ఇది చదివాక కూడా ఏపీ పోలీసుల శీలాన్ని శంకించే సాహసం చేయగలరా?

Update: 2021-04-19 17:30 GMT
ఉత్తి పుణ్యానికి పోలీసులు తరచూ టార్గెట్ అయిపోతుంటారు. రాజకీయ నేతలు మొదలు.. మీడియా.. సోషల్ మీడియా.. ప్రజలు పోలీసుల మీద ఇట్టే విమర్శల చేస్తుంటారు. ఎవరు అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వానికి తగ్గట్లుగా పని చేయాల్సిన అవసరం అంతో ఇంతో ఉంటుంది. అంతమాత్రానికే అదే పనిగా నిందలు వేయటం సరికాదు. అదేమిటో కానీ.. ఇటీవల కాలంలో ఏపీ పోలీసులు అదే పనిగా విమర్శలకు గురవుతుంటారు. ఏపీ విపక్ష నేత చంద్రబాబు.. ఆయన కుమారుడు నారా లోకేశ్ .. ఇతర టీడీపీ నేతలు తరచూ పోలీసుల తీరును తప్పు పడుతుంటారు.

అప్పుడప్పుడు బ్యాలెన్స్ మిస్ అయ్యే చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకేసి.. తాను అన్ని రికార్డు చేసుకుంటున్నానని.. మళ్లీ తాను పవర్ లోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా లెక్క చూస్తానని బెదిరిస్తాడు. దీంతో.. అప్పటికే డ్యూటీ ఒత్తిడిలో ఉన్న పోలీసులకు మరింత మండిపోయేలా ఆయన మాటలు ఉంటాయి. ఏపీ పోలీసులు అధికారపక్షానికి కొమ్ము కాస్తారన్న ఆరోపణను తరచూ వినిపిస్తూ ఉంటారు. కానీ.. అందులో ఏ మాత్రం నిజం లేదన్న విషయాన్ని పోలీసులు తమ చేతలతో చూపిస్తుంటారు.

తాజాగా అలాంటి ఉదంతమే కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఆళ్లగడ్డలోని వైసీపీ నేత సింగం భరత్ రెడ్డికి చెందిన పేకాట స్థావరం మీద స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ టీం దాడులు చేపట్టింది. అధికారపక్ష నేతకు చెందిన డెన్ కావటంతో.. తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో ఉన్నారేమో కానీ.. ఏకంగా 30 మంది దొరికిపోయారు. వారి నుంచి రూ.6.23లక్షల నగదును.. మూడు కార్లు.. మూడు టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాదు.. నగదుకు బదులుగా వాడే క్యాష్ కాయిన్స్ (రూ.2లక్షల విలువ చేసేవి) కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాటలో పట్టుబడిన వారిలో కర్నూలు జిల్లాకు చెందిన వారే కాదు.. కడప జిల్లాకు చెరందిన వారు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీలో ఎక్కడైనా సరే.. కడప వారి హవా నడుస్తుందని చెబుతారు. అదే నిజమైతే.. ఈ దాడులే జరిగేవి కాదు కదా? అన్న ప్రశ్నను వైసీపీ నేతలు సంధిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసుల్ని పోలీసుల్లా కాకుండా ప్రభుత్వానికి వీరవిధేయులన్న ముద్రలు వేయకుండా ఉంటే మంచిది. ఇప్పటికైనా ఏపీ పోలీసుల శీలాన్ని శంకించటం మానేస్తారా?




Tags:    

Similar News