టీవీ చాన‌ళ్ల‌లో చ‌ర్చ‌ల వ‌ల్లే.. అస‌లు కాలుష్యం! సుప్రీం కోర్టు సంచ‌ల‌న కామెంట్లు

Update: 2021-11-18 03:30 GMT
కాలుష్యానికి సంబంధించిన అంశంపై సుప్రీం కోర్టు తాజాగా కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చింది. అందుకు పంట వ్యర్థాలను తగలబెట్టటం, వాహనాలు, పరిశ్రమల ద్వారా వెలువడే విషవాయువులు కారణమని అంద‌రూ అంగీక‌రించేదే. అయితే.. టీవీ ఛానళ్లలో చర్చల వల్లే అన్నింటికంటే ఎక్కువ కాలుష్యం ఏర్పడుతోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఒక్క‌సారిగా అంద‌రూ నివ్వెర పోయారు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవ‌డంపై సుప్రీం కోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో సుమోటోగా ఈ అంశాన్ని విచారిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ప్ర‌భుతత్వం లాక్ డౌన్ విధిస్తున్న‌ట్టు తెలిపింది.

అయితే.. దీనిపై టీవీ చాన‌ళ్ల‌లో జ‌రుగుతున్న చ‌ర్చ‌లు.. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయ‌ని.. సుప్రీం కోర్టు అభిప్రాయ‌ప‌డింది. కోర్టు ముందుకు వచ్చిన అంశాలను డిబేట్లలో పరిగణనలోకి తీసుకోకపోవటమే అందుకు కారణంగా పేర్కొంది. ప్రతి ఒక్కరికి సొంత అజెండా ఉందని, ఆయా చర్చల్లో నిజమైన కారణాలు పక్కకు వెళ్లిపోతున్నాయని అభిప్రాయపడింది. ఈ మేర‌కు సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. చిన్న, సన్నకారు రైతులకు పంటవ్యర్థాలను తొలగించే యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయాలని పర్యావరణ కార్యకర్త ఆదిత్య దుబే, న్యాయవిద్యార్థి అమన్ బంకా దాఖలు చేసిన పిటిషన్లపై ధ‌ర్మాస‌నం విచారణ చేపట్టింది.

ఒక అంశాన్ని ఉపయోగించి వివాదాస్పదంగా మార్చాలనుకుంటున్నారు. అలా జరిగితే నిందలు మాత్రమే మిగులుతాయి. ఇతరుల కంటే టీవీ ఛానళ్లలోని చర్చలే ఎక్కువగా కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. ఏం జరుగుతోంది, సమస్య ఏమిటి? అని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. కోర్టులోని అంశాలు పక్కకు వెళ్లిపోతున్నాయి. ప్రతి ఒక్కరికీ సొంత అజెండా ఉంది. అలాంటి వాటివల్ల ఉపయోగం లేదు. మేము ఎలాంటి సాయం చేయలేం. నియంత్రించలేం. ఒక పరిష్కారం కోసం పని చేస్తున్నాం. అని న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు.

 టీవీల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను ప్రస్తావిస్తూ.. పంట వ్యర్థాలను తగలబెట్టే అంశంపై న్యాయస్థానాన్ని తాను తప్పుదోవపట్టిస్తు న్నట్లు పేర్కొంటున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ' కొన్ని ఛానళ్లలో నాపై బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయటం నేను చూశాను. పంట వ్యర్థాలను కాల్చటం వల్ల కేవలం 4-7 శాతం మేర మాత్రమే ఉందని చూపించటం ద్వారా నేను కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నట్లు చెప్పారు. దానిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా.' అని పేర్కొన్నారు. అయితే.. తాము ఎప్పుడూ తప్పుదోవ పట్టలేదని, ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నప్పుడు అలాంటి విమర్శలు వస్తాయని ధర్మాసనం పేర్కొంది. మొత్తంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య‌లు.. టీవీ ఛాన‌ళ్ల చ‌ర్చ‌ల‌కు ప్ర‌భావం చూప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News