగన్ కోరారు. ఏపీలో రాజకీయంగా బలపడాలని చూస్తున్న బీజేపీ జగన్ కి ఆ వెసులుబాటు కల్పిస్తుంది అని ఎవరూ అనుకోరు. మొత్తానికి జగన్ రెండు రోజుల ఢిల్లీ టూర్ లో ఆర్ధిక అంశాలు ఏవీ పెద్దగా పరిష్కారం అయ్యేవి కావు అనే అంటున్నారు. పరిపాలనకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే అవి కదిలే వీలు అవుతుంది. ఏది ఏమైనా కేంద్రంలో కీలకంగా ఉంటూ చక్రం తిప్పుతున్న అమిత్ షాను కలవకుండా జగన్ వెనుతిరగడం చూస్తే ఏపీలో రాజకీయంగా వైసీపీ మీద బీజేపీ గురి పెట్టినట్లే అనుకోవాలని అంటున్నారు.
Tags:    

Similar News