రంగీలా భామకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్న సేన సర్కారు

Update: 2020-10-31 07:30 GMT
సాధారణంగా ప్రముఖ నటీనటులు.. సెలబ్రిటీలను పెద్దల సభ అయిన రాజ్యసభకు నామినేట్ చేయటం కనిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా.. తాజాగా రంగీల భామగా సుపరిచితురాలు.. ప్రముఖ నటి ఉర్మిళా మతోంద్కర్ కు తాజాగా మహారాష్ట్ర మండలిలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయనున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ జూన్ లో మహారాష్ట్ర శాసన మండలిలో గవర్నర్ కోటాలో 12 స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేసే దిశగా మహారాష్ట్ర సర్కారు కసరత్తు షురూ చేసింది.

పేరుకు గవర్నర్ నామినేట్ చేసినట్లుగా చెప్పినా.. ఆ జాబితాను ప్రభుత్వం ప్రతిపాదించటం.. గవర్నర్ ఓకే చెప్పటం రోటీన్ గా జరిగే అంశం. ఒకవేళ.. ఏదైనా వివాదం ఉంటే మాత్రం.. సదరు పేర్లను మార్చాలని గవర్నర్ కోరుతుంటారు. తాజాగా భర్తీ చేయనున్న 12 పదవుల్ని మహారాష్ట్ర సర్కారులో కీలకమైన శివసేన.. కాంగ్రెస్.. ఎన్సీపీలు పంచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. సేన తరఫున ప్రముఖ నటి ఉర్మళను ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. మరాఠా నటుడు అదేశ్ బండేకర్..సింగర్ ఆనంద్ షిండే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఉర్మిళను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తున్న విషయంపై సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.

తాను ఆ ఊహాగానాల్ని విన్నట్లు చెప్పారు. మండలికి ఎవరిని నామినేట్ చేయాలన్నది రాష్ట్ర కేబినెట్ హక్కుఅని.. ముఖ్యమంత్రి ఉద్దవ్ దానిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అంతే తప్పించి.. ఉర్మిళకు అవకాశం ఉందా? లేదా? అన్న విషయంపై మాత్రం ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్సీ పదవుల్ని మూడు పార్టీలు కలిసి జాబితాను ఫైనల్ చేస్తాయని చెప్పారు. రంగీల భామ కాబోయే ఎమ్మెల్సీనా? కాదా? అన్నది కాలమే సమాధానం ఇవ్వాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి  ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. మరి.. ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News