బెంగాల్ కు ఏమైంది? 3 రోజుల్లో 250 కుక్కల మృత్యువాత

Update: 2021-02-21 07:09 GMT
గతంలో ఎప్పుడూ లేని రీతిలో పశ్చిమబెంగాల్ లో కుక్కలు పెద్ద ఎత్తున మరణిస్తున్నాయి.  వీటి మరణానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గడిచిన మూడు రోజుల వ్యవధిలో 250 కుక్కలు మరణించటం షాకింగ్ గా మారింది. దీనిపై స్పందించిన అధికారులు.. కుక్కల మరణాలకు కారణం ఏమిటన్న అంశంపై ఫోకస్ పెట్టారు. మరణించిన కుక్కల నమూనాల్ని పరీక్షల కోసం పంపారు.

అయితే.. ఈ పరిస్థితి బెంగాల్ రాష్ట్రం మొత్తం లేదు. బంకురా జిల్లా విష్ణుపూర్ పట్టణంలో మాత్రమే ఉంది. ఈ ఊళ్లోని వీధికుక్కలు మూడు రోజుల్లో 250 వరకు మరణించాయి. మంగళవారం 62.. బుధవారం 62.. శుక్రవారం రాత్రి వరకు దగ్గర దగ్గర వందకు పైగా కుక్కలు మృత్యువాత పడ్డాయి. శుక్రవారం మరణించిన కుక్కల్లో పెంపుడు కుక్కలు కూడా ఉండటం గమనార్హం.

ఇంత భారీగా కుక్కలు మరణించటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కుక్కల మరణాలకు వైరల్ ఇన్ఫెక్షన్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు. శాంపిల్స్ ను కోల్ కతాకు పంపగా.. పర్వో వైరస్సే కుక్కల మరణాలకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుక్కల్లోఈ వైరస్ ఒకదాని నుంచి మరొకదానికి తేలిగ్గా వ్యాపిస్తుందని.. అందుకే ఇంత భారీగా మరణాలు చోటు చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్య విష్ణుపూర్ కు మాత్రమే పరిమితమైందని అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News