జగన్ ఓటమికి ‘ఆ రెండే’ కారణాలవుతాయట

Update: 2021-12-28 00:30 GMT
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కొత్త విషయాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అభిమానిస్తానని చెప్పుకుంటూ విమర్శించే ఈ ఎంపీ గారు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి తప్పదని జోస్యం కూడా చెప్పారు. ఓటమికి కారణాలను కూడా ముందే అంచనా వేసేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీఎస్ స్కీం, వాలంటీర్ల వ్యవస్ధలు రెండు జగన్ ప్రభుత్వం ఘోర ఓటమికి ప్రధాన కారణాలు అవబోతున్నట్లు అంచనా వేశారు.

పనిలోపనిగా ప్రతిపక్షాలకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అవేమిటంటే ఓటీఎస్ పథకాన్ని, వాలంటీర్ల వ్యవస్ధను రద్దు చేస్తామని ఎవరైతే హామీ ఇస్తారో వాళ్ళకు దాదాపు కోటి ఓట్లు బోనస్ గా వస్తాయని రాజు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఓ టీవీ ఛానల్ తో ఈ ఎంపీ మాట్లాడుతూ ఓటీఎస్ పథకం, వాలంటీర్ల వ్యవస్ధ రెండు చాలా దుర్మార్గమన్నారు. ఈ రెండింటిపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోందన్నారు.

పార్టీతో పాటు ప్రభుత్వానికి బాగా చెడ్డపేరు తెస్తున్న పై రెండింటిని అమలు చేయమని జగన్ కు ఎవరు చెప్పారో అర్ధం కావడం లేదన్నారు. అంతా బాగానే ఉంది కానీ జగన్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉందా లేదా అన్నది వాస్తవానికి ఎక్కడా ప్రూవ్ కాలేదు. సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న వ్యాఖ్యలను బట్టి జరుగుతున్న అంచనాలు ఇవన్నీ. నిజంగానే జగన్ ప్రభుత్వంపై జనాల్లో అంత వ్యతిరేకతే ఉంటే మరి రాజుగారు ఎందుకు ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారన్నది ఒక ప్రశ్న.

బంగారం లాంటి అవకాశాన్ని తన చేతిలోనే ఉంచుకుని కూడా రాజు సమయాన్ని అనవసరంగా వేస్టు చేస్తున్నారు. బహుశా పుణ్యకాలమంతా అయిపోయిన తర్వాత అప్పుడు రాజీనామా చేస్తారేమో చూడాలి.


Tags:    

Similar News