జగన్ పిలిస్తే అసెంబ్లీకి బాబు... ?

Update: 2021-11-28 03:30 GMT
చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇది జరిగి రెండు వారాలు దాటుతోంది. ఇకా ఎన్నికలకు రెండున్నరేళ్ల టైమ్ ఉంది. ఈ మధ్యలో చంద్రబాబు ఏం చేస్తారు, ఎలా జనాలను అట్రాక్ట్ చేస్తారు అన్నది ఒక చర్చ అయితే అసలు చంద్రబాబు అసెంబ్లీకి గుడ్ బై చెప్పడం మంచిదా కాదా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.

అసెంబ్లీకి వెళ్ళి తమ సమస్యల మీద మాట్లాడమనే ఏ ఎమ్మెల్యేను అయినా జనాలు ఓటేసి పంపిస్తారు. అలా గెలిచిన వారు నడి మధ్యలో సభకు నమస్కారం అనడం ఎంతవరకూ సమంజసం అన్నది అతి పెద్ద ప్రశ్న.

దేశంలో పలు రాష్ట్రాల్లో ఇలా జరగడం అంతా చూశారు కానీ పార్లమెంట్ లో ఎపుడూ జరగలేదు. అయితే 1988 టైమ్ లో అంటే ఎన్నికలకు ఏడాది మాత్రమే వ్యవధి ఉన్న వేళ బోఫోర్స్ కుంభకోణం ఇష్యూ మీద అప్పటి ప్రతిపక్ష సభ్యులు అంతా పార్లమెంట్ కి రామ్ రామ్ అనేశారు. అయితే వారు తమ‌ సభ్యత్వాలకు నాడు రాజీనామాలు చేసి చరిత్ర సృష్టించారు. అంతే తప్ప తాము సభకు రామని చెప్పి బయట ఆ హోదాను అనుభవిస్తూ జీతాలు వగైరా పుచ్చుకోలేదు. ఆ తరువాత ఎన్నికల్లో విపక్ష కూటమి నేషనల్ ఫ్రంట్ కట్టి గెలిచింది కూడా.

ఇక రాష్ట్రాల్లో తీసుకుంటే తమిళనాడు లో జయలలిత ఇలా అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. నాడు ఆమెను సభలో దారుణంగా అవమానం చేశారు. ఇక ఎన్టీయార్ విషయం తీసుకుంటే అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్తే వారందరితో పాటు తన సీటులో కూర్చున్న ఎన్టీయార్ ని కూడా స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.

దానికి ఆవేశపడిన ఎన్టీయార్ సభను బహిష్కరించారు. అయితే అప్పట్లో ఎన్టీయార్ సినిమాలు చేసుకుంటూ సభకు వదిలారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్టీయార్ సభను వదిలేసినా టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయకత్వాన అసెంబ్లీలో నిలిచి పోరాడారు.

అయితే జగన్ సభకు బాయ్ కాట్ చేస్తే మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు సభకు దూరం కావడం కొత్త చరిత్ర. ఇపుడు చంద్రబాబు సభకు రాను అంటున్నారు. మరి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్తారా వెళ్లరా అన్నది చూడాలి. ఏది ఏమైనా చంద్రబాబు సభను వదిలి రావడం మంచిది కాదు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు.

బాబు సభను వదలడం ద్వారా రాష్ట్రానికి మేలు చేయలేరని కూడా హితవు చెప్పారు. సభలో ఉన్నవే రెండు పార్టీలు, టీడీపీ సభను వదిలితే ఇక ప్రజా సమస్యలు కనీసం కూడా చర్చకు రావు అని ఉండవల్లి అంటున్నారు. చంద్రబాబు సభకు వెళ్ళి మూడు రాజధానుల అంశంతో పాటు అనేక విషయాలను చర్చించాలని ఆయన సూచించారు.
4

ఇక చంద్రబాబౌ లాంటి వారిని గౌరవించడం జగన్ నేర్చుకోవాలని జగన్ కి ఉండవల్లి సూచించడం విశేషం. చంద్రబాబు సభకు రాను అని వెళ్లిపోవడం వెనక జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు కాబట్టి జగన్ స్వయంగా బాబుని సభకు రావాలని పిలిస్తే బాగుంటుంది అంటున్నారు. సరే ఉండవల్లి మంచి మాటే చెప్పారు. అధికార విపక్షాలు రెండూ దెబ్బలాడుకోకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కోరుకున్నారు. కానీ జగన్ చంద్రబాబు ఉప్పూ నిప్పులా ఉంటారు కదా. చంద్రబాబు సభ నుంచి వెళ్ళిపోయారు. ఇపుడు జగన్ పిలిస్తే వస్తారా.

ఒకవేళ వచ్చిన తరువాత మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేలు ఏదో అంటే అయన వెళ్ళిపోతే ఇలా ఇది ఎపుడూ తేలని కధలాగానే ఉంటుంది. ఏది ఏమైనా ఉండవల్లి చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు సీనియర్ నేత, విపక్ష నాయకుడు, ఆయన బాధ్యతగా సభకు వెళ్లి ప్రజా సమస్యల మీద చర్చించడం మాత్రం అంతా కోరుకునే విషయం. అలా బాబులో మార్పు వస్తుందా. చూడాలి.




Tags:    

Similar News