ఆరోద‌శ‌.. మోడీ బ్యాచ్ కి అగ్నిప‌రీక్షే!

Update: 2019-05-12 05:26 GMT
వాతావ‌ర‌ణం సానుకూలంగా ఉన్న‌ప్పుడు మోడీలో మేనేజ్ మెంట్ గురు క‌నిపిస్తారు. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి ఎదురైన‌ప్పుడు ఆయ‌న‌లోని రాజ‌కీయ నేత నిద్ర లేస్తాడు. ఇప్ప‌టికి పూర్తి అయిన ఐదు ద‌శ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆ విష‌యం స్ప‌ష్టంగా అర్థం కాక మాన‌దు. త‌న‌కు ప‌ట్టు లేని చోట ఆయ‌న మాట‌ల‌కు.. త‌మ గెలుపు త‌థ్య‌మ‌న్న ధీమా ఉన్న చోట ఆయ‌న చేసే వ్యాఖ్య‌లు.. పోటీ హోరాహోరీ ఉన్న స్థానాల్లో ఆయ‌న ప్ర‌సంగాల్లో తేడా ఇట్టే క‌నిపిస్తోంద‌ని చెప్పాలి.

బీజేపీకి అగ్నిప‌రీక్ష లాంటి ఆరోద‌శ పోలింగ్ ఈ రోజు (ఆదివారం) జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా మోడీ ఎన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారో గ‌డిచిన కొద్ది రోజులుగా చూస్తున్న‌దే. ఎందుకిలా?  అంటే.. గ‌త ఎన్నిక‌ల్లో కేక్ వాక్ లాంటి చోట్ల‌.. ఈసారి పోటీ హోరాహోరీగా ఉండ‌టం.. వ్య‌తిరేక గాలి కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించ‌టం.. ప్ర‌త్య‌ర్థులు బ‌ల‌ప‌డ‌టం మోడీ మాష్టారిలోని మ‌రో కోణాన్ని బ‌య‌ట‌కు తెచ్చేలా చేసింది.

కేంద్రంలో మ‌రోసారి పాగా వేయాలంటే.. హిందీ రాష్ట్రాల్లో బంప‌ర్ మెజార్టీని సొంతం చేసుకోవాలి. కానీ.. అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌ని దుస్థితి. ఇప్ప‌టికే పోలింగ్ పూర్తి అయిన ఐదు ద‌శ‌ల్లో బీజేపీ వెనుక‌బ‌డిన‌ట్లుగా అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఈ రోజు పోలింగ్ జ‌రుగుతున్న ఆరో ద‌శ మ‌రింత ఇబ్బందిక‌రంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఐదు ద‌శ‌ల్లో మొత్తం 375 స్థానాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. వాటిల్లో ఎన్డీయే కూట‌మికి 160 స్థానాలు మాత్ర‌మే ల‌భించే వీలుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ రోజు ఏడు రాష్ట్రాలు (యూపీ.. హ‌ర్యానా.. మ‌ధ్య‌ప్ర‌దేశ్.. బిహార్.. ప‌శ్చిమ‌బెంగాల్.. ఢిల్లీ.. జార్ఖండ్) 59 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుతున్న పోలింగ్ బీజేపీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని తీసుకొచ్చింద‌ని చెబుతున్నారు. తాజాగా జ‌రుగుతున్న రాష్ట్రాల్లో అత్య‌ధికం బీజేపీ వ్య‌తిరేక గాలి వీస్తున్న‌ట్లుగా అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో ఈ 59 స్థానాల్లో ఎన్డీయే 45 స్థానాలు కైవ‌శం చేసుకుంటే.. ఈసారి అది 20 నుంచి 25కు ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

దీంతో ఆరు ద‌శ‌ల్లో క‌లుపుకొని 180 స్థానాల‌కు మించి గెల‌వ‌ని ప‌రిస్థితి ఎన్డీయేకు ఉంద‌న్న లెక్క‌లు వినిపిస్తున్నారు. దీంతో బీజేపీలో కొత్త గుబులు బ‌య‌లుదేరిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. చివ‌రిద‌శ‌లో జ‌రిగే 59 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ బ‌లం భారీగా పెర‌గ‌ని ప‌క్షంలో.. గౌర‌వ‌పూర్వ‌క స్థానాలు ల‌భించ‌ని ప‌రిస్థితి నెల‌కొంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా చూస్తే.. ఈ రోజు పోలింగ్ జ‌రుగుతున్న 59 నియోజ‌క‌వ‌ర్గాలు క‌మ‌ల‌నాథుల‌కు క‌ఠిన‌ప‌రీక్ష‌గా మారిన‌ట్లే.
Tags:    

Similar News