దేశంలో ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ ..స్పష్టం చేసిన ప్రధాని మోడీ !

Update: 2020-10-29 14:10 GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే రెండో దశ వ్యాప్తి మొదలైంది. ఈ సమయంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ .. దేశంలోని ప్రతి పౌరుడికి కరోనా వ్యాక్సిన్ ను అందిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కసారి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే ప్రజలందరికీ అందిస్తామంటూ  కరోనా వ్యాప్తి తర్వాత  మొదటి ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. మొదటగా బలహీనమైన వారికి, ఫ్రంట్‌ లైన్ కార్మికులకు టీకా వేయడంపై దృష్టి పెట్టినప్పటికీ, దేశంలో ఏ ఒక్క పౌరుడిని విడిచిపెట్టకుండా కరోనా టీకా అందిస్తామని ప్రధాని స్పష్టం చేశారు.

ఇక , కరోనా వ్యాక్సిన్ తయారీ పురోగతిలో ఉందనీ, పలు వ్యాక్సిన్ల పై  ట్రయల్స్ కొనసాగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థను సిద్ధం చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసామన్నారు. వ్యాక్సిన్ మోతాదు తదితర మార్గదర్శకాలను ఈ నిపుణుల బృందం నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. టీకా ప్రతి వ్యక్తికి చేరేలా 28వేలకు పైగా కోల్డ్ చైన్ పాయింట్లును సిద్ధం చేయనున్నామన్నారు. దీంతోపాటు రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిల్లో ఏర్పాటు చేసిన బృందాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా టీకా పంపిణీని పర్యవేక్షిస్తాయన్నారు. అలాగే లబ్ధిదారుల నమోదు, టీకాలను వేసేందుకు ఒక డిజిటల్ వేదికను కూడా సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

వైరస్ ఎపుడు ఎలా విస్తరిస్తుందో అర్థం కావడం లేదని , ఒకసారి ఆ రాష్ట్రంలో కరోనా హాట్ స్పాట్ అనగానే , అక్కడ మళ్లీ తగ్గిపోతుందని , మరోచోట విజృంభిస్తుందని అందుకే అక్టోబర్ 20న దేశానికి తాను ఇచ్చిన సందేశంలో చెప్పినట్టుగానే ఫేస్ మాస్క్, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమైందని పునరుద్ఘాటించారు.  ఇకపోతే ,కరోనా వైరస్ కేసులు 80 లక్షలను దాటేసింది. మరణించిన వారి సంఖ్య 1,20,527 కు చేరుకుంది. దేశంలో గత 24 గంటల వ్యవధిలో 517 మంది ప్రాణాలు కోల్పోయారు.  
Tags:    

Similar News