కొత్త అలవాటు; నోరు పారేసుకుంటే షోకాజ్ షాక్

Update: 2016-06-12 08:09 GMT
ఏం మాట్లాడినా నడిచిపోతుంది. ఏం అన్నా ఎవరూ పట్టించుకోరు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైన కాంగ్రెస్ పార్టీలో తరచూ వినిపించే మాటలివి. పార్టీ అధినేత్రి కానీ.. కీలక నేతల మీద కానీ నోరు పారేసుకుంటే తప్పించి.. మిగిలిన సందర్భాల్లో చూసీ చూడనట్లుగా వ్యవహరించే తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త అలవాటు ఒకటి పుట్టుకొచ్చింది. ఎవరి మీదనైనా కోపం ఉంటే చాలు.. చెలరేగిపోవటం.. వెనుకా ముందు చూసుకోకుండా విమర్శలు చేయటం కాంగ్రెస్ పార్టీలో కొత్తేం కాదు. అందుకు భిన్నంగా నోరు పారేసుకుంటున్న వారికి షోకాజ్ నోటీసులు ఇస్తూ షాకిస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీలో క్రమశిక్షణ తీసుకురావాలన్నఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కఠినంగా ఉండాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ మధ్యనే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన పార్టీ.. తాజాగా మరికొందరికి కూడా నోటీసులు జారీ చేసింది. తాజాగా నోటీసులు జారీ చేసిన పాల్వాయ్ తో పాటు.. ఆరెపల్లి.. మృత్యుంజయంలకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన పార్టీ.. కరీంనగర్ నేత శ్యాంసుందర్ పై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీకి నష్టం చేకూరేలా మాట్లాడే ఎవరిపైన అయినా సరే కఠినంగా వ్యవహరించాలని.. ఇందుకోసం నేతల స్థాయిల్ని అస్సలు పట్టించుకోకూడదన్నట్లుగా పార్టీ వైఖరిని కనిపిస్తోంది.
Read more!

ఈ తీరు కాంగ్రెస్ కు కొత్తని చెప్పాలి. ఇవే కాదు.. మీడియా సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా ఒక విధానాన్ని రూపొందించినట్లుగా తెలుస్తోంది. దశాబ్దాల కాలంలో ఇంత కఠినంగా వ్యవహరించే తీరు ఎవరూ ప్రదర్శించలేదన్నమాట పలువురు కాంగ్రెస్ నేతల నోటి నుంచి వినిపించటం గమనార్హం. ఈ మధ్యనే కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి.. కోవర్ట్ అంటూ మరో సీనియర్ నేత పాల్వాయ్ చేసిన విమర్శలపైనా సీరియస్ అయిన పార్టీ.. ఆయన్ను ఈనెల 17న గాంధీభవన్ కు రావాలంటూ ఆదేశాలు జారీ చేయటం గమనార్హం.

వీటితో పాటు.. మీడియా సమావేశాలు ఎవరు పడితే వారు కాకుండా.. ముందస్తుగా టీపీసీసీ కాంగ్రెస్ అధినేత లేదంటే మీడియా ఇన్ ఛార్జ్ అనుమతి తీసుకోవాలే తప్పించి ఎవరు పడితే వారు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకూడదన్న వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. తమకు తోచినట్లుగా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అలవాటు ఉన్న పార్టీ నేతలకు తాజా ఆంక్షలకు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News