ఎయిర్ పోర్ట్ లో కేంద్ర‌మంత్రిని నిల‌దీసింది

Update: 2017-11-23 04:50 GMT
కేంద్ర‌మంత్రికి అనుకోని అనుభ‌వం ఎదురైంది. రాష్ట్రప‌తికి స్వాగ‌తం ప‌లికేందుకు ఎయిర్ పోర్ట్ వెళ్లిన ఆయ‌న్ను ఒక మ‌హిళ క‌డిగిపారేసింది. సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఉదంతంలోకి వెళితే..

మ‌ణిపూర్ రాజ‌ధాని ఇంఫాల్  విమానాశ్ర‌యానికి కేంద్ర ప‌ర్యాట‌క శాఖామంత్రి ఆల్ఫోన్స్ వ‌చ్చారు. ఆయ‌న్ను చూసినంత‌నే ఒక ప్ర‌యాణికురాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. వీవీఐపీ వ‌స్తున్నారంటూ ఆమె విమానాన్ని రెండు గంట‌ల పాటు నిలిపివేయ‌టంతో ఆమె ఫైర్ అయ్యారు. ఇంఫాల్‌ కు చెందిన ఒక మ‌హిళా డాక్ట‌ర్ బీహార్ రాజ‌ధాని పాట్నాలో చ‌నిపోయారు. అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రు కావటానికి ఆమె ఎయిర్ పోర్ట్‌ కు వెళ్లారు. అయితే.. ఆమె వెళ్లాల్సిన విమానం  రెండు గంట‌లు ఆల‌స్య‌మైంది. రాష్ట్రప‌తి విమానం ల్యాండ్ అయ్యే టైం కావ‌టంతో మూడు విమానాల్ని ప్ర‌యాణించ‌కుండా నిలిపివేశారు.

దీంతో అత్య‌వ‌స‌ర ప్ర‌యాణాల‌కు సిద్ధ‌మైన ప‌లువురు ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. రాష్ట్రప‌తి కోవింద్‌ కు స్వాగ‌తం ప‌లికేందుకు ఎయిర్ పోర్ట్‌ కు వ‌చ్చిన కేంద్ర‌మంత్రి ఆల్ఫోన్స్ ను చూసిన మ‌హిళా డాక్ట‌ర్ ఆగ్ర‌హంతో ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లారు.

తాను వైద్యురాలిన‌ని.. రాజ‌కీయ నేత‌ను కాన‌ని.. త‌న‌కు టైం చాలా విలువైన‌ద‌ని ఆమె పేర్కొన్నారు. మ‌ధ్యాహ్నం 2.45 గంట‌ల‌కే తాను పాట్నా వెళ్లాల్సి ఉంద‌ని.. ఇంటి ద‌గ్గ‌ర అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రుకావాల‌ని.. టైం గ‌డుస్తున్నా తాను మాత్రం వెళ్ల‌లేక‌పోతున్నాన‌ని ఆమె వాపోయారు.  ధ‌ర్మాగ్ర‌హంతో ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధిస్తున్న మ‌హిళా వైద్యురాలి మాట‌ల‌కు స‌మాధానం చెప్పేందుకు కేంద్ర‌మంత్రి తెగ ఇబ్బంది ప‌డ్డారు. ఈ ఉదంతంపై విమానాశ్ర‌య డైరెక్ట‌ర్ రియాక్ట్ అయ్యారు. రాష్ట్రప‌తి ప‌ర్య‌ట‌న కార‌ణంగా ఎయిర్ పోర్ట్ లో వీవీఐపీ మూమెంట్‌ ను పెట్టిన‌ట్లుగా ఆయ‌న చెప్పారు. ఈ కార‌ణంతోనే విమానాల్ని నిలిపివేసిన‌ట్లుగా ఆయ‌న పేర్కొన్నారు.

Full View

Tags:    

Similar News