కరోనా బాధితుల్లో వెంటిలేటర్ అవసరాన్ని ముందే గుర్తించవచ్చు ఇలా..!

Update: 2021-06-20 10:30 GMT
రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు దశల్లో పంజా విసిరింది. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు మరణ మృదంగం మోగించింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కు కొరత ఏర్పడింది. ఎంతోమంది ఆస్పత్రుల మెట్ల ముందు ప్రాణాలు కోల్పోయిన విపత్కర పరిస్థితులను చూశాం. అయితే కరోనా మహమ్మారి తీవ్రతను ముందే పసిగట్టడానికి ఓ సాఫ్ట్ వేర్ ను రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

బాధితుల్లో తీవ్రతను గుర్తించేందుకు కొవిడ్ సివియారిటీ స్కోర్(సీసీఎస్) పేరుతో ఓ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసినట్లు శనివారం తెలిపింది. దీని సాయంతో కరోనా తీవ్రత, ఆస్పత్రిలో చికిత్స, వెంటిలేటర్ అవసరం వంటి పరిస్థితులను ముందే గుర్తిస్తుందని పేర్కొంది. ఆస్పత్రుల్లో వైద్యం అవసరం లేని వారినీ గుర్తించవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ సాఫ్ట్ వేర్ సాయంతో అవసరం ఉన్న వారికే ఆస్పత్రుల్లో చికిత్స అందించనున్నారు. ఫలితంగా వెంటిలేటర్ అవసరమున్న అందరికీ పడకలు లభిస్తాయి. బాధితుల్లో లక్షణాలు, ఇతర వ్యాధులు, వ్యాధుల చరిత్ర వంటి వాటితో కరోనా తీవ్రతను తేలుస్తుందని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ స్పష్టం చేసింది. దీని సాయంతో పరిస్థితి విషమించే అవకాశం ఉండదని పేర్కొంది.

ఈ సీసీఎస్ సాఫ్ట్ వేర్ ను కోల్ కతాలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టుమెంట్ కలిసి అభివృద్ధి చేసినట్లు తెలిపింది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వెల్లడించింది. దేశంలో రెండో దశ ప్రభావం ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులుగా దేశంలో తక్కువ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ తీవ్రత మందగించింది. త్వరలో మూడో దశ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తుండడం గమనార్హం.





Tags:    

Similar News