45 రాష్ట్రాల ఫలితాలు అదే రోజు వచ్చి.. 5 రాష్ట్రాల ఫలితాలు ఎందుకంత లేట్?

Update: 2020-11-06 02:30 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రెండో రోజు ముగిసినప్పటికి గెలుపు ఎవరిదన్నది తేలలేదు. ఇప్పటికి పీఠముడి వీడ లేదు.  యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నది 50 రాష్ట్రాల సమాహారం. అందులో 45 రాష్ట్రాల ఫలితాలు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టిన రోజునే దాదాపుగా పూర్తి కాగా.. ఐదు రాష్ట్రాల ఫలితం మాత్రం రెండో రోజు ముగిసిన తర్వాత కూడా ఫలితం ఇంకా ఎందుకు వెలువడటం లేదు? అన్న ప్రశ్న పలువురిలో కలుగుతోంది. దీనికి కారణం ఏమిటంటే.. పోస్టల్ ఓట్లు భారీగా నమోదు కావటం. వాటన్నింటిని ఓపెన్ చేసి.. స్కాన్ చేసి ఒక్కొక్క ఓటు ఫలితాన్ని నమోదు చేస్తుండటంతో ఆలస్యమవుతోంది.

ఉదాహరణకు జార్జియా రాష్ట్రాన్నే తీసుకుంటే.. ఈ స్టేట్ లో 16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ట్రంప్ దే అధిక్యం. ఓట్ల లెక్కింపు షురూ చేసిన మొదటి రోజున ఆయన అధిక్యత 18 వేలు ఉంటే.. రెండో రోజు ఓట్ల లెక్కింపులో ఆయన అధిక్యత 18 వేల నుంచి 13 వేలకు తగ్గిపోయింది. అంటే.. పోస్టల్ ఓట్ల లెక్కింపులో ట్రంప్ అధిక్యత అవిరి అవుతుంటే.. బైడెన్ పుంజుకుంటున్నారు. ఈ ఒక్క రాష్ట్రంలోనే ఇంకా లెక్కించాల్సిన ఓట్లు దాదాపు 50 వేలకు పైనే ఉన్నట్లు చెబుతున్నారు. యాభై వేల ఓట్ల కవర్లను ఓపెన్ చేయటం.. వాటిని చెక్ చేసి.. స్కాన్ చేసి.. ఫలితాన్ని నమోదు చేయటం అనే మాన్యువల్ వర్క్ గంటల పాటు సాగుతోంది. దీంతో.. ఆలస్యమవుతోంది.

అదే రీతిలో 15 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నార్త్ కరోలినా రాష్ట్రంలో ఇంకా లెక్కించాల్సిన ఓట్లు భారీగా ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి 12 గంటల నాటికి.. ఆ రాష్ట్రంలో లెక్కించాల్సిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏకంగా 1.06లక్షలు ఉన్నాయి. ఇలా ఐదు రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా నమోదు కావటంతో.. తుది ఫలితం అంతకంతకూ ఆలస్యమవుతోంది.
Tags:    

Similar News