కేసీఆర్ నోరు తెరిచి సాయం అడుగుడా? అసలు లెక్క ఇదేనా?

Update: 2020-10-21 06:15 GMT
అసలేమవుతోంది? సంపన్న తెలంగాణ అంటూ సగర్వంగా చెప్పుకునే సీఎం కేసీఆర్ నోటి నుంచి వరదతో దెబ్బ తిన్నాం.. సాయం చేయండని అడగటం ఏమిటి? నిజానికి ఒక వరదకు.. భారీ వర్షానికే తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆగమాగం అవుతుందా? కేసీఆర్ నోరు తెరిచి అడిగిన తర్వాత కేంద్రం నుంచి ఎంతమేర నిధులు వస్తాయన్నది కాసేపు పక్కన పెడదాం. మిగిలిన వారు మాత్రం ఏమిస్తారు? ఎంతిస్తారు? ఎంతిస్తే మాత్రం.. అవెంత ఉపయోగపడతాయి? ఇలాంటి ప్రశ్నలు మదిలో మెదలకు మానవు.

అన్నింటికి మించిన సీఎం కేసీఆర్ లాంటి పెద్ద మనిషి నోటి నుంచి ఉత్తినే ఏ మాట రాదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు ఏదో లెక్క ఉంది.  తాను సాయం చేయమని అడిగితే.. దాని కారణంగా వచ్చేవి ఎంతన్నది కేసీఆర్ కు తెలీదా? అంత అమాయకుడేం కాదు? అలాంటి ఆయన ఎందుకు అడుగుతున్నట్లు? అన్నదిప్పుడు చర్చగా మారింది. దేశ సరిహద్దుల్లో చైనావోళ్లను చావుదెబ్బ తీసి.. ఆ పోరాటంలో వీరమరణం పొందిన కల్నల్ కుటుంబానికే ఏకంగా రూ.5కోట్ల చెక్కు ఇచ్చిన దొడ్డ మనసు కేసీఆర్ ది. అలాంటి ఆయన.. ఎవరెవరో ఇచ్చే విరాళాల గురించి ప్రకటన చేయటం.. అందుకు స్పందించిన తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు.. ఢిల్లీ సర్కారు రూ.15కోట్లు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రూ.15కోట్ల సాయాన్ని ప్రకటించారు.  వారి నుంచి ప్రకటనలు వెలువడిన  వెంటనే దానికి కేసీఆర్ అండ్ టీ థ్యాంక్స్  చెప్పటం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10.. రూ.15 కోట్లు సాయంగా ఇవ్వటం ఏమిటన్న చర్చ నడుస్తోంది.

విపత్తు వేళ.. విరాళాలు ఇవ్వాల్సిన భారం ఎప్పుడూ సెలబ్రిటీలదే.  క్రీడాకారుల కంటే కూడా సినిమా సెలబ్రిటీల మీద అందరి చూపులు ఉంటాయి. అందుకే వారు.. తమకు తోచినంత ప్రకటించేవారు. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇప్పుడు సినీ హీరోలు.. హీరోయిన్లు ఇచ్చే విరాళాల మీదన చర్చ జరగటం.. ఎవరైనా తక్కువ ఇస్తే.. ఏకి పారేస్తున్నారు. దీంతో.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మరీ విరాళాలు ప్రకటించాల్సి వస్తోంది. ఈ కారణంతోనే కావొచ్చు..  ఇప్పటివరకు ప్రకటించిన సినీ తారలు చాలా జాగ్రత్తగా యాభై లక్షలు.. కోటి.. ఇలా విరాళాలు ప్రకటిస్తున్నారు.

తన రాష్ట్రానికి చెందిన వారికి ఏదైనా అయితే.. కోట్ల లెక్కన పరిహారం.. సాయం ప్రకటించే కేసీఆర్.. నోరు తెరిచి అడిగితే.. ప్రముఖులు లక్షలు మాత్రమే ప్రకటించటం చూస్తే.. కనీసం 500 కోట్లు అయినా వస్తాయా? అన్నది సందేహమే. కాకుంటే.. ఇలా అడగటం వెనుక అసలు లెక్క బయటకు రాకున్నా.. స్వాభిమానం ఎక్కువగా ఉండే సారు నోటి నుంచి సాయం చేయాలన్న మాట రావటం చాలా పెద్ద విషయమే అన్న మాట.. ఆయన గురించి ఎరిగిన వారంతా చెబుతున్నారు. ఈ రోజు ఇచ్చే సాయం లెక్క రేపొద్దున లెక్కలోకి వస్తుందన్న ప్రచారం బాగానే సాగుతోంది. చూడాలి మరి.. ఏం జరుగుతుందో?
Tags:    

Similar News