జూమ్ కాల్ లో పెద్ద మనిషికి షాకిచ్చిన భార్య సరసం

Update: 2021-02-20 23:30 GMT
కరోనా పుణ్యమా అని జీవనవిధానం పూర్తిగా మారిపోయింది. ముఖానికి మాస్కులు.. చేతికి శానిటైజర్లు.. భౌతిక దూరం.. ఆన్ లైన్ క్లాసులు.. చర్చలు.. సమావేశాలు.. ఇలా అన్నింటిలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. అనుకోనిరీతిలో చోటు చేసుకునే పరిణామాలు షాకింగ్ గా మారటమే కాదు.. ఫన్నీగా ఉంటున్నాయి. తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకొని.. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

జూమ్ కాల్ లో సీరియస్ గా ఒక ఎనలిస్టు విశ్లేషణ చేస్తున్న వేళ.. ఆయన వెనుక నుంచి వచ్చిన మహిళ ఒకరు రొమాంటిక్ గా ముందుకు వచ్చి ముద్దు ఇవ్వబోతే.. అందుకు ఆయన ఒక్కసారి షాక్ తిని సీరియస్ అయ్యారు. అయినప్పటికీ.. సదరుమహిళ మాత్రం చిన్నబుచ్చుకోకుండా చూసిన చూపు.. నవ్విన నవ్వు అందరిని ఆకర్షిస్తోంది. ఆఫీసు ఒత్తిడి.. టార్గెట్ కత్తుల మధ్య జాబ్ చేసే వారికి.. వైరల్ గా మారిన ఈ చిట్టి వీడియోతో సాంత్వన చెందటం ఖాయం.

ఇంతకూ జరిగిందేమంటే.. దేశ ఆర్థిక పరిస్థితి మీద ఒక ఎనలిస్టు చాలా సీరియస్ గా తన అభిప్రాయాన్ని జూమ్ కాల్ లో షేర్ చేసుకుంటున్నారు. అంతలో సడన్ గా ఒక మహిళ వెనుక నుంచి వచ్చి.. ముద్దు ఇవ్వబోయింది. దీంతో.. షాక్ తిన్న సదరు పెద్ద మనిషి.. వాట్ నాన్ సెన్స్.. కెమెరా ఆన్ లో ఉందని చిర్రుబుర్రులాడారు. ఆయన గారి మాటల్ని సరదాగా తీసుకుంటూనే..ఆ మహిళ నవ్వుతూ స్పందించిన తీరును పలువురు మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో.. సదరు వ్యక్తి సీరియస్ నెస్ ను తిట్టిపోస్తున్నారు.

పిల్లల ముందు ఇలాంటి వీడియోలతో పరువు పోదా? అని కొందరు కస్సుమంటే.. మరికొందరు మాత్రం ప్రేమ కలిగిన తల్లిదండ్రుల్ని చూసి పిల్లలు సంతోషిస్తారని కామెంట్లు చేస్తున్నారు. అనుకుంటాం కానీ.. ఇలాంటివి జీవితంలోలేకపోతే ఏం బాగుంటుంది. ఏమైనా.. ఈ చిట్టి వీడియోను చూసిన వారు.. ఎవరికి వారు వారికి నచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట ఈ ఫన్నీ రొమాన్సు ఇప్పుడు వైరల్ గా మారింది.



Tags:    

Similar News