వ‌ర్క్ ఫ్ర‌మ్ ఆఫీస్‌.. ఉద్యోగుల‌కు కాల్ లెట‌ర్స్‌!

Update: 2021-07-25 10:40 GMT
కరోనా వైర‌స్ ప్ర‌పంచంలోని ప్ర‌తీ మ‌నిషి మీద ఎఫెక్ట్ చూపించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇంత‌లా ప్ర‌భావం చూపిన మ‌హ‌మ్మారి బ‌హుశా ఏదీ లేక‌పోవ‌చ్చు. ఈ వైర‌స్ దెబ్బ‌కు.. దేశాల‌న్నీ ఎంత‌లా అత‌లాకుత‌లం అయిపోయాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచం క‌ల‌లో కూడా ఊహించ‌ని మార్పులు తెచ్చిందీ మ‌హ‌మ్మారి. అస‌లు.. ఇంటి నుంచి ఆఫీసు ప‌ని చేస్తామ‌ని ఉద్యోగులు ఎప్పుడూ అనుకుని ఉండ‌రు. కొవిడ్ ధాటికి మ‌నుషులు, సంస్థ‌ల‌ ఆర్థిక వ్యవహారాలు మొత్తం త‌ల‌కిందులు కావ‌డంతో.. ప్రజల దైనందిన జీవితం మొత్తం మారిపోయింది. లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాల ద్వారా ప్రపంచం మొత్తం నాలుగు గోడలకే పరిమితం కావాల్సి వ‌చ్చింది. దీంతో.. అనివార్యంగా చోటు చేసుకున్న‌ పెను మార్పుల్లో ఒక‌టి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్.

జ‌నాలు రోడ్లెక్కే అవ‌కాశం లేక‌పోవ‌డం.. ఆఫీసుల‌కు వ‌చ్చి క‌లిసి ప‌నిచేసే ఛాన్స్ అంత‌క‌న్నా లేక‌పోవ‌డంతో.. ఆయా సంస్థ‌లు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కేటాయించాయి. దీంతో.. అంద‌రూ ఇంటి నుంచే ప‌నులు చేస్తున్నారు. కంపెనీల‌న్నీ త‌మ ఉద్యోగులేను ఇంటి నుంచే ప‌నిచేయ‌మన్నాయి. ఇప్ప‌టికీ.. చాలా కంపెనీల్లో ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. అయితే.. థ‌ర్డ్ వేవ్ అంటున్నందువ‌ల్ల చాలా కంపెనీలు.. వేచి చూస్తున్నాయి. మ‌ళ్లీ ఆఫీసుల‌కు పిల‌వ‌డం.. తేడా వ‌స్తే మ‌ళ్లీ ఇళ్ల‌కు పంప‌డం వంటి వాటితో.. డిస్ట్ర‌బెన్స్ వ‌స్తుంద‌ని వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కంటిన్యూ చేస్తున్నాయి.

కానీ.. కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగుల‌ను ఆఫీసుల‌కు పిలుస్తున్నాయి. థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు వినిపిస్తున్న‌ప్ప‌టికీ.. వాటిని లైట్ తీసుకుంటూ ఆఫీసుకు వ‌చ్చి ప‌నిచేయాల‌ని ఉద్యోగుల‌కు సూచిస్తుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి సెకండ్ వేవే ఇంకా పూర్తిగా త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ.. రోజుకు 40 వేలకు అటూ ఇటుగా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇలాంటి ప‌రిస్తితుల్లో ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌రులో థ‌ర్డ్ వేవ్ అంటున్నారు. స్ప‌ష్ట‌త ఎవ‌రికీ లేక‌పోయిన‌ప్ప‌టికీ.. థ‌ర్డ్ వేవ్ అనేది ఉంటుంద‌నే విష‌యంలో మాత్రం చాలా వ‌ర‌కు ఏకాభిప్రాయం ఉంది. మ‌రి, ఇలాంటి ప‌రిస్థితుల్లో వ‌ర్క్ ఫ్రమ్ కు టాటా చెప్పేసి.. వ‌ర్క్ ఫ్ర‌మ్ ఆఫీస్ అంటూ సంస్థ‌లు నిర్ణ‌యిస్తుండ‌డం ప‌ట్ల ఒకింత ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌ముఖ ఐటీ కంపెనీలు ఈ విష‌యంలో ముందంజ‌లో ఉన్నాయి. అతి త్వ‌ర‌లో ఆఫీసుల‌కు వ‌చ్చేయాల‌ని ఉద్యోగుల‌కు సూచిస్తున్నాయి. తాజాగా.. ఇన్ఫోసిస్ ఉద్యోగుల‌కు ఒక లేఖ పంపింది. త్వ‌ర‌లో ఆఫీసుల‌కు రావాల్సి ఉంటుంద‌ని అందులో పేర్కొంది. ఇన్ఫోసిస్ మాత్ర‌మే కాకుండా.. ఇత‌ర కంపెనీలు కూడా ఇదే ఆలోచ‌న చేస్తున్నాయి. అయితే.. ఈ కంపెనీలు ఇలాంటి ఆలోచ‌న చేయ‌డం వెనుక కార‌ణం వ్యాక్సిన్ అని తెలుస్తోంది.

క‌రోనా నియంత్ర‌ణ‌కు వ్యాక్సిన్ కంప‌ల్స‌రీ అని ప్ర‌పంచం గుర్తించిన సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న‌వారు కూడా క‌రోనా బారిన ప‌డిన‌ప్ప‌టికీ.. ప్రాణాపాయం ఉండ‌ద‌ని చెబుతున్న సంగ‌తి కూడా తెలిసిందే. అందువ‌ల్ల‌.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే ఇక‌, పెద్ద‌గా స‌మ‌స్య ఉండ‌ద‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఒక‌వేళ కొవిడ్ వ‌చ్చినా.. ఒక జ్వ‌రం మాదిరిగా ఉంటుంద‌ని, దానివ‌ల్ల పెద్ద‌గా ఎఫెక్ట్ ఉండ‌ద‌ని కూడా యోచిస్తున్న‌ట్టు టాక్‌. అందుకే.. త‌మ కంపెనీల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు రెండు డోసుల వ్యాక్సిన్ వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. రెండు డోసులు తీసుకున్నారా? అని అని ఆరాకూడా తీస్తున్నాయ‌ట‌. అయితే.. కొన్ని సంస్థ‌లు మాత్రం వేచి చూసే ధోర‌ణిని అవ‌లంభిస్తున్నాయి. ఇదిలాఉంటే.. ఈ థ‌ర్డ్ వేవ్ గోల ఏంట‌నేది తేల‌డానికి ఆగ‌స్టు నుంచి అక్టోబ‌రు వ‌ర‌కు టైం ప‌ట్టొచ్చ‌ని అంటున్నారు. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.


Tags:    

Similar News