వైసీపీ కొత్త సర్వే ఎందుకు?

Update: 2022-12-10 01:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గట్టిగా కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే ఈ దిశగా కార్యాచరణ కూడా మొదలుపెట్టేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గ ఇన్‌చార్జులను గడప గడపకు పంపుతున్నారు. వీరంతా ప్రతి ఇంటికీ వెళ్లి ఈ మూడున్నరేళ్ల జగన్‌ పాలనలో తాము చేసిన లబ్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. మరోమారు తమకు ఓట్లేయాలని విన్నవిస్తున్నారు.

మరోవైపు సీఎం జగన్‌ సైతం ఏదో ఒక జిల్లాలో కార్యక్రమాలు ఉండేలా చూసుకుంటున్నారు. వివిధ పథకాల నిధులను బహిరంగ సభ పెట్టి సంబంధిత పథకం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ బిడ్డ మీ బిడ్డని.. మీకు మరింత మంచి చేయాలంటే ఈ బిడ్డను ఆశీర్వదించాలని సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

అయితే సంక్షేమ పథకాలు అందుకోవడానికి ప్రజలకు అనేక నిబంధనలు ఉన్నాయి. అందరికీ ఈ పథకాలు అందడం లేదు. వివిధ నిబంధనల సాకుతో ఈ పథకాల లబ్ధి ప్రజలకు చేరడం లేదు.

మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యేలకు కొన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి గట్టిగానే సెగ తగులుతోంది. తమకు వివిధ పథకాలు అందలేదని, తాగునీరు సమస్య ఉందని, రోడ్లు బాలేదని, డ్రైనీజీ సమస్య పరిష్కరించండని ఇలా వివిధ అంశాలపై ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం సంతృప్త (శాచురేషన్‌) స్థాయిలో అందరికీ పథకాలు అందిస్తున్నామని చెప్పుకుంటోంది. దీనిపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉన్న పథకాలకే పేర్లు మార్చి కొత్తగా తమ ప్రభుత్వం మాత్రమే అందిస్తోందని చెప్పుకోవడం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను వాడుకుని.. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా జగనన్న పేరుతో కొత్తగా పేర్లు పెట్టుకోవడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా జగన్‌ ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఇప్పటికే ఈ సర్వే చాలా వరకు పూర్తయిందని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయం, వారు ఏమనుకుంటున్నారు తదితర అంశాలపై వలంటీర్లు ఆరా తీస్తున్నారు.

ఈ సర్వే మాత్రమే కాకుండా జగన్‌ మరో సొంత సర్వేను కూడా చేయిస్తున్నట్టు తెలుస్తోంది. పథకాలు ఇస్తున్నా ప్రజల్లో అనుకున్నంత స్థాయిలో ప్రభుత్వంపై సానుకూల దృక్పథం లేకపోవడంపై వైసీపీ ప్రభుత్వం ఒకింత ఆందోళనతో ఉన్నట్టు చెబుతున్నారు.
4

ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలన్నదానిపైనే వైసీపీ అధిష్టానం మేధోమథనం చేస్తున్నట్టు తెలుస్తోంది. లబ్ధిదారుల అసంతృప్తిపై ప్రత్యేకంగా మరో సర్వే చేయిస్తున్నారు. అసంతృప్తికి కారణాలు, అధిగమించడానికి చేయాల్సిన పనులపై కసరత్తు చేస్తున్నారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జనవరి చివరి నాటికి పూర్తవుతుందని చెబుతున్నారు. అందులో వచ్చే ఫైనల్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మరో విడత ఎమ్మెల్యేలంతా ఇంటింటికీ వెళ్లి మరోసారి ప్రజలను కలవడానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.

ఇలా ఎన్నికలకు మిగిలి ఉన్న ఏడాదిన్నర సమయమంతా ప్రజల్లోనే ఉండేలా వైసీపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే జయహో బీసీ సభను నిర్వహించిన వైసీపీ ఆ తర్వాత ఇదే కోవలో మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ జయహో సభలను కూడా నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఇలా అన్ని వైపులా పార్టీని ప్రజలకు చేరువ చేయడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News