అధ్యక్షుడు ఎవరో తేల్చే ఆ 4 రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది?

Update: 2020-11-06 05:30 GMT
అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 46 రాష్ట్రాల్లో ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది. ఒక వాదన ప్రకారం డెమొక్రాట్అభ్యర్థి జో బైడెన్ విజయానికి 6 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల దూరంలో ఉన్నట్లు చెబుతుంటే.. మరో వాదన ప్రకారం గెలుపు కోసం బైడెన్ 17 ఓట్ల అవసరం ఉందంటున్నారు. ఫలితాలు రావాల్సిన నాలుగు రాష్ట్రాలే.. విజేతను డిసైడ్ చేయనున్నాయి. ఆ రాష్ట్రాలేం చెబితే.. వారే శ్వేతసౌధానికి కాబోయే అధినేతగా చెప్పాలి. మరి.. ఆ నాలుగు రాష్ట్రాల్లో ఇప్పుడేం జరుగుతుందన్నది చూస్తే..

నార్త్ కరోలినా
మొత్తం పోలైన ఓట్లలో 95 శాతం లెక్కించారు. ఇక్కడ ట్రంప్ అధిక్యతలో ఉన్నారు. ట్రంప్ 50.1 శాతం ఓట్లు సాధిస్తే.. బైడెన్ కు 48.7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. లెక్కించాల్సిన ఓట్లు చాలా తక్కువగా ఉండటంతో.. 1.4 శాతం ఓట్లను కవర్ చేసి.. ట్రంప్ కంటే అధిక్యతలో నిలిస్తేనే బైడెన్ కు తిరుగు ఉండదు. కాకుంటే.. ఇక్కడి ఐదు శాతం ఓట్లను లెక్కించటానికి మరికొంత సమయం పడుతుంది. ఎందుకంటే.. పోస్టల్ ఓట్లను ఈ నెల 12 వరకుస్వీకరిస్తారు. అంటే.. ఇంకా ఆరు రోజులు. ఏడో రోజు మాత్రమే ఫలితం తేలే వీలుంది. ఈ రాష్ట్రంలో 15 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి.

పెన్సిల్వేనియా
నార్త్ కరోలినాతో పోలిస్తే ఇక్కడ లెక్కించాల్సిన ఓట్లు చాలానే ఉన్నాయి. ఎందుకంటే..ఇప్పటివరకు పోలైన ఓట్లలో 89 శాతం మాత్రమే లెక్కించారు. ఇంకా పదకొండు శాతం ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఇక్కడ కూడా ట్రంప్ అధిక్యతలో ఉన్నారు. ఇప్పటివరకు బైడెన్ కు 48.2 శాతం ఓట్లు వస్తే..ట్రంప్ నకు 50.5శాతం ఓట్లు వచ్చాయి. అంటే.. వీరిద్దరి మధ్య వ్యత్యాసం 2.3 శాతం. ఇంత భారీ వ్యత్యాసాన్ని బైడెన్ అధిగమిస్తారా? అన్నది సందేహం. అయితే.. పోస్టల్ బ్యాలెట్ లో తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని బైడెన్ భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే శుక్రవారం నాటికి రాష్ట్రంలో కౌంటింగ్ పూర్తి అవుతుందని చెబుతున్నారు. ఈ రాష్ట్రం ఒక్కటి సొంతమైతే.. 20 ఎలక్టోరల్ ఓట్లు వశమవుతాయి. ఈ రాష్ట్రంలో స్కోర్ బోర్డులో చాలనే మేజిక్ లు చోటు చేసుకుంటాయని చెప్పక తప్పదు.

నెవెడా
బైడెన్ కు అవసరమైన ఆరు ఓట్లను అందించే అవకాశం ఉన్న రాష్ట్రంగా చెప్పాలి. ఇక్కడ.. ఆరు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఇప్పటికి ఇక్కడ 88 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఈ రాష్ట్రంలో ట్రంప్ కంటే బైడెన్ అధిక్యతలో ఉన్నారు. ట్రంప్ నకు 48.7 శాతం ఓట్లు వస్తే.. బైడెన్ కు 49.3 శాతం ఓట్లు వచ్చాయి. అంటే.. వీరిద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.7శాతం మాత్రమే. ఇంత స్వల్ప అధిక్యతలో ఉన్న బైడెన్..అంతిమంగా విజయం సాధిస్తారా? తనకు అవసరమైన ఆరు సీట్లను సొంతం చేసుకుంటారా? అన్నది ప్రశ్న.

జార్జియా
తుది ఫలితాల్ని ప్రభావితం చేసే రాష్ట్రాల్లో జార్జియా కీలకమని చెప్పాలి. ఇక్కడ పోటీ నువ్వా.. నేనా అన్నట్లు సాగుతోంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఏకంగా 16. ఇక్కడ ఓట్ల లెక్కింపు దాదాపు 96 శాతం పూర్తి అయ్యింది. మిగిలిన రాష్ట్రాల కంటే కాస్త ముందుగా ఇక్కడి ఫలితం వెలువడుతుందని చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో బైడెన్ పై ట్రంప్ కేవలం 0.4 శాతం ఓట్లు మాత్రమే అధిక్యంలో ఉన్నారు. ఒకవేళ.. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఓట్లు లెక్కింపు చివరి 5 శాతం ఓట్లలో ట్రంప్ ను బైడెన్ అధిగమిస్తే.. శ్వేత సౌధానికి బైడెన్ అధినేత కానున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News