ఆ రాష్ట్రాల్లో ఫలితాలు మరో వారానికి కానీ రావా?

Update: 2020-11-06 03:00 GMT
టీ 20 మ్యాచ్.. టెస్టు మ్యాచ్ గా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు అలానే ఉన్నాయి. టీ20 మ్యాచ్ లో టై పడి.. సూపర్ ఓవర్లో తుది ఫలితం తేలే పరిస్థితి ఉండి.. ఆ సూపర్ ఓవర్ మరో వారం రోజులైతే పరిస్థితే ఎలా ఉంటుంది. ఊహించటానికే కష్టంగా ఉన్న ఈ పరిస్థితి ఇప్పడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెలకొంది. ఐదు రాష్ట్రాలు మినహా.. మిగిలిన రాష్ట్రాల్లో ఫలితం రోజులో రాగా.. మిగిలిన రాష్ట్రాల్లో ఎప్పుడు వస్తుందంటే.. అధికారుల అంచనా ప్రకారం మరో వారం రోజుల వరకూ అని చెబుతున్నారు.

అమెరికా ఎన్నికల విధానం.. మన విధానానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. పోలింగ్ జరిగిన మూడో తేదీన వేసిన పోస్టల్ ఓట్లు.. ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరటానికి తుది గడువు నవంబరు 10 వరకు  ఉన్నట్లు నెవడాలోని క్లార్క్ కౌంటీ అధికారులు చెబుతున్నారు. మనకు తెలిసిన మన ఎన్నికల విధానంలో పోస్టల్ ఓట్లు ముందే వేసేస్తారు. పోలింగ్ నిర్వహించిన తర్వాత.. పోస్టల్ ఓట్లను.. పోలింగ్ రోజున పోలైన ఓట్లను ఒకచోటుకు చేరుస్తారు. నాలుగైదు రోజులు.. లేదంటే వారం రోజుల పాటు స్ట్రాంగ్ రూంలో ఉంచేస్తారు.

ఒక శుభదినాన వాటిని ఓపెన్ చేసి.. లెక్కింపు కార్యక్రమాన్ని మొదలుపెడతారు. అమెరికాలో మాత్రం అందుకు భిన్నం. పోస్టల్ ఓట్లు వేయటానికి తుది గడువు.. అవి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరటానికి తుది గడువు.. ఓట్ల లెక్కింపు మొదలైన వారం తర్వాత కూడా చేరేందుకు అనుమతి ఉండటం.. చివరి ఓటును కూడా లెక్కించాకే  ఫలితాన్ని వెల్లడించాలన్న నియమంతో.. ఎన్నికల తుది ఫలితం తేలటం కష్టసాధ్యంగా.. రోజుల తరబడి సాగుతూ ఉంది.
ప్రస్తుతం ఫలితాలు వెల్లడి కాని స్వింగ్ రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాల్లో ఫలితాల వెల్లడి మరో వారం పడుతుందని చెబుతున్నారు. ట్రంప్ అధిక్యత ఉన్న పెన్సిల్వేనియాలో ఫలితం శనివారానికి వస్తుందని చెబుతున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇది కాస్త బెటర్ అని చెప్పొచ్చు.

ఉదాహరణకు నార్త్ కరోలినా రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ వరకు పోస్టల్.. అబ్సెంటీ ఓట్లను అనుమతిస్తున్నారు. అంటే.. నవంబరు 12 వరకు పోలైన ఓట్లు వస్తూ ఉండొచ్చు. తుది గడువు ముగిసిన తర్వాత.. ఇంకా రావాల్సిన ఓట్లకు గడువు ముగిసిన తర్వాత ఓట్లు లెక్కింపు ప్రక్రియ పూర్తి అయినట్లు నవంబరు 13న ప్రకటిస్తారు. అంటే.. నార్త్ కరోలినాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అధికారికంగానే మరో వారం రోజులు ఉన్నదన్న మాట.

ఇలా పలు రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల నిబంధన.. తుది ఫలితాన్ని ప్రకటించటానికి ఆలస్యం అయ్యేలా చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈసారి ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనంత భారీగా అమెరికన్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈసారి 16 కోట్ల మంది అమెరికన్లు ఓట్లు వేశారు. పోస్టల్ - ఈ మొయిల్ ఓట్ వేసేందుకు అనుమతి ముందస్తుగా ఇచ్చేయటంతో.. భారీగా పోలింగ్ సాధ్యమైందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News