బీఆర్ఎస్ లాంచ్ చేసిన కేసీఆర్.. కర్ణాటకలో తొలిపోటీ

Update: 2022-12-09 12:44 GMT
టీఆర్ఎస్ అధికారికంగా బీఆర్ఎస్ గా మారింది. కొత్త పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాల్లోకి దిగనున్నారు. ముఖ్య నేతలతో భవిష్యత్ కార్యాచరణ ఖరారుపైన చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ తక్షణం పోటీచేసే రాష్ట్రాల గురించి కేసీఆర్ ప్రస్తావించారు. ఏప్రిల్ లోనే ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించారు.

‘ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వెళుతుందని కేసీఆర్ ప్రకటించారు. ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అధికారికంగా పూర్తి చేసిన కేసీఆర్.. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ పాలసీని త్వరలో ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. పార్టీ నినాదం ఫిక్స్ చేశారు.

దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా నిలుస్తామని కేసీఆర్ వెల్లడించారు. దేశ రాజకీయాల్లో పరివర్తన కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు మాత్రమేనని.. రాజకీయ పార్టీలు కాదని స్పష్టం చేశారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థికవిధానం అవసరమని కేసీఆర్ పార్టీ నేతలతో అభిప్రాయపడ్డారు. త్వరలోనే పార్టీ కమిటీలు ఏర్పాటు చేసే అంశంపైనా చర్చించారు.

ఇక బీఆర్ఎస్ తొలి పోటీ కర్ణాటకలోనే కావడం విశేషం. ఈ మేరకు త్వరలో కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేస్తుందని కేసీఆర్ వెల్లడించారు. కర్ణాటకలోని పది జిల్లాల్లో పోటీ అంశం పైన క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

తన ప్రస్తానంలో అవహేళనలు సాధారణమయ్యాయని.. ఇప్పుడు బీఆర్ఎస్ పై చేస్తున్నారని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ శ్రేణులకు భరోసా కల్పించారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తెలంగాణ సాధించామని.. దేశ రాజకీయాల్లోనూ రాణిస్తామని కేసీఆర్ ధీమాగా చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News