కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ట్విస్ట్‌.. పోటీకి ఆయ‌న కూడా!

Update: 2022-09-30 07:14 GMT
కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టుల‌తో కొన‌సాగుతున్నాయి. మొద‌టి నుంచి అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల త‌ర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ప‌ద‌వికి తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శిథ‌రూర్‌, రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లోత్ పేర్లు ఖ‌రార‌యిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే రాజ‌స్థాన్‌లో ముఖ్య‌మంత్రి మార్పుకు సంబంధించిన వ్య‌వ‌హారంలో అశోక్ గెహ్లోత్ వ‌ర్గానికి చెందిన 92 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానానికి షాకివ్వ‌డం తెలిసిందే. గ‌తంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తిరుగుబాటు లేవ‌నెత్తిన స‌చిన్ పైల‌ట్‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌డానికి తాము అంగీక‌రించ‌బోమ‌ని.. త‌మ‌లోనే ఒక‌రిని సీఎంగా ఎన్నుకోవాల‌ని అధిష్టానానికి ఆల్టిమేటం జారీ చేసిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో అధిష్టానం పంపిన దూత‌ల‌ను సైతం రాజ‌స్థాన్ ఎమ్మెల్యేలు లెక్క‌చేయ‌లేదు.

ఈ ప‌రిణామాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కాంగ్రెస్ అధిష్టానం అధ్య‌క్ష ఎన్నిక‌ల నుంచి అశోక్ గెహ్లోత్ ను త‌ప్పించింది. అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి అనూహ్యంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజ‌య్ సింగ్ తెర‌పైకి వ‌చ్చారు. ఇక దిగ్విజ‌య్ సింగ్, శ‌శిథ‌రూర్ మాత్రం ఎన్నిక‌ల బ‌రిలో ఉంటార‌ని, వీరిద్ద‌రే అధ్య‌క్ష ప‌దవికి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో శ‌శిథ‌రూర్‌.. దిగ్విజ‌య్ సింగ్‌ను క‌లిశారు. త‌మ‌లో ఎవ‌రు గెలిచినా మ‌రొక‌రం బాధ‌ప‌డ‌బోమ‌ని శశిథ‌రూర్ తెలిపారు.

అయితే ఇంత‌లోనే ఎన్నిక‌ల బ‌రిలోకి మూడో వ్య‌క్తిగా కేంద్ర మాజీ మంత్రి, కర్ణాట‌క కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే వ‌స్తార‌ని అంటున్నారు. అధిష్టానం (సోనియా గాంధీ, రాహుల్ గాంధీ) మొగ్గు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే వైపే ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మకు అత్యంత విశ్వ‌స‌నీయపాత్రుడైన మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేను ఎన్నిక‌ల బ‌రిలో దింపాల‌ని సోనియా భావిస్తున్న‌ట్టు స‌మాచారం. సోనియా.. ఇందుకు అంగీక‌రిస్తే మ‌ల్లిఖార్జున ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. దీంతో అధ్యక్ష ఎన్నిక‌ల బరిలో ముగ్గురు ఉన్న‌ట్టు అవుతుంది. శ‌శిథ‌రూర్, దిగ్విజ‌య్ సింగ్, మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేల పోటీతో త్రిముఖ పోరు జ‌ర‌గ‌నుంది.

అయితే.. మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దిగ్విజయ్ సింగ్‌.. ఢిల్లీలోని మ‌ల్లిఖార్జున‌ ఖర్గే నివాసానికి వెళ్ల‌డం విశేషం. పోటీలో ఉండాలంటే సెప్టెంబ‌ర్ 30 శుక్ర‌వారం మధ్యాహ్నం 3 గంటల్లోపు వీరు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. అయితే సోనియా గాంధీకి అత్యంత విశ్వాస‌పాత్రుడైన మ‌ల్లిఖార్జున‌ ఖర్గే ఎన్నిక‌ల బరిలో ఉండటంతో దిగ్విజయ్ సింగ్‌ పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా క‌ర్ణాట‌క‌కు చెందిన మల్లిఖార్జున ఖ‌ర్గే ద‌ళిత వ‌ర్గానికి చెందిన‌వారు. 8 సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు లోక్ స‌భ ఎంపీగా ప‌నిచేశారు. గ‌తంలో లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా, రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ పక్ష నేత‌గా మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
4

మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని జీ-23 నేతలు కూడా భావిస్తున్నట్లు స‌మాచారం. దీనిపై చర్చించేందుకు సీనియర్ నేతలు.. మాజీ ముఖ్య‌మంత్రులు పృథ్విరాజ్ చవాన్, భూపిందర్ హుడా, సీనియ‌ర్ మనీశ్‌ తివారీ... ఆనంద్ శర్మ నివాసంలో స‌మావేశ‌మైన‌ట్టు తెలుస్తోంది. అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌కు సెప్టెంబర్ 30 చివరి తేది. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహించి అదే నెల 19న ఫలితాలు ప్రకటిస్తారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News