ఆంధ్రజ్యోతిలో జగన్ యాడ్..అదెలా సాధ్యమైంది?

Update: 2020-07-02 07:50 GMT
ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్ని ఆపేసే సిత్రమైన ఆలోచన కొత్తదేం కాదు. కాకుంటే.. ఇప్పుడున్న రీతిలో మాత్రం ఎప్పుడూ లేదనే చెప్పాలి. వైఎస్ హయాంలో ఆ రెండు పత్రికలంటూ ఈనాడు.. ఆంధ్రజ్యోతిల మీద విరుచుకుపడటం తెలిసిందే. ఈనాడుకు ప్రకటనలు ఆపకున్నా.. ఆంధ్రజ్యోతి విషయంలో కాస్తంత కరకుగానే వ్యవహరించారు. కానీ.. కోర్టుకు వెళ్లి మరీ ప్రకటనలకు అనుమతులు తెచ్చుకున్న ఆంధ్రజ్యోతికి వైఎస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వక తప్పలేదు.

తర్వాతి రోజుల్లో ముఖ్యమంత్రులు అయిన రోశయ్య.. కిరణ్ కుమార్ రెడ్డిలతో ఎలాంటి సమస్యలు ఉండేవి కావు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు పెద్ద ఎత్తున రాసినా నమస్తే తెలంగాణకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చేవారు. ప్రకటనలు ఆపితే.. తెలంగాణ పత్రిక అన్న కారణంగా దెబ్బ తీయాలన్న ప్రచారం జరిగే ప్రమాదం ఉండటంతో ఆ మచ్చ పడకుండా ఉండేందుకు ప్రకటనలు ఇచ్చేవారు.

విభజన తర్వాత ఏపీలో టీడీపీ సర్కారు కొలువు తీరితే.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తనకు వ్యతిరేకంగా వ్యవహరించే మీడియా సంస్థలపై కేసీఆర్ తన మార్కు చూపించటం తెలిసిందే. ప్రకటనలు మాత్రమే కాదు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. టీవీ9 చానళ్ల ప్రసారాల్ని నిలిపివేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున రచ్చ జరిగినప్పటికి కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. తర్వాతి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో వివాదం సమిసిపోయింది.

ఇదిలా ఉంటే.. ఏపీలోని టీడీపీ ప్రభుత్వం తనకు దగ్గరైన మీడియా సంస్థలకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తూనే.. తనపై కత్తి కట్టినట్లుగా రాసే సాక్షి పత్రికకు అడపాదడపా ప్రకటనలు ఇచ్చేవారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే చిన్నపత్రికల విషయంలో కరకుదనం ప్రదర్శించలేదనే చెప్పాలి. ఈ మధ్య జరిగిన ఎన్నికల తర్వాత మాత్రం పరిస్థితుల్లో మార్పు తెచ్చింది. ఏపీలో జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రకటనల్ని ఇవ్వటం లేదు. వైఎస్ హయాంలో న్యాయపోరాటానికి దిగిన జ్యోతి ఆర్కే.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉండిపోయారు. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తున్నవెలుగు.. వీ6 చానళ్లకు ప్రకటనలు ఆగిపోయాయి. ఇలాంటివేళలో.. తాజాగా ఆంధ్రజ్యోతిలో జగన్ మీద ఒక ఫుల్ పేజీ ప్రకటన రావటం ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీలో జగన్ ఫోటో తో ఒక ప్రకటన వచ్చింది. ఏపీ నాట్కో కేన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా.. ఆ కార్యక్రమానికి హాజరవుతున్న సీఎం జగన్ కు స్వాగతం చెబుతూ విడుదల చేసిన ప్రకటన. జ్యోతి మొదటి పేజీ లో జగన్ ఫోటో తో భారీ యాడా? అన్న ఆశ్చర్యం కల్పించినా.. ఆ ప్రకటనను నిశితంగా చూస్తే.. అది ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన కాదు. నాట్కో సంస్థ ఇచ్చింది. ఇంతకీ.. నాట్కో అంటే తెలుసా? మన పొన్నూరు నన్నపనేని చౌదరి గారిది. జగన్ చేత ప్రారంభయ్యే కేన్సర్ సెంటర్ కు స్వాగతం పలుకుతూ ఆంధ్రజ్యోతి లో ఫుల్ పేజీ యాడ్ ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఇంతకూ జ్యోతికి ఆ యాడ్ ఎలా వచ్చిందో అర్థమైందిగా?
Tags:    

Similar News